ముం‘చెత్తే’ ముప్పు!

కొండల్లా పేరుకుపోతున్న ఘన వ్యర్థాలతో రాష్ట్రంలో నగరాలు, పట్టణాల్లో ‘చెత్త’ సమస్య నానాటికీ తీవ్రమవుతోంది. పట్టణ ప్రాంతాలు శరవేగంగా విస్తరిస్తుండగా.. అదేస్థాయిలో జనాభా

Updated : 26 Sep 2022 05:42 IST

పట్టణాల్లో లక్షల టన్నుల్లో ఘన వ్యర్థాలు

టెండర్లకే పరిమితమైన బయోమైనింగ్‌

డంపింగ్‌ యార్డులే లేని ప్రాంతాలెన్నో..

ఈనాడు, హైదరాబాద్‌: కొండల్లా పేరుకుపోతున్న ఘన వ్యర్థాలతో రాష్ట్రంలో నగరాలు, పట్టణాల్లో ‘చెత్త’ సమస్య నానాటికీ తీవ్రమవుతోంది. పట్టణ ప్రాంతాలు శరవేగంగా విస్తరిస్తుండగా.. అదేస్థాయిలో జనాభా కూడా పెరుగుతోంది. చాలాచోట్ల డంపింగ్‌ యార్డులు లేకపోవడంతో పట్టణ శివార్లు చెత్తాచెదారంతో నిండిపోతున్నాయి. ఘన వ్యర్థాల నిర్వహణకు రాష్ట్ర పురపాలకశాఖ బయోమైనింగ్‌కు శ్రీకారం చుట్టి.. టెండర్లు కూడా పూర్తయినప్పటికీ ఆ ప్రక్రియ అక్కడితోనే ఆగిపోయింది. కరీంనగర్‌లో మాత్రం బయోమైనింగ్‌ జరుగుతుండగా సిద్దిపేట లాంటి పురపాలికల్లో ఘన వ్యర్థాల నిర్వహణ చేస్తున్నారు. మిగిలిన చోట్ల పేరుకుపోయిన చెత్తతో ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులు తప్పడం లేదు.

రూ. 130 కోట్లతో టెండర్లు..
పట్టణాల్లో లక్షల టన్నుల్లో పేరుకుపోయిన ఘన వ్యర్థాల నిర్వహణకు బయోమైనింగ్‌ అనే వినూత్న విధానానికి పురపాలకశాఖ శ్రీకారం చుట్టింది. రూ.130 కోట్లతో మార్చిలో టెండర్లను ఖరారు చేసింది. 123 పట్టణాల్లో స్థానిక సంస్థలను క్లస్లర్లుగా విభజించి పనులు చేపట్టేందుకు నిర్ణయించారు. ఈ ప్రాంతాల్లో 23.77 లక్షల టన్నుల ఘన వ్యర్థాలను బయోమైనింగ్‌ చేయాలన్నది లక్ష్యం. డంపింగ్‌ ప్రాంతాలను కాంట్రాక్టర్లకు అప్పగించి వెంటనే పనులు ప్రారంభమయ్యేలా చూడాలని పురపాలక శాఖ మార్చిలోనే ఆదేశించింది. జాతీయ హరిత ట్రైబ్యునల్‌తో పాటు, కాలుష్య నియంత్రణ మండలి నిర్దేశించిన ప్రమాణాల మేరకు బయోమైనింగ్‌ చేయాల్సి ఉండగా 6 నెలలు కావస్తున్నా పనుల జాడే లేదు. దీంతో ఎకరాల కొద్దీ ప్రాంతాల్లో డంపింగ్‌ యార్డులు పూర్తిగా నిండిపోవడమే కాకుండా పరిసరాల్లోని ఖాళీస్థలాలు, జల వనరులు, ప్రధాన రోడ్లకు ఇరువైపులా కూడా చెత్త పేరుకుపోతోంది. హైదరాబాద్‌ తర్వాత పెద్ద నగరమైన వరంగల్‌తో పాటు నిజామాబాద్‌, ఖమ్మం, రామగుండం నగరాలు.. జిల్లా కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి.

* రాష్ట్రంలో కొత్త పురపాలక సంఘాలు సహా అత్యధిక పట్టణాల్లో డంపింగ్‌ యార్డుల సమస్య తీవ్రంగా ఉంది. 40కి పైగా ప్రాంతాల్లో ఈ యార్డులే లేకపోగా.. ఉన్నచోట కూడా అవి నిండిపోయి చెత్త ఎక్కడ వేయాలో తెలియక సిబ్బంది తంటాలు పడుతున్నారు. దీంతో ఖాళీ స్థలాలు ఎక్కడుంటే అక్కడ ఘన వ్యర్థాలను వేస్తున్నారు. పట్టణాలు క్రమేపీ విస్తరిస్తుండటంతో.. ఒకప్పుడు దూరంగా ఉండే డంపింగ్‌ యార్డులు ఇప్పుడు ఆవాస ప్రాంతాల్లో కలిసిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో హైదరాబాద్‌ మినహా ఇతర నగరాలు పట్టణాల్లో రోజుకు 4 వేల టన్నుల ఘన వ్యర్థాలు పోగుపడుతున్నాయి.

* భారీగా పేరుకుపోయిన ఘన వ్యర్థాలను కొన్నిచోట్ల తగలబెడుతుండటంతో తీవ్రమైన పర్యావరణ సమస్యలు ఎదురవుతున్నాయి. ఓవైపు చెత్తను కాల్చకూడదని పురపాలక శాఖ చెబుతున్నా అత్యధిక డంపింగ్‌ యార్డులు మాత్రం మండుతూనే ఉన్నాయి. దీంతో వెలువడుతున్న పొగ, దుర్గంధంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈమేరకు ఆందోళనకు దిగినవారిపై మిర్యాలగూడ పురపాలక సంఘం కేసులు కూడా పెట్టింది. రామగుండంలో డంపింగ్‌ యార్డుకు స్థలం లేక గోదావరి చెంతనే ఘన వ్యర్థాలను పడవేస్తుండటంతో అవి నదిలో కలుస్తున్నాయి.


తీవ్రత ఎలా ఉందంటే..

* రాష్ట్రంలో మచ్చుకు కొన్ని ప్రాంతాలను పరిశీలిస్తే.. మంచిర్యాల, మంథని, హుజూరాబాద్‌ ప్రాంతాల్లో డంపింగ్‌ యార్డుల్లేవు. దీంతో రోడ్ల పక్కనే చెత్తా చెదారం పడేస్తున్నారు. డోర్నకల్‌ పురపాలక సంఘం నాలుగేళ్ల కిత్రం ఏర్పాటు కాగా.. ఇక్కడా అదే సమస్య. దీంతో ప్రధాన చెరువు సమీపంలో ఘన వ్యర్థాలను పోగు చేస్తున్నారు.

* ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌లలో డంపింగ్‌ యార్డులు మొత్తం నిండిపోగా.. నిప్పుపెట్టి చెత్తను తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

* ఖమ్మంలో 38 ఎకరాల్లోని ప్రాంతమంతా చెత్తతో నిండిపోయింది. రోజుకు 200 టన్నుల ఘన వ్యర్థాలు ఏర్పడుతుండటంతో ఎక్కడ వేయాలో అంతుపట్టక పురపాలక సిబ్బంది తంటాలు పడుతున్నారు.

* సంగారెడ్డిలో 12 వార్డుల చెత్తను మాత్రమే యార్డుకు తరలిస్తుండగా మిగిలిన 26 వార్డుల ఘన వ్యర్థాలు ఎక్కడ వేయాలో తెలియక చెరువులు, కుంటలు, రోడ్ల పక్కన పాడుపడిన బావులు.. ఇలా ఎక్కడపడితే అక్కడ వేస్తున్నారు.

* మిర్యాలగూడలో రోజుకు 60 టన్నుల చెత్త పోగుపడుతుండగా డంపింగ్‌ యార్డు సరిపోవడం లేదు.


 

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని