మరోసారి బోగస్‌ ఓటర్ల ఏరివేత

‘త్వరలో మరోదఫా బోగస్‌ ఓటర్ల ఏరివేత ప్రక్రియను చేపట్టనున్నాం.ఒకే ఫొటోతో వేరువేరు నియోజకవర్గాల్లో ఉన్న ఓటర్లను గుర్తించేందుకు కసరత్తు చేయనున్నాం’ అని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌

Published : 25 Sep 2022 04:47 IST

‘ఈనాడు’తో తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌

ఈనాడు, హైదరాబాద్‌: ‘త్వరలో మరోదఫా బోగస్‌ ఓటర్ల ఏరివేత ప్రక్రియను చేపట్టనున్నాం.ఒకే ఫొటోతో వేరువేరు నియోజకవర్గాల్లో ఉన్న ఓటర్లను గుర్తించేందుకు కసరత్తు చేయనున్నాం’ అని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ ‘ఈనాడు’తో చెప్పారు. ‘ఈ ప్రక్రియ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఎప్పటి నుంచన్నది త్వరలో ఖరారవుతుంది. ఓటర్ల జాబితాను ఆధార్‌ నంబర్లతో అనుసంధానం చేసే ప్రక్రియ ప్రస్తుతం ముమ్మరంగా జరుగుతోంది. ఇటీవల నియోజకవర్గంలోని వేరువేరు పోలింగ్‌ కేంద్రాల్లో ఒకే ఫొటోతో ఉన్న ఓటర్లను గుర్తించి, తొలగించే ప్రక్రియను పూర్తిచేశాం. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 22,04,663 మంది ఓటర్లు ఒకే రకమైన ఫొటోతో ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించి రాష్ట్రానికి పంపింది. ఆయా నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి సిబ్బంది ఆ ఓటర్ల ఇంటింటికి వెళ్లి పరిశీలించిన మీదట 10,35,773 (46.98 శాతం) మంది ఓటర్లు ఒకే ఫొటోతో ఉన్నట్లు గుర్తించారు. ఆ ఓటర్ల వివరాలను జాబితా నుంచి తొలగించారు.

సాధారణంగా ఒకరికి ఒకే నియోజకవర్గంలో ఓటు ఉండాలి. కానీ ఒకే వ్యక్తికి రెండు, అంతకుమించిన నియోజకవర్గాల్లో ఓటు హక్కు ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో గుర్తించింది. వీరిని గుర్తించేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను తయారు చేసింది. ప్రస్తుతం దానిని ఓటర్ల జాబితాతో అనుసంధానం చేస్తోంది. రాష్ట్రంలోని వేరువేరు నియోజకవర్గాల్లో ఓటు హక్కు ఉన్న వారి వివరాలను సమీకరించి పంపనుంది. ఆ జాబితా వచ్చిన తరువాత క్షేత్రస్థాయి సిబ్బంది ఆయా చిరునామాలకు వెళ్లి పరిశీలిస్తారు. నిర్ధారించుకున్నాక ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఉన్న వారి పేర్లను తొలగిస్తాం’ అని వికాస్‌రాజ్‌ వివరించారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts