పూల పండుగ వచ్చె ఉయ్యాలో..

కలవారి కోడలు ఉయ్యాలో... కనక మహాలక్ష్మి ఉయ్యాలో..ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ..... ఏమేమి కాయొప్పునే గౌరమ్మ..ఒక్కేసి పువ్వేసి చందమామా... ఒక్క జాము ఆయె చందమామా.....ఇలా బతుకమ్మ పాటలతో తెలంగాణ మార్మోగనుంది. హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌, రాజ్‌భవన్‌ మొదలుకొని..

Updated : 25 Sep 2022 08:00 IST

నేటి నుంచి బతుకమ్మ ఉత్సవాలు

ఈనాడు - హైదరాబాద్‌

కలవారి కోడలు ఉయ్యాలో... కనక మహాలక్ష్మి ఉయ్యాలో..

ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ..... ఏమేమి కాయొప్పునే గౌరమ్మ..

ఒక్కేసి పువ్వేసి చందమామా... ఒక్క జాము ఆయె చందమామా..

...ఇలా బతుకమ్మ పాటలతో తెలంగాణ మార్మోగనుంది. హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌, రాజ్‌భవన్‌ మొదలుకొని... మారుమూల పల్లెటూళ్లలోని ఇళ్లన్నీ ఉత్సాహభరిత వాతావరణంతో పూల వనాలుగా మారనున్నాయి. దిల్లీ, ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ ఆదివారం నుంచి తొమ్మిది రోజుల పాటు ఘనంగా జరగనుంది. మహిళలు, యువతులు, బాలికలకు ఎంతో ప్రీతిపాత్రమైన పండుగను తోబుట్టువులు, చిన్ననాటి స్నేహితులతో కలిసి ఆనందోత్సాహాల నడుమ చేసుకుంటారు. పుట్టినింట.. మెట్టినింట సుఖసంతోషాలు, ప్రేమానురాగాలను ఆకాంక్షిస్తూ ఇష్టదైవాలు, ప్రకృతి మాతలను కొలుస్తూ... శుభ, సామాజిక సందేశాలను ఈ పండుగ చాటుతుంది. తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మ..తర్వాత అటుకుల, ముద్దపప్పు, నానబియ్యం, అట్ల, అలిగిన, వేపకాయ, వెన్నముద్దల పేర్లతో బతుకమ్మ ఉత్సవాలు జరుగుతాయి. చివరిరోజు సద్దుల బతుకమ్మను ఘనంగా నిర్వహిస్తారు.

భారీగా ప్రభుత్వ ఏర్పాట్లు

బతుకమ్మ ఉత్సవాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది రూ.పది కోట్లను కేటాయించింది. హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాల్లో భారీగా ఏర్పాట్ల కోసం కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. బతుకమ్మ మైదానాల వద్ద విద్యుత్‌, మంచినీరు, పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలని సూచించింది. బతుకమ్మలను నిమజ్జనం చేసే ఘాట్ల వద్ద ప్రమాదాల నివారణ చర్యలకు ఆదేశించింది. ఉత్సవాల చివరి రోజు అక్టోబరు 3న రాజధానిలో ఎల్బీ స్టేడియం నుంచి వేల మంది మహిళలు, వెయ్యి మందికి పైగా జానపద గిరిజన కళాకారులతో బతుకమ్మలను ఊరేగింపుగా తీసుకువెళ్లి ట్యాంక్‌బండ్‌ వద్ద నిమజ్జనం చేస్తారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉత్సవాలు జరగనున్నాయి. రవీంద్రభారతిలో ప్రతిరోజూ బతుకమ్మ ఉత్సవాలతో పాటు సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తారు. తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో సెప్టెంబరు 26, 27, 28 తేదీల్లో దేవీ వైభవ నృత్యోత్సవాలు, సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో మహిళా రచయితలు, కవయిత్రులతో సదస్సు, బతుకమ్మ విశిష్టతపై పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాలు చేపడతారు. అధికార భాషా సంఘం సారథ్యంలో అక్టోబరు 2న గన్‌పార్క్‌ వద్ద అమరవీరులకు నివాళిగా బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తారు. తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో.. కావూరి హిల్స్‌లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో మహిళా కళాకారులతో బతుకమ్మ పండుగ జరగనుంది. విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు ఉత్సవాల్లో పాల్గొననున్నారు.   రాష్ట్ర సాంస్కృతిక శాఖతో పాటు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలోనూ ఉత్సవాలు జరగనున్నాయి. ఇప్పటికే సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక గీతాలను ఆవిష్కరించారు. గవర్నర్‌ తమిళిసై ఆదివారం రాజ్‌భవన్‌లో బతుకమ్మ పండుగ నిర్వహిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని