Bathukamma Festival: శోభాయమానం.. బతుకమ్మ సంబురం

రాష్ట్రంలో బతుకమ్మ సంబురాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి. వాడవాడలా... ఇంటింటా మహిళలు ఉత్సాహంగా

Updated : 26 Sep 2022 04:35 IST

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమైన పూల పండగ

రాజ్‌భవన్‌లో మహిళలతో ఆడిపాడిన గవర్నర్‌

ప్రగతిభవన్‌లో సీఎం కుటుంబం వేడుకలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో బతుకమ్మ సంబురాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి. వాడవాడలా... ఇంటింటా మహిళలు ఉత్సాహంగా పండుగలో పాల్గొన్నారు. గునుగు, తంగేడు, కట్ల, బంతి, చామంతి, సీత జడ, గులాబీలు ఇలా తీరొక్క పువ్వులతో బతుకమ్మలు కొలువుదీరాయి. పూల సింగిడి నేలకు దిగిందా అన్నట్టుగా.. ఊళ్లన్నీ బతుకమ్మలతో మురిసిపోయాయి. గౌరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి బతుకమ్మలను తీసుకువెళ్లి పండుగలో పాల్గొన్నారు. రాగయుక్తమైన పాటలకు లయబద్ధమైన తాళం వేస్తూ మహిళలు ఆడిపాడారు. ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబ సభ్యులు, రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై సంబురాల్లో పాలుపంచుకున్నారు. రాజధానిలో తొలిరోజే బతుకమ్మ శోభ ఉట్టిపడింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఊరూవాడా సంబురాలు హోరెత్తాయి. హనుమకొండలోని వేయి స్తంభాల ఆలయం తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో పూలవనంలా మారింది. తరలివచ్చిన వేల మంది మహిళలతో సందడి నెలకొంది. బతుకమ్మ పాటలకు అనుగుణంగా వారంతా నృత్యాలు చేస్తూ హోరెత్తించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్న ఆలయంలో విద్యుద్దీపకాంతుల నడుమ.. మహిళలు ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. మిగిలిన జిల్లాల్లోనూ ఉయ్యాల పాటలు మారుమోగాయి.

ప్రగతిభవన్‌లో...
ముఖ్యమంత్రి కేసీఆర్‌ నివాసమైన ప్రగతిభవన్‌లో బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య జరిగాయి. సీఎం సతీమణి శోభ, కుమార్తె, ఎమ్మెల్సీ కవిత, కోడలు, కేటీఆర్‌ సతీమణి శైలిమ, మనవరాలు అలేఖ్య తదితరులు ఇందులో పాల్గొన్నారు. గౌరమ్మను పూజించి, బతుకమ్మలను పేర్చి వాటిని తీసుకొని వెళ్లి ప్రాంగణంలో వాటిని పెట్టి పాటలు పాడారు. అనంతరం అక్కడే నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా కవిత.. రాష్ట్ర ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ ఏడాది ఎనిమిది దేశాల్లో బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నాం. రాష్ట్రంలోని అన్ని జిల్లాలతోపాటు ముంబయి లాంటి ముఖ్యనగరాల్లోనూ సంబురాలు చేస్తున్నాం’ అని ఆమె పేర్కొన్నారు.

రాజ్‌భవన్‌లో....
రాజ్‌భవన్‌లో నిర్వహించిన బతుకమ్మ వేడుకలను గవర్నర్‌ తమిళిసై ప్రారంభించారు. బతుకమ్మను తీసుకొని వచ్చిన ఆమె.. వైద్యులు, న్యాయవాదులు, పాత్రికేయులు, ఇతర వర్గాల మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. అనంతరం రాజ్‌భవన్‌ తటాకంలో నిమజ్జనం చేశారు. వేడుకలకు హాజరైన మహిళలతో గవర్నర్‌ ఉత్సాహంగా గడిపారు.

విదేశాల్లోనూ...
విదేశాల్లోనూ బతుకమ్మ వేడుకలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, కువైట్‌, బ్రిటన్‌, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, ఖతార్‌, యూఏఈలలో తెరాస, తెలంగాణ జాగృతి, ప్రవాస తెలంగాణ సంఘాల ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించారు. తెలంగాణ మహిళలు పెద్దసంఖ్యలో వేడుకల్లో పాల్గొన్నారు.


ప్రధాని శుభాకాంక్షలు

బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రజలకు ప్రధానమంత్రి మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణ మహిళాశక్తి సహా ప్రతి ఒక్కరికీ బతుకమ్మ వేడుకల శుభాకాంక్షలు. ప్రకృతితో, పుష్పాలతో మన అనుబంధాన్ని ఈ పర్వదినం మరింత దృఢతరం చేస్తుంది’ అని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు.


Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని