పట్టణాలకూ పురస్కారాల పంట

తెలంగాణలోని పుర, నగరపాలికలకు పురస్కారాల పంట పండింది. రాష్ట్రంలోని 16 పుర,నగరపాలికలు జాతీయ స్థాయిలో స్వచ్ఛ సర్వేక్షణ్‌-2022 అవార్డులు దక్కించుకున్నాయి. కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణశాఖ జాతీయ

Published : 25 Sep 2022 02:40 IST

రాష్ట్రంలోని 16 పట్టణ స్థానిక సంస్థలకు ఉత్తమ స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులు

పారిశుద్ధ్య నిర్వహణ సేవలకు గుర్తింపు

సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ హర్షం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలోని పుర, నగరపాలికలకు పురస్కారాల పంట పండింది. రాష్ట్రంలోని 16 పుర,నగరపాలికలు జాతీయ స్థాయిలో స్వచ్ఛ సర్వేక్షణ్‌-2022 అవార్డులు దక్కించుకున్నాయి. కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణశాఖ జాతీయ స్థాయిలో పారిశుద్ధ్య కార్యక్రమాలకు సంబంధించిన సమస్యల పరిష్కారం, పారిశుద్ధ్య నిర్వహణకు స్టార్‌ రేటింగ్‌ ఇచ్చి వీటిని ఎంపిక చేసింది. దేశవ్యాప్తంగా 4,355 పట్టణ స్థానిక సంస్థల్లో ఈ స్వచ్ఛసర్వేక్షణ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, చెత్త రహిత వాణిజ్య ప్రాంతాలు, ప్రజా మరుగుదొడ్లు, సామాజిక సౌచాలయాల నిర్వహణ, ప్రజల అవగాహన, భాగస్వామ్యం, ఆవిష్కరణలు వంటి 90 అంశాలపై అధ్యయనం అనంతరం ఉత్తమ పట్టణ స్థానిక సంస్థలను ఎంపిక చేశారు.

దీంతోపాటు రాష్ట్రంలోని 142 పట్టణ స్థానిక సంస్థల్లో ఓడీఎఫ్‌ ప్లస్‌గా 70... ఓడీఎఫ్‌ డబుల్‌ ప్లస్‌గా 40 సంస్థలను, ఒక పట్టణ స్థానిక సంస్థను వాటర్‌ ప్లస్‌గా, మిగిలిన 31 పట్టణ స్థానిక సంస్థలను బహిరంగ మల విసర్జన రహిత పట్టణాలు(ఓడీఎఫ్‌)గా ప్రకటించింది. అవార్డులకు ఎంపికైన పట్టణ స్థానిక సంస్థలకు అక్టోబరు 1న దిల్లీలో స్వచ్ఛ మహోత్సవ్‌ అవార్డులను ప్రదానం చేస్తారు.

పురస్కారానికి ఎంపికైన పట్టణ సంస్థలు 

బడంగ్‌పేట, ఆదిభట్ల, భూత్పూర్‌, చండూరు, చిట్యాల, గజ్వేల్‌, ఘట్కేసర్‌, హుస్నాబాద్‌, కొంపల్లి, కోరుట్ల, కొత్తపల్లి, నేరేడుచర్ల, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌, సిరిసిల్ల, తుర్కయాంజల్‌, వేములవాడ

దేశానికి ఆదర్శంగా తెలంగాణ: కేటీఆర్‌

రాష్ట్రంలోని పురపాలికలు ఈ సంవత్సరం కూడా భారీగా స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులకు ఎంపిక కావడంపై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి పట్టణాలు గ్రామాల అభివృద్ధి పట్ల ఉన్న నిబద్ధతకు గత కొన్ని సంవత్సరాలుగా జాతీయ స్థాయిలో దక్కుతున్న అవార్డులే నిదర్శనమన్నారు. రెండ్రోజుల క్రితమే కేంద్రం ప్రకటించిన  గ్రామీణ స్వచ్ఛసర్వేక్షణ్‌ అవార్డుల్లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు. తాజాగా పట్టణ సంస్థలు విజయఢంకా మోగించాయన్నారు. పట్టణ అభివృద్ధి, పరిపాలన రంగాల్లో సైతం తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. అవార్డులకు ఎంపికైన 16 పట్టణ సంస్థల ప్రజాప్రతినిధులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్‌ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని పట్టణాల అభివృద్ధి కోసం అనేక విప్లవాత్మకమైన కార్యక్రమాలను చేపట్టామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పట్టణ ప్రగతి కార్యక్రమంతో  పౌరులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు.


సంస్కరణలతో ప్రగతికి పట్టం

స్వచ్ఛ సర్వేక్షణ్‌ పురస్కారాలపై సీఎం కేసీఆర్‌ ఆనందం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ సంస్కరణలతో తెలంగాణ పట్టణప్రగతి గుణాత్మక దిశగా సాగుతూ దేశానికే  ఆదర్శంగా నిలిచిందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని 16 పట్టణ స్థానిక సంస్థలకు కేంద్రం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2022 అవార్డులు రావడం పట్టణాల అభ్యున్నతిపై ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని సీఎం కేసీఆర్‌ అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమాలను సమర్థంగా నిర్వహిస్తూ దేశానికి తెలంగాణను ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేశారంటూ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌, ఆ శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది, భాగస్వాములైన అన్ని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఆయన అభినందించారు. ఇప్పటికే గ్రామీణ స్వచ్ఛ భారత్‌ మిషన్‌ కింద రాష్ట్రం పలు విభాగాల్లో 13 అవార్డులను గెలుచుకుని దేశంలో అగ్రస్థానం పొంది చరిత్ర సృష్టించిందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని