పండిస్తే చేదు!

చక్కెరశాఖ అధ్యయనం ప్రకారం రాష్ట్రంలో టన్ను చెరకు పండించాలంటే రైతుకు సగటున రూ.3,400-3,500 ఖర్చవుతోంది. టన్ను చెరకుకు కనీసం 125 కిలోల చక్కెర ఉత్పత్తి వస్తేనే ‘వాస్తవ గిట్టుబాటు ధర’ (ఎఫ్‌ఆర్‌పీ) రూ.3,050 చెల్లించాలని

Updated : 25 Sep 2022 06:00 IST

చెరకు రైతుకు ఎకరాకు రూ.13,500 నష్టం

గిట్టుబాటు ధర చెల్లించకుంటే అది మరింత అధికం

సాగు వ్యయం భారమై.. రైతుల అవస్థలు

రాష్ట్రంలో ఈసారి క్రషింగ్‌ ఆలస్యం

ఈనాడు - హైదరాబాద్‌

చక్కెరశాఖ అధ్యయనం ప్రకారం రాష్ట్రంలో టన్ను చెరకు పండించాలంటే రైతుకు సగటున రూ.3,400-3,500 ఖర్చవుతోంది. టన్ను చెరకుకు కనీసం 125 కిలోల చక్కెర ఉత్పత్తి వస్తేనే ‘వాస్తవ గిట్టుబాటు ధర’ (ఎఫ్‌ఆర్‌పీ) రూ.3,050 చెల్లించాలని కేంద్రం ఇటీవల ఉత్తర్వులిచ్చింది. ఈ ధర ఇచ్చినా టన్నుకు సుమారు రూ.450 నష్టం. రాష్ట్రంలో చక్కెర రికవరీ టన్నుకు 100-120 కిలోలకు మించట్లేదు. ఈ లెక్కన రైతుకు చెల్లించే ధర రూ.3,050 కంటే తగ్గిపోతే నష్టం మరింత పెరుగుతుంది.

చెరకు గానుగాడే (క్రషింగ్‌) సీజన్‌ రాష్ట్రంలో ఆలస్యమవుతోంది. దేశమంతటా వచ్చే నెల నుంచి క్రషింగ్‌ ప్రారంభమవుతున్నా.. తెలంగాణలో నవంబరు రెండోవారం దాటే వరకు అవకాశాలు లేవు. అధిక వర్షాలు, మిల్లుల్లో అంతర్గత సమస్యలు దీనికి కారణాలు. చెరకు పక్వానికి వచ్చినప్పుడే గానుగాడితే చక్కెర ఉత్పత్తి (రికవరీ) పెరిగి, రైతుకు తగిన ధర దక్కుతుంది. ఇలా ఆలస్యమైతే నష్టపోయేది రైతులే. రాష్ట్రంలో 78 వేల ఎకరాల్లో చెరకు సాగైంది. నవంబరు నుంచి మార్చి వరకు 24.58 లక్షల టన్నుల పంట మిల్లులకు వస్తుందని చక్కెరశాఖ అంచనా. గత ఏడాది కంటే ఇది 3.42 లక్షల టన్నులు అధికం. కేంద్రం ఎఫ్‌ఆర్‌పీని గత ఏడాదికన్నా టన్నుకు రూ.150 మాత్రమే పెంచింది. కానీ చెరకు నరికేందుకు కూలి రేట్లే టన్నుకు రూ.200 మేర పెరిగాయని, ఇతర ఖర్చులూ కలిపితే టన్నుకు రూ.400-500 మేర భారమైందని రైతులు చెబుతున్నారు. ‘ఎకరానికి 30 టన్నుల చెరకు పండితే కేవలం నరకడానికే టన్నుకు రూ. 800 చొప్పున రూ. 24 వేలు ఖర్చవుతున్నాయి. ఇది గత ఏడాదికన్నా రూ.6 వేలు ఎక్కువ’ అని సంగారెడ్డి జిల్లా ఫసల్‌వాడీకి చెందిన రైతు రాజన్న చెప్పారు. ‘తోట నుంచి 60 కి.మీ. వరకే మిల్లువాళ్లు రవాణా వ్యయం భరిస్తున్నారు. అంతకంటే దూరమైతే.. అదనపు ఖర్చు రైతులపైనే పడుతోంది. సాగు, నరికివేత వ్యయానికి ఇది అదనం’ అని జగిత్యాల జిల్లా మల్లాపూర్‌కు చెందిన రైతు కాసారపు భూమారెడ్డి వాపోయారు.


రికవరీ ఆధారంగా అధిక ధర ఇవ్వాలి

- భద్రు, రాష్ట్ర చక్కెరశాఖ కమిషనర్‌

టన్ను చెరకు పండించడానికి రూ.3,400 వరకు రైతు ఖర్చుపెడుతున్నందున చక్కెర ఉత్పత్తిశాతం పెరిగిన నిష్పత్తి ప్రకారం అధిక ధర చెల్లించాలని మిల్లులను ఆదేశించాం. రాష్ట్రంలో లక్షన్నర ఎకరాల్లో చెరకు పండినా గానుగాడే సామర్థ్యం మిల్లులకు ఉంది. ఈ పంట సాగు పెంచాలని రైతులను ప్రోత్సహిస్తున్నాం.


 

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts