ఇంజినీరింగ్‌ ఫీజుల కథ మళ్లీ మొదటికి

ఇంజినీరింగ్‌ ఫీజుల ఖరారు వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) విచారణ పూర్తికావడంతో శనివారం జరిగే కమిటీ సమావేశంలో చర్చించి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని

Updated : 25 Sep 2022 06:12 IST

టీఏఎఫ్‌ఆర్‌సీ ఖరారు చేసిన రుసుములను అంగీకరించని 25 కళాశాలలు
కొత్త ఫీజులపై జీవోకు మరింత ఆలస్యం

ఈనాడు, హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌ ఫీజుల ఖరారు వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) విచారణ పూర్తికావడంతో శనివారం జరిగే కమిటీ సమావేశంలో చర్చించి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని చెప్పినా సాధ్యం కాలేదు. కమిటీ ఖరారు చేసిన ఫీజును 25 కళాశాలలు అంగీకరించకపోవడంతో మళ్లీ ఆ కాలేజీలను పిలిచి విచారణ జరపాలని నిర్ణయించారు. సమావేశంలో టీఏఎఫ్‌ఆర్‌సీ ఛైర్మన్‌ జస్టిస్‌ స్వరూప్‌రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి, కమిటీ సభ్య కార్యదర్శి వాకాటి కరుణ, రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి, జేఎన్‌టీయూహెచ్‌ ఉపకులపతి ఆచార్య కట్టా నర్సింహారెడ్డి, ఆడిటర్‌ లక్ష్మణ్‌రావు తదితరులు పాల్గొన్నారు.  సమావేశంలో కమిటీ ఖరారు చేసిన ఫీజులను సీబీఐటీ, నారాయణమ్మ, వర్ధమాన్‌, శ్రీనిధి, వీఎన్‌ఆర్‌ విజ్ఞానజ్యోతి, కేఎంఐటీ, స్టాన్లీ, మల్లారెడ్డి, సీఎంఆర్‌ గ్రూపుల్లోని కొన్ని కలిపి మొత్తం 25 కళాశాలలు అంగీకరించలేదు. ఆ కాలేజీలు హైకోర్టులో పిటిషన్‌ వేసేందుకు సిద్ధమవుతున్నాయి. అదే జరిగితే ఇప్పట్లో ఫీజుల వ్యవహారం తేలదు. విద్యార్థులు గందరగోళానికి గురవుతారు. అందుకే కళాశాలల అభ్యంతరాలు మరోసారి విని ...పరిశీలించాలని కమిటీ నిర్ణయించింది. కమిటీ సమావేశం అనంతరం జస్టిస్‌ స్వరూప్‌రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ తాము ఇంతకు ముందు నిర్ణయించిన ఫీజులకు 25 తప్ప మిగిలిన 148 కళాశాలలు అంగీకరించాయన్నారు. 

మళ్లీ రుసుముల మార్పు తప్పదా?

25 కళాశాలల ఫీజులపై విచారణ జరపాలని నిర్ణయించినందున కొన్ని కళాశాలల రుసుములు మళ్లీ మారే అవకాశం ఉంది. పెద్ద మొత్తంలో కాకున్నా స్వల్పంగా అయినా ఫీజు పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఉదాహరణకు సీబీఐటీకి రూ.14 కోట్ల మిగులు నిధులున్నాయని.. గత జులైలో ఖరారు చేసిన రూ.1.73 లక్షల ఫీజును రూ.1.12 లక్షలకు తగ్గించారు. ఆ కళాశాల యాజమాన్యం మాత్రం గతంలో హైకోర్టు సూచన మేరకు వసూలు చేసినవి కూడా అందులో ఉన్నాయని, వాటిని మినహాయించాలని కోరుతున్నట్లు తెలిసింది. అలాంటి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటారా? లేదా? అన్నది తేలాల్సి ఉంది.

రెండో విడత ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ వాయిదాకూ అవకాశం!

జులు ఖరారు కాకపోవడంతో ఈనెల 28వ తేదీ నుంచి మొదలుకావాల్సిన ఎంసెట్‌ రెండో విడత కౌన్సెలింగ్‌ను వాయిదా వేద్దామన్న ఆలోచనలో సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అంతర్గతంగా సమాలోచనలు జరుగుతున్నట్లు సమాచారం. దీనివల్ల ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న జోసా కౌన్సెలింగ్‌లో సీట్లు పొందే విద్యార్థులకు కూడా ఊరట కలుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని