తనిఖీలు.. తాఖీదులు..!

రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ఆసుపత్రులను కట్టడి చేసేందుకు వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఆసుపత్రుల్లో తనిఖీలు

Published : 25 Sep 2022 04:47 IST

నిబంధనలు పాటించని ఆసుపత్రులపై వైద్యారోగ్య శాఖ ఉక్కుపాదం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ఆసుపత్రులను కట్టడి చేసేందుకు వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహిస్తూ అనుమతి లేని వాటిపై ఉక్కుపాదం మోపుతోంది. ప్రమాణాలు పాటించని వాటికి షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తోంది. కొన్నింటిని సీజ్‌ చేస్తూ వాటిలో పనిచేస్తున్నవారికి నోటీసులు ఇచ్చింది.

రాష్ట్రవ్యాప్తంగా ఆసుపత్రులను తనిఖీలు చేసి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నవాటిపై చర్యలు తీసుకోవాలని, పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని గురువారం ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో జిల్లా వైద్యాధికారుల నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు ఆయా జిల్లాల్లోని ప్రైవేటు ఆసుపత్రులు, క్లినిక్‌లు, పాలిక్లినిక్‌లు, డయాగ్నొస్టిక్‌ కేంద్రాలు, ఫిజియోథెరపీ, డెంటల్‌ ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహించాయి. అనుమతులు ఉన్నాయా? వాటిని పునరుద్ధరించుకున్నారా? మౌలిక సదుపాయాలు, పరిశుభ్రత ఎలా ఉన్నాయి? తదితర అంశాలపై ఆరా తీస్తున్నాయి. సోమవారం నుంచి పూర్తిస్థాయిలో తనిఖీలు చేపట్టాలని జిల్లా వైద్యాధికారులు నిర్ణయించారు.

శనివారం తనిఖీలు ఇలా..

* ప్రత్యేక బృందం అధికారులు హైదరాబాద్‌ జిల్లా పరిధిలోని 49 ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 14 ఆస్పత్రులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. మరో మూడింటికి జరిమానా విధించారు. రెండింటిని సీజ్‌ చేశారు.

* రంగారెడ్డి జిల్లాలో 53 ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహించి 36 హాస్పిటళ్లకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో 7 ఆసుపత్రులకు నోటీసులు అందించారు.

* సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ పరిధిలోని ఆసుపత్రులను మంత్రి హరీశ్‌రావు తనిఖీ చేశారు. జిల్లాలో అనుమతులు లేకుండా దవాఖానాలు నిర్వహిస్తున్న ఆర్‌ఎంపీ వైద్యులు, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఫిజియోథెరపీ, హోమియో క్లినిక్‌లు, డయాగ్నొస్టిక్‌ కేంద్రాలకు వైద్యాధికారులు నోటీసులు జారీ చేశారు.

* మహబూబ్‌నగర్‌ జిల్లాలో 3రోజుల్లో 62 ఆసుపత్రులను తనిఖీ చేశారు. అనుమతి లేకుండా నిర్వహిస్తున్న 17 యాజమాన్యాలు, డాక్టర్లకు నోటీసులు అందజేశారు. అడ్డాకులలో ఒక హాస్పిటల్‌ను సీజ్‌ చేశారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఒక ప్రైవేటు ఆసుపత్రిని, ఆర్‌ఎంపీ వైద్యులు నిర్వహిస్తున్న రెండు క్లినిక్‌లను సీజ్‌ చేశారు.

* సూర్యాపేట జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న రెండు దవాఖానాలకు నోటీసులు ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఓ ఆసుపత్రిని సీజ్‌ చేశారు.

* నిజామాబాద్‌, కామారెడ్డి, ఆదిలాబాద్‌ జిల్లాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి.

* కరీంనగర్‌ జిల్లాలోని 35 ఆసుపత్రుల్లో తనిఖీలు చేసిన అధికారులు కొన్నింట్లో లోపాలను గుర్తించారు. వాటిని సవరించుకోవాలని ఆదేశాలిచ్చారు. పెద్దపల్లి జిల్లాలో 13 ఆసుపత్రుల్లో తనిఖీలు చేసి నాలుగింటికి నోటీసులు ఇచ్చారు. జగిత్యాల జిల్లాలో అయిదు ఆసుపత్రులకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు. ఇందులో ఒకదాని అనుమతి రద్దుకు సిఫారసు చేశారు.

* హనుమకొండ జిల్లాలో రుసుముల పట్టిక, అనుమతి పత్రాలు ప్రదర్శించని మూడు దవాఖానాలు, రిజిస్ట్రేషన్‌ లేని ఓ దంత వైద్య ఆసుపత్రికి షోకాజ్‌ నోటీసు అందించారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts