బియ్యం సేకరణలో జాప్యానికి అధికారులదే బాధ్యత

మిల్లర్ల నుంచి బియ్యం సేకరణలో జాప్యం జరిగితే అధికారులదే బాధ్యత అని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ స్పష్టం చేశారు. సేకరణ వేగం పెంచాలని, అధికారులు

Published : 27 Sep 2022 04:44 IST

సమీక్షా సమావేశంలో మంత్రి కమలాకర్‌

ఈనాడు, హైదరాబాద్‌: మిల్లర్ల నుంచి బియ్యం సేకరణలో జాప్యం జరిగితే అధికారులదే బాధ్యత అని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ స్పష్టం చేశారు. సేకరణ వేగం పెంచాలని, అధికారులు మిల్లులను రోజువారీగా పరిశీలించి ధాన్యం మిల్లింగ్‌ తీరుతెన్నులను పర్యవేక్షించాలని తెలిపారు. ఎఫ్‌సీఐకి బియ్యం వెంటవెంటనే వెళ్లేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రేషన్‌ బియ్యం రీసైక్లింగ్‌కు అడ్డుకట్ట వేయాలని, సంబంధిత అక్రమాలను నియంత్రించేందుకు టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో సోమవారం అన్ని జిల్లాల పౌర సరఫరాల అధికారులతో మంత్రి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. బియ్యం సేకరణను ఎఫ్‌సీఐ పునరుద్ధరించినప్పటికీ ధాన్యం మిల్లింగ్‌ జరుగుతున్న తీరు సరిగా లేదని ఈ సందర్భంగా మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయమై తాను త్వరలోనే జిల్లాల్లో పర్యటిస్తానని.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారి విషయంలో కఠినంగా వ్యవహరించక తప్పదని స్పష్టం చేశారు. వచ్చే సీజన్‌లో పెద్ద మొత్తంలో ధాన్యం రానున్నందున నిల్వ చేసేందుకు మధ్యంతర గోదాములను గుర్తించాలని అధికారులకు సూచించారు. ‘‘రేషన్‌ కార్డులున్న పేదలకు ప్రభుత్వం ఇస్తున్న బియ్యాన్ని కొనుగోలు చేసి వాటినే కొందరు కస్టమ్‌ మిల్లింగ్‌ బియ్యం రూపంలో ఇస్తున్నారు. ఈ అక్రమాలను సాగనీయకూడదు. గురుకులాలు, వసతి గృహాలు, విద్యాలయాలకు నాణ్యతతో కూడిన పాత బియ్యమే ఇవ్వాలి. నాణ్యతను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి’’ అని మంత్రి స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని