వ్యర్థజలాలు.. పెద్ద సవాలు

శరవేగంగా పెరిగిపోతున్న పట్టణీకరణ వల్ల వెలువడుతున్న వ్యర్థజలాలు అనేక సమస్యలు సృష్టిస్తున్నాయి. వీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించడంపై దృష్టి పెట్టాలని నీతిఆయోగ్‌ సూచించింది. ఇప్పటికే మనదేశంలో పట్టణ ప్రాంతాల

Published : 25 Sep 2022 04:47 IST

పట్టణాల్లో కాలుష్య కాసారాలవుతున్న నీటివనరులు

28 శాతం మాత్రమే శుద్ధి చేస్తున్నారు

పునర్వినియోగంపై దృష్టి పెట్టాలి

నీతి ఆయోగ్‌ నివేదికలో వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: శరవేగంగా పెరిగిపోతున్న పట్టణీకరణ వల్ల వెలువడుతున్న వ్యర్థజలాలు అనేక సమస్యలు సృష్టిస్తున్నాయి. వీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించడంపై దృష్టి పెట్టాలని నీతిఆయోగ్‌ సూచించింది. ఇప్పటికే మనదేశంలో పట్టణ ప్రాంతాల నుంచి వెలువడుతున్న మురుగు, వ్యర్థ జలాలతో నదులు, చెరువులు, భూగర్భజలాలు తీవ్రంగా కలుషితమవుతున్నాయని ‘అర్బన్‌ వేస్ట్‌వాటర్‌ సినారియో ఇన్‌ ఇండియా’ పేరుతో విడుదల చేసిన తాజా నివేదికలో స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా 323 నదుల్లో 351 చోట్ల నీటి కాలుష్యాన్ని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పరీక్షించింది. 13 శాతం తీవ్రంగా, 17 శాతం మధ్యస్థంగా కాలుష్యం ఉన్నట్లు తేలింది. భారలోహాలు, ఆర్సినిక్‌, ఫ్లోరైడ్స్‌, విషపూరిత రసాయనాలున్నట్లు పలుచోట్ల గుర్తించారు. భూగర్భజలాలు ఎక్కువగా కలుషితమైనట్లు తేలింది. దేశవ్యాప్తంగా ఉన్న 1195 శుద్ధి ప్లాంట్లలో  102  పనిచేయడం లేదని గుర్తించారు.

నెక్నాంపూర్‌ చెరువు ఆదర్శం....

గ్రేటర్‌ హైదరాబాద్‌లో నీటిశుద్ధి కోసం చేపడుతున్న చర్యల గురించి నీతిఆయోగ్‌ నివేదికలో ప్రత్యేకంగా ప్రస్తావించింది. నెక్నాంపూర్‌ చెరువు నీటిలో కదులుతూ శుద్ధి చేసే ‘ఫ్లోటింగ్‌ ట్రీట్‌మెంట్‌ వెట్‌ల్యాండ్‌’ వల్ల నీటి శుద్ధి నిర్వహణ మెరుగ్గా ఉందని తెలిపింది. ఈ చెరువు నీటి శుద్ధి కోసం 3000 చదరపు అడుగుల రాఫ్ట్‌ ఏర్పాటుచేసి దానిపై 3500 మొక్కలను నాటారు. ఇది నీటిలో కదులుతుంటే మొక్కల అడుగుభాగాలు నీటిని శుద్ధి చేస్తుంటాయి.

నివేదికలోని ముఖ్యాంశాలు..

* భారతదేశ జనాభా 138 కోట్లకు చేరువైంది. వీరిలో 48.30 కోట్ల మంది పట్టణాల్లోనే నివసిస్తున్నారు. 2050 నాటికి పట్టణ జనాభా 87.70 కోట్లకు చేరుతుందని అంచనా.

* గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు అధికంగా ఉంటున్నాయి. 2050 నాటికి 70 శాతం మంది పట్టణాల్లోనే నివసిస్తారు. దీంతో ఆ ప్రాంతాల్లో స్వచ్ఛమైన నీటికి తీవ్ర కొరత ఏర్పడుతుంది. 

* మనదేశంలోని పట్టణ ప్రాంతాల్లో రోజుకు 72,368 మిలియన్‌ లీటర్ల(మి.లీ), గ్రామీణ ప్రాంతాల్లో 39,604 మి.లీ. వ్యర్థజలాలు వెలువడుతున్నాయి. కానీ వీటిలో 28 శాతం మాత్రమే శుద్ధి చేస్తున్నారు.మరో 4827 మి.లీ.నీటి శుద్ధికి ప్లాంట్లను నిర్మించాలనే ప్రతిపాదనలున్నాయి.ఇవి నిర్మించినా సమస్య తీరదు.

* మిగిలిన 72 శాతం జలాలను నదులు, చెరువులు, భూగర్భంలోకి వదులుతున్నారు. వీటని శుద్ధి చేసి తిరిగి వినియోగిస్తే విలువైన వనరుగా ఉపయోగపడతాయి. అయితే దీనికి అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. నగరాల్లో స్థలాల కొరత తీవ్రంగా ఉంది. నీటి ప్రవాహాలపై పక్కా సమాచారం లేకపోవడం, ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించకపోవడం లాంటి సవాళ్లు ఉన్నాయి. వ్యర్థజాలాల పునర్వినియోగంపై ప్రజల్లో విముఖత కూడా ఉంది. సమగ్ర సమాచారాన్ని ముందుంచి వారికి అవగాహన కలిగించాలి.

* ప్రపంచవ్యాప్తంగా తక్కువ వ్యయంతో వ్యర్థజలాల శుద్ధికి ఆధునాతన టెక్నాలజీలు అందుబాటులోకి వస్తున్నాయి. వాటిని వినియోగించుకునేందుకు స్థానిక ప్రభుత్వాలు చొరవచూపాలి.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts