పరీక్షలతో జన్యు వ్యాధులకు చెక్‌

తల్లిదండ్రుల్లో జన్యులోపాల కారణంగా పుట్టబోయే పిల్లల్లో వచ్చే వ్యాధులు జీవితాంతం వేధిస్తుంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ తరహా వ్యాధులు ఆరువేల వరకు ఉన్నాయి.  దేశంలో ఏటా రెండున్నర కోట్ల మంది శిశువులు జన్మిస్తున్నారు

Published : 25 Sep 2022 05:16 IST

అందుబాటులో ప్రభుత్వ కేంద్రం

ఈనాడు, హైదరాబాద్‌: తల్లిదండ్రుల్లో జన్యులోపాల కారణంగా పుట్టబోయే పిల్లల్లో వచ్చే వ్యాధులు జీవితాంతం వేధిస్తుంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ తరహా వ్యాధులు ఆరువేల వరకు ఉన్నాయి.  దేశంలో ఏటా రెండున్నర కోట్ల మంది శిశువులు జన్మిస్తున్నారు. వీరిలో 17 లక్షల మందిలో ఏదో ఒక జన్యులోపం ఉంటోంది. ముఖ్యంగా దగ్గరి బంధువుల్లో పెళ్లిళ్లు చేసుకున్న జంటలు జన్యు కౌన్సెలింగ్‌, జన్యు పరీక్షలు చేయించుకోవడం అవసరం. ప్రైవేటులో ఇందుకు భారీ ఖర్చు అవుతుండటంతో చాలామంది వెనుకడుగు వేస్తున్నారు. ఇలాంటి వారికి వెసులుబాటు కలిగించేలా హైదరాబాద్‌లో రెండు సంస్థలు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేటు ల్యాబ్‌ల కంటే తక్కువ ధరకే ఇక్కడ పరీక్షలు చేస్తారు.

ముందే అడ్డుకట్ట

జన్యుపరమైన వ్యాధుల్లో 600 రకాలను ముందే గుర్తించడం ద్వారా, తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. బేగంపేటలో ఉన్న ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జెనెటిక్స్‌లో కౌన్సెలింగ్‌ సహా దాదాపు 31 రకాల పరీక్షలకు అవకాశం ఉంది. పుట్టే పిల్లల్లో థలస్సేమియా, విల్సన్‌ డిసీజ్‌, క్లెమ్‌ సెల్టర్‌ సిండ్రోమ్‌, డౌన్‌ సిండ్రోమ్‌, టర్నర్‌ సిండ్రోమ్‌, ఎడ్వర్డ్‌ సిండ్రోమ్‌, హైపోథైరాయిడిజం, ఎడ్రినల్‌ హైపర్‌క్లేషియా తదితర జన్యు సంబంధ సమస్యలను పరీక్షల ద్వారా ముందే గుర్తిస్తే.. పెంపకంలో తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శిశువు పుట్టిన వెంటనే వీటిని గుర్తించకపోవడం వల్ల తర్వాత తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీస్తోంది. కొందరు చిన్నారులు జీవితాంతం నరకం అనుభవిస్తుంటే.. తల్లిదండ్రులూ సతమతమవుతున్నారు. కొందరు పిల్లలు.. పుట్టిన రెండు, మూడేళ్లకు మృత్యువాత పడుతున్నారు. పుట్టిన నెల రోజుల లోపు రక్తపరీక్షలు చేసి.. వారికి జన్యు వ్యాధులు వచ్చే అవకాశం ఉందో లేదో తెలుసుకోవచ్చు. చాలామంది పిల్లల్లో 4-5 ఏళ్ల తర్వాత ఈ వ్యాధులు బయటపడుతుంటాయి. మెదడు ఎదుగుదల లోపాలకూ చిన్నప్పటి నుంచే ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి సాధారణ పిల్లల మాదిరిగా తీర్చిదిద్దవచ్చు. పుట్టబోయే పిల్లల్లో జన్యులోపాలను గర్భిణికి స్కానింగ్‌ ద్వారా గుర్తించే వీలూ ఉంది. ప్రజలు ఈ సౌకర్యాలను వినియోగించుకోవాలని ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ విజయలక్ష్మి తెలిపారు.


తక్కువ ఖర్చుతో జీనోమ్‌ ఫౌండేషన్‌ సేవలు

సహజ విధానంతో పాటు కృత్రిమ గర్భధారణ ద్వారా పిల్లలు కనాలనుకునే వారూ జన్యుపరీక్షలు చేయించుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. సహజ గర్భధారణ సమస్యల కారణంగా ఎక్కువ మంది దంపతులు ఇటీవల కాలంలో ఇన్‌విట్రో ఫెర్టిలైజేషన్‌(ఐవీఎఫ్‌) ద్వారా సంతానం పొందుతున్నారు. శరీరానికి వెలుపల వీర్యంతో అండాన్ని ఫలదీకరణం చేసే పద్ధతిని ఇందులో అనుసరిస్తారు. ఈ విధానంలో పిల్లల్ని కనాలనుకునే వారికి పరీక్షలు మరింత ముఖ్యమని జీనోమ్‌ ఫౌండేషన్‌ అంటోంది. బంజారాహిల్స్‌లో ఉన్న ఈ సంస్థ కూడా తక్కువ ధరలకే వివిధ పరీక్షలు చేస్తోంది. వీటిపై వైద్యులు, కాబోయే తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తోంది. జిల్లాల్లోనూ వర్క్‌షాపులు ఏర్పాటు చేస్తోంది. పిల్లలు ఆరోగ్యకరంగా జన్మించేందుకు తమ సేవలను ఉపయోగించుకోవాలని ఫౌండేషన్‌ కోరుతోంది. జన్యుపరీక్షలు చేయించుకోవాలనుకునేవారు నేరుగా గానీ, 9704899766 మొబైల్‌ నంబరులో గానీ సంప్రదించవచ్చు. వైద్యులు కౌన్సెలింగ్‌ చేసిన తర్వాతే అవసరమైన పరీక్షలను సూచిస్తారు. ‘జన్యులోపాలను గుర్తించేందుకు ప్రీ-ఇంప్లాంటేషన్‌ జెనెటిక్‌ డయాగ్నసిస్‌ (పీజీడీ) నిర్వహిస్తాం. కుటుంబంలో ఎవరికైనా ఎముక మజ్జ దాత అవసరమైనప్పుడు కూడా దీన్ని ఉపయోగించవచ్చు. వంధ్యత్వానికి సంబంధించి ప్రీ జెనెటిక్‌ స్క్రీనింగ్‌, టెస్టింగ్‌ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలి’ అని ప్రసాద్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలు, కన్సల్టెంట్‌ గైనకాలజిస్టు డాక్టర్‌ సుమా ప్రసాద్‌ సూచించారు. ‘జన్యువ్యాధుల గుర్తింపులో రోగ నిర్ధారణ పరీక్షలను తక్కువ ఖర్చుకే చేస్తున్నాం’ అని ఫౌండేషన్‌ డైరెక్టర్‌ అపర్ణ కాజా తెలిపారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts