సంక్షిప్త వార్తలు(6)

కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్‌లో బుధవారం నుంచి విచారణ ప్రారంభం కానుంది. దిల్లీలోని ధర్మాసనం ముందు ఏపీ, తెలంగాణలకు చెందిన న్యాయవాదులు, నీటిపారుదల శాఖ ఇంజినీర్లు హాజరుకానున్నారు.

Updated : 27 Sep 2022 06:12 IST

రేపటి నుంచి కృష్ణా ట్రైబ్యునల్‌ విచారణ

ఈనాడు, హైదరాబాద్‌: కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్‌లో బుధవారం నుంచి విచారణ ప్రారంభం కానుంది. దిల్లీలోని ధర్మాసనం ముందు ఏపీ, తెలంగాణలకు చెందిన న్యాయవాదులు, నీటిపారుదల శాఖ ఇంజినీర్లు హాజరుకానున్నారు. తెలంగాణ తరఫు సాక్షి, కేంద్ర జల సంఘం మాజీ సభ్యుడు చేతన్‌ పండిట్‌ను ఏపీ న్యాయవాది వెంకటరమణి క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేయనున్నారు. ఏపీ, తెలంగాణలోని కృష్ణా ప్రాజెక్టుల ఆపరేషన్‌ ప్రొటోకాల్స్‌పై ఈ దఫా విచారణ కొనసాగనుంది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల కింద కేటాయింపులు, వినియోగం, నదీ పరీవాహకం వెలుపల, లోపల సమస్యలు తదితర అంశాలు ఈ విచారణలో భాగం కానున్నాయి. 30వ తేదీవరకు విచారణ కొనసాగనుంది.


ఎస్‌ఎస్‌ఏకు రాష్ట్ర వాటా రూ.319 కోట్ల విడుదల

ఈనాడు, హైదరాబాద్‌: సమగ్ర శిక్షా అభియాన్‌(ఎస్‌ఎస్‌ఏ)కు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద తొలి విడత రూ.319 కోట్లను విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తన 60 శాతం వాటా కింద రూ.479 కోట్లు విడుదల చేయగా.. రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు ఇవ్వాల్సి ఉంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి తొలి విడతగా రూ.319 కోట్లు విడుదలయ్యాయి. ఈ నిధుల విడుదలకు గతంలో ఒకే జీవో ఇచ్చేవారు. ఏ పనికి ఎంత ఖర్చు చేయాలో పేర్కొంటూ జీవోలు ఇవ్వాలని కేంద్రం నిబంధన విధించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నిధుల వినియోగానికి సంబంధించి 20 జీవోలను జారీ చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి విడుదలైన రూ.798 కోట్లు ఎస్‌ఎస్‌ఏ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌ ఆధ్వర్యంలోని సింగిల్‌ నోడల్‌ ఏజెన్సీ ఖాతాల్లో జమ కానుంది. విద్యాసంవత్సరం ప్రారంభమై మూడున్నర నెలలు గడిచినా పాఠశాల విద్యాశాఖ ఇప్పటివరకు బడులకు స్కూల్‌ గ్రాంట్‌ ఇవ్వలేదు. ప్రస్తుతం మంజూరైన మొత్తాన్ని పాఠశాలలకు కేటాయించనున్నారు.  


స్థానికత ఉన్నవారినే అనుమతించాలి

అంతర్రాష్ట్ర బదిలీలపై సీఎస్‌కు తెలంగాణ ఉద్యోగుల సంఘం వినతి

ఈనాడు, హైదరాబాద్‌: అంతర్రాష్ట్ర బదిలీలకు తెలంగాణ స్థానికత ఉన్నవారినే అనుమతించాలని, ఏపీకి చెందిన వారికి అవకాశం ఇవ్వొద్దని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను తెలంగాణ ఉద్యోగుల సంఘం కోరింది. ఈమేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.రవీంద్రకుమార్‌, నగరాధ్యక్షుడు ఎన్‌.నర్సింగ్‌రావులు సోమవారం బీఆర్‌కే భవన్‌లో సీఎస్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. అంతర్రాష్ట్ర బదిలీల కింద రాష్ట్రానికి వచ్చేందుకు దరఖాస్తు చేసుకున్న 1,808 మందిలో అత్యధికులు ఏపీకి చెందినవారేనని, వారు రావడం వల్ల తెలంగాణలో పనిచేస్తున్న ఉద్యోగులకు, నిరుద్యోగులకు నష్టం వాటిల్లుతుందని తెలిపారు.  ఈ అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని ఈ సందర్భంగా సీఎస్‌ వారికి హామీ ఇచ్చారు.


రాష్ట్రంలో కొత్తగా 94 కొవిడ్‌ కేసులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 94 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 8,37,499కి పెరిగింది. తాజాగా మరో 105 మంది కోలుకోగా.. ఇప్పటి వరకూ 8,32,686 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఈ నెల 26న సాయంత్రం 5.30 గంటల వరకు నమోదైన కరోనా సమాచారాన్ని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు సోమవారం వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 702 మంది కొవిడ్‌తో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 9,340 నమూనాలను పరీక్షించగా.. మొత్తం పరీక్షల సంఖ్య 3,76,38,954కు పెరిగింది. తాజా ఫలితాల్లో హైదరాబాద్‌లో 46 పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయి. రాష్ట్రంలో మరో 1,31,335 కొవిడ్‌ టీకా డోసులు పంపిణీ చేశారు.


పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి
- తెలంగాణ ఐకాస డిమాండ్‌

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత ఐకాస రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. పెన్షనర్లకు రావాల్సిన మూడు విడతల కరవుభృతిని విడుదల చేయాలని, ప్రతీ నెలా ఒకటో తేదీనే పింఛన్‌ ఇవ్వాలని, నగదు రహిత ఆరోగ్యసేవలను మెరుగు పరచాలని కోరింది. ఈమేరకు సోమవారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో తీర్మానించింది. సమావేశానికి ఛైర్మన్‌ కె.లక్ష్మయ్య అధ్యక్షత వహించగా కార్యదర్శి శుభాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అఖిలభారత పెన్షనర్ల సమాఖ్యకు తెలంగాణ నుంచి ఎన్నికైన సుధాకర్‌, రాజేంద్రబాబులను సన్మానించారు.


రెండు బొగ్గు గనులకు సింగరేణి దరఖాస్తు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రస్తుతమున్న బొగ్గు గనులకు అనుబంధంగా మరో రెండు గనుల తవ్వకాలకు పర్యావరణ అనుమతి ఇవ్వాలని సింగరేణి సంస్థ తాజాగా దరఖాస్తు చేసింది. వీటిపై కేంద్ర పర్యావరణ శాఖ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ జరుపుతోంది. ప్రస్తుతమున్న రామగుండం ఉపరితల(ఓసీ)-3 గని విస్తరణకు పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌ మండలం జల్లారం గ్రామంలో 2070.10 హెక్టార్లలో బొగ్గు తవ్వకాలకు, రామగుండం ఉపరితల(ఓసీ)-1 గని రెండో దశ విస్తరణకు రామగిరి మండలం నాగేపల్లిలో మరో 923.88 హెక్టార్లలో తవ్వకాలకు అనుమతించాలని కోరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని