సంక్షిప్త వార్తలు (10)

పేస్కేలు, ఉద్యోగాల క్రమబద్ధీకరణ, వారసత్వ ఉద్యోగాల కల్పన కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా గ్రామ రెవెన్యూ సహాయకులు(వీఆర్‌ఏ) చేపట్టిన సమ్మె ఆదివారానికి 63వ రోజుకు చేరుకుంది. రూ.10,500 గౌరవ వేతనంపై పనిచేస్తున్న 22 వేల మంది

Updated : 25 Sep 2022 06:15 IST

63వ రోజుకు చేరిన వీఆర్‌ఏల సమ్మె

ఈనాడు, హైదరాబాద్‌: పేస్కేలు, ఉద్యోగాల క్రమబద్ధీకరణ, వారసత్వ ఉద్యోగాల కల్పన కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా గ్రామ రెవెన్యూ సహాయకులు(వీఆర్‌ఏ) చేపట్టిన సమ్మె ఆదివారానికి 63వ రోజుకు చేరుకుంది. రూ.10,500 గౌరవ వేతనంపై పనిచేస్తున్న 22 వేల మంది వీఆర్‌ఏలు ఆందోళనల్లో పాల్గొంటున్నారు. వేతనాలు నిలిచిపోవడంతో కుటుంబాలు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.


ఇంటర్‌బోర్డు కార్యదర్శిగా నవీన్‌ మిత్తల్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఇంటర్‌బోర్డు కార్యదర్శిగా, ఇంటర్‌ విద్యాశాఖ కమిషనర్‌గా కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌కు ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు(ఎఫ్‌ఏసీ) అప్పగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఇంటర్‌బోర్డు కార్యదర్శిగా కొనసాగుతున్న సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నందున ఆయన స్థానంలో నవీన్‌మిత్తల్‌ను నియమించారు. ఆయన అక్టోబరు 1 నుంచి కొత్త బాధ్యతల్లో కొనసాగనున్నారు.


పీఈసెట్‌లో 2264 మంది ఉత్తీర్ణత

ఈనాడు, హైదరాబాద్‌: వ్యాయామ విద్య (బీపీఎడ్‌, డీపీఎడ్‌) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పీఈసెట్‌లో 95.93 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 2360 మంది పరీక్షలకు(క్రీడా పోటీలు) హాజరు కాగా వారిలో 2264 మంది పాస్‌ అయ్యారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో శనివారం పీఈసెట్‌ ఫలితాలను ఛైర్మన్‌ లింబాద్రి విడుదల చేశారు. బీపీఎడ్‌లో 1393 మంది, డీపీఎడ్‌లో 871 మంది ఉత్తీర్ణులయ్యారు. కార్యక్రమంలో మహాత్మాగాంధీ వర్సిటీ వీసీ గోపాల్‌రెడ్డి, కన్వీనర్‌ సత్యనారాయణ పాల్గొన్నారు.


ఎరువుల రాయితీ తగ్గించడానికే పీఎం ప్రణామ్‌
తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆరోపణ

ఈనాడు, హైదరాబాద్‌: ఎరువుల రాయితీని పూర్తిగా తగ్గించడానికే కేంద్రం పీఎం ప్రణామ్‌ పథకాన్ని తీసుకొస్తోందని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు భాగం హేమంతరావు, పశ్య పద్మ శనివారం ఒక ప్రకటనలో ఆరోపించారు. ఎరువులపై రాయితీ భారం గత అయిదేళ్లుగా విపరీతంగా పెరిగిందని దీని నుంచి వైదొలగటానికే కేంద్రం పీఎం ప్రణామ్‌ను ప్రవేశపెడుతోందని విమర్శించారు. ఈ సంవత్సరం ఎరువులపై ఇవ్వాల్సిన రాయితీ రూ.2.25 లక్షల కోట్లు దాటే అవకాశముందని, ఈ భారాన్ని మోయలేకనే కేంద్ర ప్రభుత్వం దీన్ని తీసుకురానుందని వారు దుయ్యబట్టారు.


‘నష్టపోయిన విద్యుత్‌ బీసీ ఉద్యోగులకు పదోన్నతులివ్వాలి’

ఈనాడు, హైదరాబాద్‌: విద్యుత్‌ సంస్థల్లో గతంలో అనుసరించిన విధానాలతో నష్టపోయిన బీసీ ఉద్యోగులకు తక్షణం పదోన్నతులివ్వాలని విద్యుత్‌ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య, రాష్ట్ర అధ్యక్షుడు కె.కుమారస్వామి ఒక ప్రకటనలో కోరారు. విద్యుత్‌ సంస్థల్లో పదోన్నతుల్లో జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ఆర్‌.కృష్ణయ్య కరపత్రం విడుదల చేశారు. ఉద్యోగులకు న్యాయం చేసేందుకు చర్యలు తీసుకోకపోతే సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.


అసిఫేట్‌ పురుగుమందుపై నిషేధం

ఈనాడు, హైదరాబాద్‌: పంటలపై తెగుళ్ల నివారణకు చల్లే ‘అసిఫేట్‌ 75 శాతం ఎస్‌.పి.(బ్యాచ్‌ సంఖ్య ఏసీ001/22) రసాయన పురుగుమందు నాసిరకమని ప్రయోగశాల పరీక్షల్లో తేలింది. దీని అమ్మకాలు, నిల్వ, వినియోగంపై నిషేధం విధిస్తూ వ్యవసాయశాఖ ఉత్తర్వులు జారీచేసింది. భారత్‌ పెస్ట్‌కెమ్‌ అనే సంస్థ దీన్ని తయారుచేసి విక్రయిస్తోందని, ఎవరూ కొనవద్దని రైతులకు శాఖ సూచించింది.


సీఎస్‌ను కలసిన డిప్యూటీ కలెక్టర్లు

ఈనాడు, హైదరాబాద్‌: పదోన్నతులు కల్పించినందుకు కృతజ్ఞతగా పలువురు డిప్యూటీ కలెక్టర్లు, ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగా రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతంకుమార్‌ శనివారం సచివాలయంలో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ను కలిశారు. ఇతర పదోన్నతులు, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని సీఎస్‌కు విజ్ఞప్తి చేయగా సానుకూలంగా స్పందించారని ట్రెసా ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు.


కొత్తగా 99 కరోనా కేసులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో శనివారం కొత్తగా మరో 99 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 8,37,326కి చేరింది. తాజాగా 99 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కొవిడ్‌ నుంచి కోలుకుని ఆరోగ్యవంతులు అయినవారి సంఖ్య 8,32,510కి చేరింది. తాజా పరీక్షల్లో అత్యధికంగా హైదరాబాద్‌లో 50 పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మరో 1,92,846 టీకా డోసులు పంపిణీ చేశారు.


కార్మికుల కనీస వేతనాలు పెంచాలి

మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: పెరిగిన చమురు, నిత్యావసర సరకుల ధరలకు అనుగుణంగా కార్మికుల కనీస వేతనాలు పెంచాలని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శనివారం ఆయన గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో పెంచిన వేతనాలే తప్ప తెరాస అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్మికుల కనీస వేతనాలు పెంచలేదన్నారు. కేసీఆర్‌ సర్కార్‌కు కార్మికుల సంక్షేమంపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. కార్మికులను ఆదుకోవాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వం మీద ఉందని, లేకుంటే ప్రగతిభవన్‌ ముట్టడిస్తామని రాములు నాయక్‌ హెచ్చరించారు.


జనాభా ప్రాతిపదికన గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించాలి: బలరాం నాయక్‌

జనాభా ప్రాతిపదికన గిరిజనులకు రిజర్వేషన్లు ఇవ్వాలని కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఏ విధానం ప్రకారం గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు ఇస్తామంటున్నారని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం రిజర్వేషన్లు 50 శాతం దాటొద్దన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని