ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు చేయూత

సాగు చేసిన పంటలకు గిట్టుబాటు ధరలు రాక.. పంటల కోసం తీసుకున్న అప్పులు తీరక.. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు చేయూతనిచ్చారు ఓ వ్యాపారవేత్త. ఇప్పటికే

Published : 26 Sep 2022 04:10 IST

100 మందికి రూ.కోటి సాయం అందజేత

ఫార్మర్స్‌ ఫస్ట్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ చక్రధర్‌గౌడ్‌ ఉదారత

సిద్దిపేట, న్యూస్‌టుడే: సాగు చేసిన పంటలకు గిట్టుబాటు ధరలు రాక.. పంటల కోసం తీసుకున్న అప్పులు తీరక.. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు చేయూతనిచ్చారు ఓ వ్యాపారవేత్త. ఇప్పటికే సుమారు 350 మంది నిరుపేద కుటుంబాలను ఆదుకున్న సిద్దిపేట వాసి, ఫార్మర్స్‌ ఫస్ట్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ చక్రధర్‌గౌడ్‌ తాజాగా.. ఉమ్మడి మెదక్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, వరంగల్‌ జిల్లాల్లో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న 100 మంది కౌలు, ఇతర రైతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున కోటి అందజేసి తన ఔదార్యం చాటుకున్నారు. బతుకమ్మ పండుగను పురస్కరించుకుని బాధిత కుటుంబాలను ఆదివారం సిద్దిపేటకు ఆహ్వానించి భార్య ఆరోషికతో కలిసి వారికి చెక్కులు, చీరలను పంపిణీ చేశారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రైతులు క్షణికావేశంతో ఆత్మహత్యలకు పాల్పడొద్దని, తాను తోడుగా ఉంటానంటూ భరోసా ఇచ్చారు. రాజకీయ లబ్ధి, వ్యక్తిగత ప్రచారం కోసం ఈ పనిచేయడంలేదని జీవితమంతా రైతు సేవకే అంకితమవుతానని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వం అందజేసే రైతుబంధు సాయాన్ని సంపన్నులు స్వచ్ఛందంగా వదులుకుంటే నిరుపేద రైతులు, కౌలుదారులకు మేలు జరిగే అవకాశముంటుందని అభిప్రాయపడ్డారు. గవర్నర్‌ తమిళిసై ఈ కార్యక్రమానికి అనివార్య పరిస్థితుల్లో రాలేకపోయారని, దీంతో గవర్నర్‌ తల్లి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని