తెలంగాణలో భారీ ఫర్నిచర్‌ పార్కులు!

తెలంగాణలో కలప, కలపేతర ఆధారిత పరిశ్రమలను పెద్దఎత్తున ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో తొలిసారిగా ఆధునిక ఫర్నిచర్‌ పార్కులను ఏర్పాటు చేయడంతో పాటు

Published : 27 Sep 2022 04:16 IST

 దండుమల్కాపూర్‌, అచ్చయ్యపల్లిలో ఏర్పాటు

థాయ్‌లాండ్‌, మలేసియాల భాగస్వామ్యంతో..

భారీగా ఉపాధి లక్ష్యంతో ప్రభుత్వం సన్నాహాలు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో కలప, కలపేతర ఆధారిత పరిశ్రమలను పెద్దఎత్తున ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో తొలిసారిగా ఆధునిక ఫర్నిచర్‌ పార్కులను ఏర్పాటు చేయడంతో పాటు ఈ రంగంలో భారీ, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను పెద్దఎత్తున స్థాపింపజేయాలని సంకల్పించింది. దేశవిదేశాలకు చెందిన భారీ సంస్థలతో పాటు స్థానికంగా పరిశ్రమల ద్వారా భారీ పెట్టుబడుల సమీకరణతో కలప ఆధారిత వండ్రంగి చేతివృత్తులవారికి ఉపాధి కల్పించేందుకు ప్రణాళికలను రూపొందించింది. ఈ రంగానికి ప్రత్యేక రాయితీలు ఇచ్చేందుకు పరిశ్రమల మంత్రివర్గ ఉపసంఘం సైతం అనుమతించింది. దేశంలో ఫర్నిచర్‌కు డిమాండ్‌ ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. ఏటా రాష్ట్రంలో ప్రభుత్వశాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు, గృహ వినియోగాలకు కలిపి రూ.పదివేల కోట్ల విలువైన ఉత్పత్తుల కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఇందులో అధికశాతం దిగుమతి చేసుకుంటున్నవే. దీనిని పరిగణనలోనికి తీసుకొని ఫర్నిచర్‌ తయారీ పరిశ్రమలకు కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పూనుకుంది.

రెండు చోట్ల ఏర్పాటుకు సన్నాహాలు

రాష్ట్రంలో రెండు భారీ ఆధునిక ఫర్నిచర్‌ పార్కుల స్థాపనపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకోసం యాదాద్రి భువనగిరి జిల్లా దండు మల్కాపూర్‌లో 100 ఎకరాలు, ములుగు జిల్లా అచ్చయ్యపల్లిలో 300 ఎకరాలను సేకరించింది. వీటికి త్వరలోనే పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేయనున్నారు. ఫర్నిచర్‌కు ప్రసిద్ధి చెందిన థాయ్‌లాండ్‌, మలేసియా, తైవాన్‌ దేశాల పారిశ్రామికవేత్తలు ఇటీవల తెలంగాణను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌.. ఇక్కడ ఏర్పాటు చేయనున్న పార్కుల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. రెండు పార్కుల్లో 50 ఎకరాల చొప్పున భూములు కావాలని వారు కోరగా అంగీకరించారు. ఐకియా, గోద్రెజ్‌తో పాటు మరో నాలుగు కంపెనీలతోనూ మంత్రి చర్చించారు.

వృత్తిదారులకు శిక్షణ కేంద్రం

అందుబాటులో ఉన్న సాదా కలపను వినియోగించడంతో పాటు ట్రాపియోకా, పారావుడ్‌, రబ్బర్‌వుడ్‌, టింబర్‌వుడ్‌, బర్మాటేక్‌, వెదురు, యూకలిప్టస్‌, ప్లైవుడ్‌, ఫైబర్‌, ఇనుము, స్టీలు, ఇతర లోహాలు, ప్లాస్టిక్‌, లెదర్‌ వంటి వాటితో ఫర్నిచర్‌ చేయిస్తారు. ఈ పార్కుల్లో ప్లైవుడ్‌ పరిశ్రమలు, పార్టికల్‌ బోర్డ్‌ యూనిట్లు, మీడియం డెన్సిటీ ఫైబర్‌ తదితర ఇతర యూనిట్లు ఉంటాయి. పర్యావరణ హితం కోసం వివిధ దేశాలు అనుసరిస్తున్న విధానాన్ని ఇక్కడ అమలు చేస్తారు. ఫర్నిచర్‌ ఉత్పత్తులకు వాడే ప్రత్యేక కలప మొక్కల పెంపకాన్ని కూడా పార్కులో చేపడుతుంది. పార్కుల్లో భారీ సంస్థలతో పాటు సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు, వృత్తిదారులకు ప్రభుత్వం స్థలాలను కేటాయించనుంది. అధునాతన యంత్రాలు, సృజనాత్మకత, ఆకృతుల స్టూడియోతో పాటు ఉమ్మడి సౌకర్యాల కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది. నిపుణుల ద్వారా శిక్షణ కేంద్రాన్ని సైతం నిర్వహించనుంది.


ఫర్నిచర్‌ రంగానికి భారీ డిమాండ్‌

- జయేశ్‌రంజన్‌, పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి

రాష్ట్రంలో ఫర్నిచర్‌ రంగానికి భారీ డిమాండ్‌ ఉంది. హైదరాబాద్‌లో అంతర్జాతీయ సంస్థ ఐకియా అమ్మకాలు దీన్ని రుజువు చేస్తున్నాయి. ముడిసరకులతో పాటు ఆధునిక యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది. దీంతో అన్నిరకాల ఉత్పత్తులకు అవకాశం ఉంది. ఫర్నిచర్‌ పారిశ్రామిక పార్కు ద్వారా వృత్తిదారులతో పాటు యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని