సత్వర న్యాయం.. రాజ్యాంగ భావన

సత్వర న్యాయం అనేది రాత్రికి రాత్రి వచ్చిన ఆలోచన కాదని.. ఇది ఒక రాజ్యాంగ భావన అని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ అన్నారు. ఖమ్మంలో శనివారం న్యాయవాద పరిషత్‌ ఆధ్వర్యంలో ‘సత్వర

Published : 25 Sep 2022 04:47 IST

హైకోర్టు సీజే జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌

ఖమ్మం ఖానాపురం హవేలి, న్యూస్‌టుడే: సత్వర న్యాయం అనేది రాత్రికి రాత్రి వచ్చిన ఆలోచన కాదని.. ఇది ఒక రాజ్యాంగ భావన అని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ అన్నారు. ఖమ్మంలో శనివారం న్యాయవాద పరిషత్‌ ఆధ్వర్యంలో ‘సత్వర న్యాయం-న్యాయవాదుల పాత్ర’ అంశంపై రాష్ట్ర సదస్సు నిర్వహించారు. దీనికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ‘‘1950లో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఏకే గోపాలన్‌ కేసు నుంచి అత్యయిక పరిస్థితి అనంతరం మేనకాగాంధీ కేసుల వరకు అత్యున్నత న్యాయస్థానం రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21కు అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. 14, 19, 21 ఆర్టికల్‌లకు చెందిన అనేక కేసుల్లో ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛ, జీవించే హక్కులకు భరోసా ఇచ్చింది. పౌరుల హక్కులకు సంబంధించిన ఈ మూడు ఆర్టికల్‌లకు ఒకదానితో మరోదానికి ఎలా అంతర్గత సంబంధముందో అత్యున్నత న్యాయస్థానం వివరించింది. స్వేచ్ఛగా జీవించే హక్కును ప్రజలకు అందించే క్రమంలో సత్వర న్యాయం అనే ఆలోచన చేసింది. సత్వర విచారణ, పారదర్శకత అనేది ప్రతి కక్షిదారుడి ప్రాథమిక హక్కు. న్యాయస్థానాల అంతిమ లక్ష్యం.. కక్షిదారుడు తన వాదనను కోర్టు సమగ్రంగా విన్నదని సంతృప్తి చెందడమే. సత్వర న్యాయం పేరుతో కక్షిదారులకు అసంతృప్తి కలిగించవద్దు. న్యాయమూర్తులు, న్యాయవాదులు కష్టపడి సత్వర న్యాయం అందించేందుకు కృషి చేయాలి’’ అని జస్టిస్‌ భూయాన్‌ అన్నారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌(ఖమ్మం పరిపాలన న్యాయమూర్తి), జస్టిస్‌ కె.లక్ష్మణ్‌, జస్టిస్‌ రాజేశ్వరరావు, జస్టిస్‌ నగేశ్‌, ఖమ్మం జిల్లా జడ్జి డాక్టర్‌ టి.శ్రీనివాసరావు, ఖమ్మం బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రామారావు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు