సాహస మహిళా పోలీసులకు పదోన్నతులు ఇవ్వాలి

భారత్‌-ఆస్ట్రేలియా టి-20 క్రికెట్‌ మ్యాచ్‌ టికెట్ల కోసం జరిగిన తొక్కిసలాటలో గాయపడిన క్రీడాభిమానులు, వారి ప్రాణాలు కాపాడిన మహిళా పోలీసు కానిస్టేబుళ్లతో కలిసి క్రీడల శాఖ

Published : 26 Sep 2022 04:10 IST

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

టి-20 టికెట్ల తొక్కిసలాట బాధితులతో మ్యాచ్‌ వీక్షించిన మంత్రి

రవీంద్రభారతి, న్యూస్‌టుడే: భారత్‌-ఆస్ట్రేలియా టి-20 క్రికెట్‌ మ్యాచ్‌ టికెట్ల కోసం జరిగిన తొక్కిసలాటలో గాయపడిన క్రీడాభిమానులు, వారి ప్రాణాలు కాపాడిన మహిళా పోలీసు కానిస్టేబుళ్లతో కలిసి క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆదివారం ఉప్పల్‌ స్టేడియంలో మ్యాచ్‌ వీక్షించారు. అంతకు ముందు బేగంపేట్‌ మహిళా పోలీసు కానిస్టేబుళ్లు నవీన, విమలను మంత్రి రవీంద్రభారతిలోని తన ఛాంబర్‌లో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రికెట్‌ మ్యాచ్‌ టికెట్ల కొనుగోలు సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో సుజాత, సాయికుమార్‌, రంజిత్‌, శ్రీనాథ్‌, ఆదితినాథ్‌ తీవ్రంగా గాయపడ్డారని, వీరిలో సుజాత, శ్రీనాథ్‌ అపస్మారకస్థితికి చేరుకున్నారని చెప్పారు. బేగంపేట్‌ మహిళా కానిస్టేబుల్‌ నవీన ప్రాణాలకు తెగించి వారిద్దరి ప్రాణాలను కాపాడారని, మరో కానిస్టేబుల్‌ విమల సైతం సాహసం చేశారని పేర్కొన్నారు. మహిళా కానిస్టేబుళ్ల సాహసాన్ని సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకువెళ్లి, పదోన్నతులు ఇవ్వాలని డీజీపీకి లేఖ రాశానని వెల్లడించారు. వీరితో కలిసి మ్యాచ్‌ చూసేందుకు బాక్స్‌ టికెట్లు తీసుకున్నట్లు వివరించారు. మ్యాచ్‌ ముగిశాక టికెట్ల విక్రయంపై విచారణ జరిపిస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని