‘తపాలా’లో.. ప్యాకింగ్‌ కేంద్రాలు

దుస్తులు, మందులు, పచ్చళ్లు తదితర వస్తుసామగ్రిని దేశంలోని పలు నగరాలు, ఇతర దేశాలకు చేరవేస్తున్న తపాలా శాఖ పార్సిల్‌ సేవలను మెరుగుపరచడంపై దృష్టి సారించింది. రాష్ట్రంలోని

Published : 25 Sep 2022 04:47 IST

30 పోస్టాఫీసుల్లో ఏర్పాటు

ఈనాడు, హైదరాబాద్‌: దుస్తులు, మందులు, పచ్చళ్లు తదితర వస్తుసామగ్రిని దేశంలోని పలు నగరాలు, ఇతర దేశాలకు చేరవేస్తున్న తపాలా శాఖ పార్సిల్‌ సేవలను మెరుగుపరచడంపై దృష్టి సారించింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్యాకింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే హైదరాబాద్‌ నగరంలోని సికింద్రాబాద్‌, తిరుమలగిరి, కూకట్‌పల్లి, మల్కాజిగిరి, ఖైరతాబాద్‌, ఎస్‌.ఆర్‌.నగర్‌, హిమాయత్‌నగర్‌తోపాటు నల్గొండ, రామన్నపేట, హనుమకొండ, వరంగల్‌, మంచిర్యాల, కరీంనగర్‌, ఖమ్మం, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, భద్రాచలం తదితర 30 తపాలా కార్యాలయాల్లో పార్సిల్‌ ప్యాకింగ్‌ యూనిట్లను ప్రారంభించింది. ఈ సంఖ్యను మరింత పెంచాలని నిర్ణయించింది.

అధికంగా అమెరికా, ఆస్ట్రేలియాలకు

దసరా, దీపావళి, సంక్రాంతి తదితర పండగల సందర్భాల్లో ఇక్కడి వారు విదేశాల్లోని తమ కుటుంబసభ్యులకు తపాల పార్సిళ్ల ద్వారా వస్తుసామగ్రిని పంపిస్తున్నారు. హైదరాబాద్‌లోని జనరల్‌ పోస్టాఫీస్‌ నుంచే నెలకు సుమారు 500అంతర్జాతీయ పార్సిళ్లు వెళుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఎక్కువగా ఆస్ట్రేలియా, అమెరికాలకు వెళ్తున్నాయని, పార్సిళ్లలో దుస్తులు 60%, పచ్చళ్లు, మందులు, పూజాసామగ్రి 10% ఉంటున్నాయని పేర్కొంటున్నారు. వరంగల్‌ నుంచి విదేశాలకు ప్రతి నెలా 3 వేల ఆయుర్వేద మందుల పార్సిళ్లు వెళుతున్నాయి. పోచంపల్లి చీరలను ఏపీ, పశ్చిమబెంగాల్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, దిల్లీ, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాలకు పంపిస్తున్నారు. పార్సిళ్లను ప్యాక్‌ చేయడంలో జాప్యం నివారణకు తపాలా శాఖ ప్యాకింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది.

ఇంటి వద్దకే సేవలు

చీరలను పోచంపల్లి నుంచి హైదరాబాద్‌కు తెప్పించి ఇక్కడి నుంచి ఇతర నగరాలకు పంపిస్తున్నాం. ఎంపిక చేసిన ఇతర రాష్ట్రాల్లోని నగరాలకు డోర్‌డెలివరీ, ఇంటి వద్ద నుంచే పికప్‌ సేవల్ని అందిస్తాం. పార్సిల్‌ ఎక్కడుందో కూడా ట్రాకర్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

- పి.విద్యాసాగర్‌రెడ్డి, హైదరాబాద్‌ పోస్టుమాస్టర్‌ జనరల్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని