కు.ని. మరణాలపై సర్కారు కన్నెర్ర

రాష్ట్రవ్యాప్తంగా గత నెలలో సంచలనం రేపిన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల ఘటనపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఇక్కడ శస్త్రచికిత్స చేయించుకున్న అనంతరం నలుగురు మహిళలు మృతిచెందిన ఘటనపై నియమించిన

Published : 25 Sep 2022 02:40 IST

శస్త్రచికిత్స చేసిన వైద్యుడిపై క్రిమినల్‌ కేసు

రంగారెడ్డి డీఎంహెచ్‌వో, డీసీహెచ్‌ఎస్‌ల బదిలీ

మొత్తం 13 మందిపై చర్యలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా గత నెలలో సంచలనం రేపిన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల ఘటనపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఇక్కడ శస్త్రచికిత్స చేయించుకున్న అనంతరం నలుగురు మహిళలు మృతిచెందిన ఘటనపై నియమించిన కమిటీ నివేదిక ఆధారంగా శనివారం కఠిన చర్యలు తీసుకుంది. రంగారెడ్డి జిల్లా వైద్యశాఖాధికారి(డీఎంహెచ్‌వో) స్వరాజ్యలక్ష్మి, జిల్లా ఆసుపత్రుల వైద్య సేవల సమన్వయకర్త(డీసీహెచ్‌ఎస్‌) ఝూన్సీలక్ష్మిపై బదిలీ వేటు వేసింది. కు.ని. శస్త్రచికిత్సలు చేసిన డాక్టర్‌ జోయల్‌ సునీల్‌ కుమార్‌పై క్రిమినల్‌ కేసు నమోదుచేయాలంది. ఇప్పటికే ఆయన లైసెన్సు రద్దుచేసిన సంగతి తెలిసిందే.  వీరితో పాటు మొత్తం 13 మంది వైద్య సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఇబ్రహీంపట్నం ఆసుపత్రి కు.ని. క్యాంపు అధికారి, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ నాగజ్యోతి, డిప్యూటీ సివిల్‌ సర్జన్‌ డాక్టర్‌ గీత, హెడ్‌ నర్స్‌ చంద్రకళలను సస్పెండ్‌ చేసింది. 

డీసీహెచ్‌ఎస్‌ ఝాన్సీలక్ష్మిని షాద్‌నగర్‌ ఆసుపత్రిలో రిపోర్ట్‌ చేయాలని సర్కారు ఆదేశించింది.మాడ్గుల, మంచాల, దండుమైలారం పీహెచ్‌సీ వైద్యులు డాక్టర్‌ శ్రీనివాస్‌, డాక్టర్‌ కిరణ్‌, డాక్టర్‌ పూనం.. ఈ ఆసుపత్రుల సూపర్‌వైజర్లు అలివేలు, జయలత, జానకమ్మలపై కూడా చర్యలుంటాయని పేర్కొంది. ఇప్పటికే సస్పెండైన ఇబ్రహీంపట్నం ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రీధర్‌పైనా క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌వో స్వరాజ్యలక్ష్మిని కుటుంబ సంక్షేమ కమిషనర్‌ కార్యాలయంలో జేడీగా నియమించారు. ఆమె స్థానంలో మెదక్‌ డీఎంహెచ్‌వో బి.వెంకటేశ్వరరావు నియమితులయ్యారు. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ డిప్యూటీ డీఎంహెచ్‌వోగా ఉన్న బి.విజయనిర్మలకు మెదక్‌ ఇన్‌ఛార్జి డీఎంహెచ్‌వోగా బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు శనివారం వైద్యఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిలో గత నెల 24న 34 మంది మహిళలకు కు.ని. శస్త్రచికిత్సలు చేశారు. మూడ్రోజుల తర్వాత కొందరు మహిళలు జ్వరం, వాంతులు, విరేచనాలతో వివిధ ఆసుపత్రుల్లో చేరారు. 28న నర్సాయిపల్లికి చెందిన మమత, ఆ తర్వాత మంచాల మండలం లింగంపల్లి వాసి సుష్మ, సీతారాంపేటకు చెందిన లావణ్య, కొలకులపల్లికి చెందిన మౌనిక మరణించారు. డీహెచ్‌ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అయిదుగురు నిపుణుల కమిటీని ప్రభుత్వం నియమించింది. శస్త్ర చికిత్సల నిర్వహణలో అధికారులు, వైద్యుల వైఫల్యం ఉన్నట్లు విచారణలో తేలడంతో కఠిన చర్యలు తీసుకుంది.

భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కు.ని. ఆపరేషన్ల నిర్వహణలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అదే ఉత్తర్వుల్లో వైద్యఆరోగ్యశాఖ సూచించింది. కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది.

* ఆసుపత్రుల సేవల్లో భాగంగా నిర్ణయించిన రోజులో మాత్రమే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాలి. శస్త్ర చికిత్సల అనంతరం 24 గంటల పాటు విధిగా పర్యవేక్షించాలి. తొలుత నిర్ణయించిన క్యాలెండర్‌ ప్రకారం.. కు.ని చేయించుకునే మహిళలు వారికి అనుకూలంగా ఉన్న రోజుల్లో రావొచ్చు.

* శస్త్రచికిత్స తర్వాత డిశ్చార్జ్‌ అయి ఇంటికి వెళ్లిన మహిళలను ఆసుపత్రి సూపర్‌వైజర్‌ 24 గంటల్లోగా ఒకసారి తప్పనిసరిగా పరిశీలించాలి. తర్వాత వారంలో రెండుసార్లు విధిగా వెళ్లి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవాలి. పీహెచ్‌సీ పరిధిలో కు.ని. ఆపరేషన్లు చేయించుకున్న వారందరినీ సంబంధిత వైద్యుడు రెండ్రోజుల వ్యవధిలో వెళ్లి పరిశీలించాలి. సూపర్‌వైజర్లు పర్యవేక్షణ చేస్తున్నారా? లేదా? ఆరా తీయాలి.

* కు.ని.శస్త్ర చికిత్సలు చేసే ముందు, తర్వాత ప్రమాణాలు పాటించేలా సంబంధింత ఆసుపత్రి సూపరింటెండెంట్‌, వైద్యుడు, కు.ని క్యాంపు అధికారి చూసుకోవాలి. ఆపరేషన్ల తర్వాత తలెత్తే సమస్యలను గుర్తించేలా సూపర్‌వైజర్లకు ఎప్పటికపుడు శిక్షణ తరగతులు నిర్వహించాలి.

* ఏడాదికి ఒకసారి సర్జన్ల నైపుణ్యతను అంచనావేసేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. జాయింట్‌ డైరెక్టర్‌ ఆధ్వర్యంలో మూణ్నెల్లకు ఒకసారి స్టెరిలైజేషన్‌కు సంబంధించి కు.ని నిర్వహణ అధికారులు, సర్జన్లు, ఇతర సిబ్బందితో సమీక్ష నిర్వహించాలి.

* ఒకరోజు ఒక ఆసుపత్రిలో 30కి మించి ఆపరేషన్లు చేయరాదు. బోధన ఆసుపత్రులు, టీవీవీపీ ఆసుపత్రుల్లోని ఇన్ఫెక్షన్‌ కంట్రోల్‌ అధికారులు కిందిస్థాయి సిబ్బందికి ఇన్ఫెక్షన్ల నియంత్రణ నూతన పద్ధతులపై నిమ్స్‌లో శిక్షణ ఇవ్వాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని