Heavy Rain: 3 గంటల్లో ముంచెత్తింది

కుంభవృష్టితో రాజధాని వణికింది. వరుణుడు ఒక్కసారిగా హైదరాబాద్‌పై విరుచుకుపడ్డాడు. దీంతో నగరం ఉక్కిరిబిక్కిరైంది. జనజీవనం స్తంభించింది. సోమవారం సాయంత్రం 5 గంటలకు మొదలైన వాన.. రాత్రి 8 గంటల వరకూ కురుస్తూనే ఉంది. అది కార్యాలయాల నుంచి ఉద్యోగులు

Updated : 27 Sep 2022 06:39 IST

 హైదరాబాద్‌లో 12.7 సెం.మీ. వర్షం

రోడ్లన్నీ జలమయం

ఎక్కడికక్కడ నిలిచిన వాహనాలు..

ట్రాఫిక్‌ అస్తవ్యస్తం

జలదిగ్బంధంలో కాలనీలు

ఈనాడు, హైదరాబాద్‌: కుంభవృష్టితో రాజధాని వణికింది. వరుణుడు ఒక్కసారిగా హైదరాబాద్‌పై విరుచుకుపడ్డాడు. దీంతో నగరం ఉక్కిరిబిక్కిరైంది. జనజీవనం స్తంభించింది. సోమవారం సాయంత్రం 5 గంటలకు మొదలైన వాన.. రాత్రి 8 గంటల వరకూ కురుస్తూనే ఉంది. అది కార్యాలయాల నుంచి ఉద్యోగులు ఇళ్లకు చేరే సమయం కావడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది.  దాదాపు 5 లక్షల మంది వాహనదారులు, స్కూళ్ల నుంచి ఇంటి చేరాల్సిన విద్యార్థులు 2 గంటలకు పైగా ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. వాహనాల్లోకి నీళ్లు చేరడంతో చాలావరకు అక్కడే ఆగిపోయాయి. కొన్నిచోట్ల నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయాయి. నగరంలో గత పదేళ్లలో సెప్టెంబరు నెలలో ఎన్నడూ లేనంత అత్యధిక వర్షపాతం నమోదైంది. సోమవారం రాష్ట్రంలో అక్కడక్కడా ఒక మోస్తరు వానలు పడతాయని ఆదివారం వాతావరణశాఖ తెలిపింది. కానీ సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి భారీవర్షం కురిసింది. అర్ధరాత్రి 12 గంటల వరకు మెహిదీపట్నంలో గరిష్ఠంగా 11.25 సెం.మీ. వాన పడింది. ఇంతకుముందు రికార్డు 2017 సెప్టెంబరు 6న 24 గంటల వ్యవధిలో 9 సెం.మీ.లుగా వాతావరణశాఖ రికార్డుల్లో ఉంది. సోమవారం 3 గంటల వ్యవధిలోనే 9.1 నుంచి 12.7 సెం.మీ.లు 4 ప్రాంతాల్లో కురవడంతో అది చెరిగిపోయి కొత్త రికార్డు నమోదైంది. హైదరాబాద్‌లోని దాదాపు 250 కాలనీల్లో నీరు ఇళ్లలోకి చేరింది. ఆసిఫాబాద్‌, గుడిమల్కాపూర్‌, వివేకానందనగర్‌, మలక్‌పేట, ముషీరాబాద్‌, తదితర ప్రాంతాల్లో జనావాసాలు జలమయమయ్యాయి. గుడిమల్కాపూర్‌ పూల మార్కెట్‌, సంతల్లోని దుకాణాలు కొట్టుకుపోయాయి. సరూర్‌నగర్‌ చెరువు దిగువ ప్రాంతాలు, కవాడిగూడ, అశోక్‌నగర్‌, అంబర్‌పేట, బేగంపేటలలో వరద నాలాలు ఉప్పొంగి ప్రవహించాయి. మెహిదీపట్నం దగ్గర నడుములోతు నీరు చేరడంతో కొన్ని వాహనాలు మధ్యలోనే ఆగిపోయాయి. వర్షం ధాటికి విద్యుత్తు సరఫరా నిలిచిపోయి 31 శాతం నగరం చీకట్లో కూరుకుపోయింది. నగరంలో 5.2 లక్షల వీధిదీపాలకు గాను.. 1.5 లక్షల లైట్లకు సరఫరా నిలిచిపోయింది. ముంపు ప్రాంతాల్లో ముందు జాగ్రత్తగా విద్యుత్తు సరఫరాను నిలిపేశారు. అర్ధరాత్రి 12 గంటలకు అత్యధికంగా నగరశివారులోని నందనం వద్ద 16.70 సెం.మీ, మెహిదీపట్నం 11.25, నాంపల్లిలో 10.33 సెం.మీ. కురిసింది. ఖైరతాబాద్‌ 10.23, ఎల్బీస్టేడియం 10.00, అత్తాపూర్‌ 8.7, సరూర్‌నగర్‌ 7.93, ఆసిఫ్‌నగర్‌ 7.75, అంబర్‌పేట 7.68, మలక్‌పేట 6.88, జియాగూడ 6.63, ఎ.ఎస్‌.రావునగర్‌ 6.18, సికింద్రాబాద్‌ 6.00, బాలానగర్‌లో 5.70 సెం.మీ వర్షపాతం నమోదైంది. అర్ధరాత్రి తర్వాత కూడా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తూనే ఉంది.

నేడు, రేపు సైతం వర్షాలు

గత మూడురోజులుగా పొడి వాతావరణం ఏర్పడటం, ఉరుములు, మెరుపులు అధికంగా రావడం వల్ల కారుమబ్బులు కమ్మేసి కొద్దిగంటల వ్యవధిలోనే భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణశాఖ రాష్ట్ర సంచాలకురాలు డాక్టర్‌ నాగరత్న తెలిపారు. మంగళ, బుధవారాల్లో సైతం ఇలాగే రాష్ట్రంలో అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నట్లు తెలిపారు. బంగాళాఖాతం పశ్చిమ, మధ్యప్రాంతంలో గాలులతో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకూ వ్యాపించింది. మరోవైపు ఉత్తర, వాయవ్య భారత ప్రాంతాల నుంచి తెలంగాణలోకి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నందున వర్షాలు కురుస్తున్నట్లు వివరించారు. చిట్యాల మండలం(నల్గొండ జిల్లా) ఉరుమడ్ల రోడ్డు వద్ద 7.8 సెం.మీ, మేడారం(ములుగు జిల్లా)లో 6.7 సెం.మీ.ల వర్షం కురిసింది.

పిడుగుపాటుకు ముగ్గురి మృతి

వివిధ జిల్లాల్లో సోమవారం సాయంత్రం పిడుగుపాటుకు గురై ముగ్గురు మరణించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం మామిడిగుండాల పంచాయతీ బోటిగుంపు గ్రామానికి చెందిన రైతు కమటం శ్రీను(42) సోమవారం పిడుగుపాటుతో మృతి చెందారు. తన భార్య శోభతో పొలం వెళ్లి ఇంటికి వస్తుండగా పిడుగు పడడంతో తలకు తీవ్రగాయంతో శ్రీను అక్కడికక్కడే చనిపోయారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడులో పిడుగుపడి షేక్‌ జాన్‌బీ(66) చనిపోయారు. కొంతకాలంగా అనారోగ్యంతో మంచం పట్టిన ఈమె ఇంటి ఆవరణలో పిడుగు పడటంతో మంచంలోనే మృతిచెందారు. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం వంగపహాడ్‌లోని బావుల చెరువు సమీపంలో సోమవారం సాయంత్రం చెట్టు కింద నిలబడ్డ సిద్ధాపురానికి చెందిన ముసుకు నాగరాజు(35) పిడుగు బారినపడి అక్కడికక్కడే కన్నుమూశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని