KTR: ఆరు నెలలకోసారి ఆర్జీయూకేటీకి వస్తా

నిర్మల్‌ జిల్లా బాసర ఆర్జీయూకేటీకి ఆరు నెలలకోసారి వస్తానని ఐటీ, పురపాలకశాఖల మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు. మంత్రులు సబితారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌లతో కలిసి ఆయన సోమవారం ఆర్జీయూకేటీని సందర్శించారు.

Updated : 27 Sep 2022 06:40 IST

విద్యార్థులకు మంత్రి కేటీఆర్‌ హామీ

ఆందోళన అభినందనీయమని వ్యాఖ్య

ఈటీవీ-ఆదిలాబాద్‌, ముథోల్‌, న్యూస్‌టుడే: నిర్మల్‌ జిల్లా బాసర ఆర్జీయూకేటీకి ఆరు నెలలకోసారి వస్తానని ఐటీ, పురపాలకశాఖల మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు. మంత్రులు సబితారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌లతో కలిసి ఆయన సోమవారం ఆర్జీయూకేటీని సందర్శించారు. కొత్తగా నిర్మించిన భోజనశాలను విద్యార్థులతో కలిసి పరిశీలించారు. సమస్యలను తెలుసుకొని వారితో కలిసి భోజనం చేశారు. అనంతరం ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. వారు జూన్‌లో ప్రజాస్వామిక పద్ధతిలో నిర్వహించిన ఆందోళన తనకు బాగా నచ్చిందని అభినందించారు. ఆర్జీయూకేటీలో చాలా సమస్యలున్నట్లు తానూ గుర్తించానన్నారు. నవంబరులో మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి మళ్లీ వస్తానని, విద్యార్థులందరికీ ల్యాప్‌టాప్‌లు అందజేస్తానని హామీ ఇచ్చారు.  మరో 50 తరగతి గదులను అందుబాటులోకి తెస్తామన్నారు. రూ.3 కోట్ల వ్యయంతో స్పోర్ట్స్‌ స్టేడియం, వెయ్యి కంప్యూటర్లతో డిజిటల్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు.

ఒకింత అసంతృప్తి

కొత్త భోజనశాల సమీపంలోనే మరుగుదొడ్లు ఉండడం, వాటి తలుపులు సరిగా లేకపోవడం, అపరిశుభ్రతపై కేటీఆర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. వేదికకు ఎదురుగా విద్యార్థులందరినీ నేలపై కూర్చోబెట్టడంపై అధికారులను తప్పుపట్టారు. అందరం కిందనే కూర్చుందామంటూ.. మిగిలిన మంత్రులతో కలిసి విద్యార్థుల చెంత నేలపైనే కూర్చుని కాసేపు వారితో ముచ్చటించారు. మళ్లీ తాను వచ్చే నాటికి ప్రతి విద్యార్థికి సరైన వసతి సౌకర్యాలు కల్పించాలని ఇన్‌ఛార్జి వీసీ వెంకటరమణను ఆదేశించారు. తాను కూడా హాస్టల్లో ఉండి చదువుకున్నానని, విద్యార్థుల సమస్యలు తెలుసని పేర్కొన్నారు. కార్యక్రమంలో ముథోల్‌, ఖానాపూర్‌ ఎమ్మెల్యేలు విఠల్‌రెడ్డి, రేఖానాయక్‌, ఎమ్మెల్సీ విఠల్‌, నిర్మల్‌ జడ్పీ ఛైర్‌పర్సన్‌ విజయలక్ష్మి, ఆర్జీయూకేటీ డైరెక్టర్‌ సతీష్‌కుమార్‌, నిర్మల్‌ జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ, ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

జోగు రామన్నకు పరామర్శ

అంతకుముందు మంత్రులు ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలం దీపాయిగూడలో మాతృవియోగంతో బాధపడుతున్న ఎమ్మెల్యే జోగు రామన్నను పరామర్శించారు. ఆదిలాబాద్‌లోని బీఎన్‌డీటీ, ఎన్‌టీటీ డేటా సంస్థలను సందర్శించారు. ఉద్యోగులతో కేటీఆర్‌ ముచ్చటించి, అక్కడ నిర్వహించిన సభలో మాట్లాడారు. ఆదిలాబాద్‌లో మూతపడ్డ సిమెంటు పరిశ్రమ పునఃప్రారంభం కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రాయితీలు ఇస్తామని ప్రకటించినా, కేంద్రం నుంచి స్పందన లేదని విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని