Shatabdi Express: శతాబ్ది.. వందల సీట్లు ఖాళీ

అది తెలుగు రాష్ట్రాల్లోనే ఏకైక శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌.. అన్నీ ఏసీ బోగీలు, అందులో ఒక అద్దాల బోగీ (విస్టాడోమ్‌ కోచ్‌).. వేగంగా, ఆహ్లాదకర ప్రయాణం. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నప్పటికీ ఛార్జీల

Updated : 26 Sep 2022 07:59 IST

పుణె-సికింద్రాబాద్‌ రైలులో భయపెడుతున్న డైనమిక్‌ ఛార్జీలు

అద్దాల బోగీలోనూ సగటున 10-15 ఖాళీలు

ఈనాడు, హైదరాబాద్‌: అది తెలుగు రాష్ట్రాల్లోనే ఏకైక శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌.. అన్నీ ఏసీ బోగీలు, అందులో ఒక అద్దాల బోగీ (విస్టాడోమ్‌ కోచ్‌).. వేగంగా, ఆహ్లాదకర ప్రయాణం. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నప్పటికీ ఛార్జీల బాదుడు కారణంగా సికింద్రాబాద్‌-పుణె మధ్య నడుస్తున్న శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణికులను అంతగా ఆకట్టుకోలేకపోతోంది. ఈ రైలులో నిత్యం వందల సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. ఇదే మార్గంలో ప్రయాణించే ఇతర రైళ్లతో పోలిస్తే దాదాపు 50% కంటే అధికంగా ఛార్జీలు ఉండడం, డైనమిక్‌ ఛార్జీల విధానం అమలవుతుండడం (ప్రయాణం దగ్గర పడేకొద్దీ ఛార్జీ పెరుగుదల) ఇవన్నీ ప్రభావం చూపుతున్నాయి.

పుణె-సికింద్రాబాద్‌-పుణె (నం.12026/12025) శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో ఛైర్‌కార్‌, ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌కార్‌ కోచ్‌లతో పాటు ఒక విస్టాడోమ్‌ కోచ్‌ ఉంది. సికింద్రాబాద్‌లో బయల్దేరే రైలు పుణె సహా ఏడు స్టేషన్లలో (రాష్ట్రంలో బేగంపేట, వికారాబాద్‌, తాండూరు, కర్ణాటకలోని వాడి, కలబురిగి, మహారాష్ట్రలోని సోలాపూర్‌) ఆగుతుంది. ప్రయాణదూరం 595 కి.మీ.లు కాగా 8.20 గంటల్లో చేరుకోవచ్చు. ఈ రెండు ప్రాంతాల మధ్య తిరిగే ఇతర రైళ్లలో ఏసీ మూడో తరగతి బెర్త్‌ టికెట్‌ ధర రూ.905 కాగా.. శతాబ్దిలో ఛైర్‌కార్‌కు రూ.1,505; ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌కార్‌కు రూ.2,320; విస్టాడోమ్‌ బోగీలో ప్రయాణానికి రూ.2,495 చెల్లించాల్సి వస్తోంది.


ఖాళీలు ఇలా..

ఈ నెల 25న (ఆదివారం) రాత్రి 7 గంటల సమయానికి సికింద్రాబాద్‌ నుంచి పుణెకు ఛైర్‌ కార్‌ బోగీల్లో 26వ తేదీకి 272, 28కి 352, 29కి 306, 30వ తేదీకి 272 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌కార్‌ బోగీల్లో సగటున రోజుకు 30 చొప్పున, విస్టాడోమ్‌ కోచ్‌ల్లో 10-15 వరకు సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. ప్రయాణ తేదీకి వచ్చేసరికి విస్టాడోమ్‌లో ఖాళీల సంఖ్య తగ్గుతూ బోగీలో మూడు, నాలుగు ఖాళీగా ఉంటున్నాయి. కొద్దిరోజులు మాత్రమే సీట్లు నిండుతున్నాయి.

* పుణె నుంచి సికింద్రాబాద్‌కు ఛైర్‌కార్‌ బోగీల్లో ఈ నెల 26న 201, 28న 320, 29న 335, 30న 302 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌కార్‌లో సగటున రోజుకు 45 చొప్పున సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. ప్రయాణతేదీ నాటికి ఈ సంఖ్య తగ్గుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. విస్టాడోమ్‌ కోచ్‌లో- 26న 0, 28న 12, 29న 19, 30న 16 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ మార్గంలోని ఇతర అన్ని రైళ్లలో అన్ని తరగతుల బెర్తులు నిండిపోయి వెయిటింగ్‌ జాబితా ఉండడం గమనార్హం.

* ఈ రైలుకు ఇటీవలే చేర్చిన విస్టాడోమ్‌ బోగీలో అద్దాల నుంచి పట్టాల పక్కన ప్రకృతి అందాల్ని ఆస్వాదిస్తూ ప్రయాణించొచ్చు. మిగతా రైళ్లతో పోలిస్తే ప్రయాణ సమయం కనీసం 2 నుంచి 4 గంటల మేర కలిసి వస్తుంది. అయినప్పటికీ ఛార్జీల బాదుడు కారణంగా ఇందులో బుక్‌ చేసుకోవడానికి ప్రయాణికులు భయపడే పరిస్థితి నెలకొంది.


 

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని