ఓయూలో ఎంటెక్‌ ఫీజు రెట్టింపు

ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని వర్సిటీ ఇంజినీరింగ్‌ కళాశాలతోపాటు జేఎన్‌టీయూహెచ్‌ పరిధిలోని వర్సిటీ కాలేజీల్లో ఎంటెక్‌ రుసుములు భారీగా పెరిగాయి. ఓయూలో రెగ్యులర్‌, సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సుల ఫీజు రెట్టింపైంది.

Updated : 25 Sep 2022 05:55 IST

జేఎన్‌టీయూహెచ్‌లో సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సులకు పెంపు

ఈనాడు, హైదరాబాద్‌: ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని వర్సిటీ ఇంజినీరింగ్‌ కళాశాలతోపాటు జేఎన్‌టీయూహెచ్‌ పరిధిలోని వర్సిటీ కాలేజీల్లో ఎంటెక్‌ రుసుములు భారీగా పెరిగాయి. ఓయూలో రెగ్యులర్‌, సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సుల ఫీజు రెట్టింపైంది. జేఎన్‌టీయూహెచ్‌లో సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సులకు రూ.28 వేలు పెరిగింది. ఇటీవల బీటెక్‌ ఫీజులను భారీగా పెంచిన విశ్వవిద్యాలయాలు తాజాగా ఎంటెక్‌ రుసుములనూ పెంచేశాయి. ఓయూ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఇప్పటివరకు ఎంటెక్‌ రెగ్యులర్‌ కోర్సు ఫీజు రూ.30 వేలు ఉండగా.. అది ఈ విద్యాసంవత్సరం(2022-23)లో రూ.60 వేలకు చేరింది. సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సులకు రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెరిగింది. ఓయూ ఇంజినీరింగ్‌ కళాశాలలో సుమారు 250 ఎంటెక్‌ సీట్లున్నాయి.

జేఎన్‌టీయూహెచ్‌ పరిధిలో..

జేఎన్‌టీయూహెచ్‌లో ఎంటెక్‌ రెగ్యులర్‌ కోర్సు ఫీజు ప్రస్తుతం రూ.60 వేలు ఉండగా.. అందులో ఎలాంటి మార్పు లేదు. సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సులకు మాత్రం రూ.72 వేల నుంచి రూ.లక్షకు పెంచుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ విశ్వవిద్యాలయంలో రెగ్యులర్‌ కోర్సులు అయిదు మాత్రమే ఉన్నాయి. సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సులు అంతకు మూడు రెట్లు ఉండటం గమనార్హం. ఫీజుల పెంపు ప్రభావం జేఎన్‌టీయూ హైదరాబాద్‌ ఇంజినీరింగ్‌ కళాశాల, అదే ప్రాంగణంలో ఉన్న ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ(ఐఎస్‌టీ)తోపాటు జగిత్యాల, సుల్తాన్‌పూర్‌ కళాశాలల్లో చేరే విద్యార్థులపై పడనుంది. ఈ వర్సిటీ గత ఏడాది రెగ్యులర్‌ కోర్సు ఫీజును రూ.30 వేల నుంచి రూ.60 వేలకు, సెల్ఫ్‌ ఫైనాన్స్‌కు రూ.50 వేల నుంచి రూ.72 వేలకు పెంచిన సంగతి తెలిసిందే. వర్సిటీ కళాశాలలతో పాటు ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కాలేజీల్లోనూ ఎంటెక్‌, ఎంఫార్మసీ ఫీజులూ పెరగనున్నాయి. తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ(టీఏఎఫ్‌ఆర్‌సీ) ఫీజులను దాదాపు ఖరారు చేసింది. రాష్ట్రంలో ఎంటెక్‌తో పాటు ఎంఫార్మసీ సీట్ల భర్తీకి పీజీ ఈసెట్‌ కౌన్సెలింగ్‌ త్వరలో జరగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని