‘అధికారి’క అక్రమం

ఒకటి కాదు..రెండు కాదు.. 160 ఎకరాలు. భూమి విలువ రూ.కోట్లలోనే... ఓ రెవెన్యూ అధికారి ఆ భూమిపై కన్నేశారు..  ఓ కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు. లేని పత్రాలు సృష్టించారు. సదరు కంపెనీ ఆ భూములు కొనుగోలు

Updated : 27 Sep 2022 06:46 IST

160 ఎకరాలు కొట్టేసేందుకు ఓ రెవెన్యూ ఉన్నతాధికారి పన్నాగం

ఓ కంపెనీ పేరిట కట్టబెట్టే యత్నం

చేతులు మారిన రూ. 3 కోట్లు

అనూహ్యంగా వెలుగులోకి వ్యవహారం

ఈనాడు - నల్గొండ

ఒకటి కాదు..రెండు కాదు.. 160 ఎకరాలు. భూమి విలువ రూ.కోట్లలోనే... ఓ రెవెన్యూ అధికారి ఆ భూమిపై కన్నేశారు..  ఓ కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు. లేని పత్రాలు సృష్టించారు. సదరు కంపెనీ ఆ భూములు కొనుగోలు చేసిందనేందుకు అవసరమైన దస్త్రాలు సిద్ధం చేశారు. ఈ అక్రమాన్ని సక్రమం చేయాలంటూ కింది స్థాయి అధికారులపైనా ఒత్తిడి తెచ్చారు. జిల్లా అధికారికీ ఆ దస్త్రాన్ని పంపారు. ఆయన దాన్ని తిప్పిపంపడంతో నల్గొండ జిల్లాలో జరిగిన ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చి ఆ శాఖలో కలకలం రేపింది.

ల్గొండ జిల్లా దామరచర్ల మండలం రాజగట్టు రెవెన్యూ గ్రామంలోని సర్వే నంబరు 826లోని భూములను నాగార్జునసాగర్‌ నిర్వాసితులైన పెద్ద అడిశర్లపల్లి మండలంలోని చిన్న గుమ్మడం, పెద్ద గుమ్మడం గ్రామాల నిర్వాసితులకు సుమారు 50 ఏళ్ల క్రితం కేటాయించారు. ఆ భూములు దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండటంతో వారు అక్కడికి వెళ్లలేదు. దాంతో వాటిని స్థానికంగా నివాసం ఉండే గిరిజనులకు డీ-ఫాం పట్టాలు కేటాయిస్తూ (డిస్‌ రిజర్వ్‌డ్‌ చేస్తూ) అప్పట్లో ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. తాజాగా ఒక ప్రజాప్రతినిధి సహకారంతో రెవెన్యూ అధికారి ఈ సర్వే నంబరులోని 160 ఎకరాలను ఓ కంపెనీకి కట్టబెట్టేందుకు దస్త్రం తయారు చేశారు. దీనికి ఆమోదం లభించేలోగానే అప్పటి జిల్లా ఉన్నతాధికారి బదిలీ కాగా.. ఆయన స్థానంలో బాధ్యతలు చేపట్టిన మరో అధికారి వెంటనే ఆమోదించలేదు. తాజాగా పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టిన జిల్లా ఉన్నతాధికారి వద్దకు దస్త్రం తీసుకురాగా.. ఆయన ఆ రెవెన్యూ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాన్ని తిరస్కరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రస్తుతం ఆ సర్వే నంబరులో ఎకరా రూ.15 లక్షల వరకు పలుకుతోంది. దీని ప్రకారం 160 ఎకరాల విలువ సుమారు రూ.24 కోట్ల వరకు ఉంటుంది. ఈ భూములను రిజిస్ట్రేషన్‌ చేసి ఇచ్చేందుకు సదరు రెవెన్యూ అధికారికి ఆ కంపెనీతో ఒప్పందం కుదిరిందని, రూ.3 కోట్లు అడ్వాన్సు కూడా చెల్లించిందని విశ్వసనీయంగా తెలిసింది.

తప్పుడు పత్రాలు సృష్టించి..

సర్వే నంబరు 826లో మొత్తం 1097 ఎకరాలుంది. ఇందులో 776 ఎకరాలు డిస్‌ రిజర్వుడ్‌ జాబితాలో ఉన్నాయి. 108.09 ఎకరాలను ధరణిలో ఇప్పటికే ఇతరుల పేర్లపై నమోదు చేశారు. మరోవైపు డిస్‌ రిజర్వు జాబితాలోని భూమిని దక్కించుకునేందుకు సుమారు 150 మంది దరఖాస్తు చేశారు. ఇదే సర్వే నంబరులోని 160 ఎకరాలపై కన్నేసిన రెవెన్యూ అధికారి ఓ కంపెనీ పేరిట కట్టబెట్టే మంత్రాంగానికి తెరతీశారు. ఆ భూములను ఓ క్రోమైట్స్‌ కంపెనీ నుంచి మరో కంపెనీ కొనుగోలు చేసినట్లు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించారు. తాజాగా హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే ఓ స్టీల్స్‌ కంపెనీ కొనుగోలు చేసినట్లు దస్త్రాలు తయారు చేశారు. ఈ స్టీల్స్‌ కంపెనీ రెవెన్యూ అధికారి బంధువుకు చెందినది కావడం గమనార్హం. భూ కేటాయింపులపై స్టీల్స్‌ కంపెనీకి అనుకూలంగా నివేదిక ఇవ్వాలంటూ క్షేత్రస్థాయి సిబ్బందిని రెవెన్యూ అధికారి ఆదేశించగా.. అందుకు తహసీల్దార్‌తో పాటు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ ససేమిరా అన్నారని సమాచారం. దాంతో వారిని ఆయన బదిలీ చేయించారు. మరో 100 ఎకరాలకు హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే ఓ కంపెనీ పేరిట సుమారు నాలుగేళ్ల క్రితం రిజిస్ట్రేషన్‌ చేసినట్లు తెలిసింది. కాగా, ఈ కంపెనీలకు చెందిన వారెవరూ క్షేత్రస్థాయిలో కబ్జాలో లేకపోవడం గమనార్హం. ఈ వ్యవహారంపై జిల్లా అధికార యంత్రాంగం అంతర్గతంగా విచారణ చేస్తున్నట్లు తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని