త్వరలో మహిళా గురుకుల కళాశాలలు

గురుకులాల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం ఏటా రూ.3,300 కోట్లు ఖర్చు చేస్తోందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు చెప్పారు. తెలంగాణ రాకముందు ఇది కేవలం రూ.360 కోట్ల లోపే ఉండేదన్నారు. పదో తరగతి తర్వాత

Published : 25 Sep 2022 04:47 IST

కర్ణాటకలో ఇస్తున్న పింఛను రూ. ఏడు వందలే

ఇక్కడా డబుల్‌ ఇంజన్‌ సర్కారు వస్తే సంక్షేమం బంద్‌

మంత్రి హరీశ్‌రావు వెల్లడి

ఈనాడు, సంగారెడ్డి: గురుకులాల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం ఏటా రూ.3,300 కోట్లు ఖర్చు చేస్తోందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు చెప్పారు. తెలంగాణ రాకముందు ఇది కేవలం రూ.360 కోట్ల లోపే ఉండేదన్నారు. పదో తరగతి తర్వాత ఇంటర్‌, డిగ్రీ చదువుకునేలా అన్ని గురుకులాల స్థాయిని పెంచామన్నారు. ఇక్కడ చదువుకున్న పిల్లలు ఉన్నతంగా రాణిస్తున్నారన్నారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా న్యాయవిద్య, పీజీ కోర్సుల బోధనకు మహిళా గురుకుల కళాశాలలను ఏర్పాటు చేస్తామన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. మొగుడంపల్లిలో గిరిజన బాలికల గురుకులాన్ని ప్రారంభించి మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో గతంలో అన్ని గురుకులాలు కలిపి 298 ఉండగా.. తెలంగాణ ఏర్పడ్డాక ఆ సంఖ్య 980కి చేరింది. గిరిజన గురుకులాల్నే 103 అందుబాటులోకి తెచ్చాం. ఒక్కో విద్యార్థిపై రూ.లక్ష ఖర్చుచేస్తున్నాం. అన్ని వర్గాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ పాటుపడుతున్నారు. అందుకే సద్ది తిన్న రేవును తలవాలి. పొరుగున కర్ణాటకలో ఇస్తున్న పింఛను రూ.700 మాత్రమే. ఇక్కడ భాజపా వస్తే అదే పరిస్థితి ఉంటుంది. డబుల్‌ ఇంజన్‌ సర్కారు వస్తే సంక్షేమం నిలిచిపోతుంది. మహిళలకు వడ్డీలేని రుణాలను త్వరలోనే అందిస్తాం’’ అని హరీశ్‌రావు వివరించారు. కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్‌, ఎమ్మెల్యే మాణిక్‌రావు, జడ్పీ అధ్యక్షురాలు మంజుశ్రీ, కలెక్టర్‌ శరత్‌ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థినికి రూ.వెయ్యి బహుమతి

ఈ సందర్భంగా అక్కడి విద్యార్థినులకు మంత్రి హరీశ్‌రావు క్విజ్‌ పోటీ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏర్పాటైంది, గిరిజన సంక్షేమ మంత్రి ఎవరు, లీపు సంవత్సరంలో ఎన్ని రోజులుంటాయి, ఆడపిల్లల పెళ్లికి ప్రభుత్వం సాయం అందిస్తున్న పథకాల పేర్లేంటి.. ఇలా దాదాపు 15 ప్రశ్నలు అడిగారు. వీటన్నింటికీ అందరూ చకచకా సమాధానాలిచ్చారు. చివరగా కొండాపూర్‌ మండలం మాచేపల్లికి చెందిన విద్యార్థిని రాధను.. మంజీరా నదిపై నిర్మించిన ప్రాజెక్టు పేరేంటని అడిగారు. ఆమె సింగూరు అని ఠక్కున సమాధానమివ్వడంతో దసరాకు కొత్త దుస్తులు కొనుక్కో అంటూ హరీశ్‌రావు రూ.1000 అందించారు.

హైదరాబాద్‌కు వినిపించేలా చప్పట్లు కొట్టాలి: కలెక్టర్‌

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ శరత్‌ మాట్లాడుతూ.. తాను గిరిజన కుటుంబంలో పుట్టానని, అప్పట్లో నిత్యం 5 కిలోమీటర్లు నడిచి బడికి వెళ్లేవాడినని చెప్పారు. హైదరాబాద్‌ నిజాం కళాశాలలో డిగ్రీ చదువుతున్నప్పుడు నిత్యం బాబూఖాన్‌ భవనాన్ని చూసేవాడినని, అలాంటి భవనాన్ని ఇప్పుడు స్థానిక మొగుడంపల్లిలో చూసి ఇందులో చదువుకోవాలనిపిస్తోందని వ్యాఖ్యానించారు. జహీరాబాద్‌ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్న మంత్రి హరీశ్‌రావుకు ప్రజలు కృతజ్ఞతలు చెప్పేలా.. హైదరాబాద్‌ వరకు వినిపించేలా చప్పట్లు కొట్టాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని