ఎంసెట్‌ రెండో విడత కౌన్సెలింగ్‌ వాయిదా

రాష్ట్రంలో బుధవారం నుంచి మొదలు కావాల్సిన ఎంసెట్‌ రెండో విడత కౌన్సెలింగ్‌ వాయిదా పడింది. దాన్ని అక్టోబరు 11వ తేదీ నుంచి ప్రారంభించాలని ఎంసెట్‌ ప్రవేశాల కమిటీ నిర్ణయించింది.

Published : 27 Sep 2022 04:44 IST

 ఈ నెల 28కి బదులు అక్టోబరు 11 నుంచి ప్రారంభం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో బుధవారం నుంచి మొదలు కావాల్సిన ఎంసెట్‌ రెండో విడత కౌన్సెలింగ్‌ వాయిదా పడింది. దాన్ని అక్టోబరు 11వ తేదీ నుంచి ప్రారంభించాలని ఎంసెట్‌ ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. బీటెక్‌ ఫీజులపై స్పష్టత రాకపోవడం వాయిదాకు ప్రధాన కారణమని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ నెల 28 నుంచి ఎంసెట్‌ రెండో విడత కౌన్సెలింగ్‌ ప్రారంభిస్తే తొలి విడతలో సీట్లు పొందిన వారు వాటిని రద్దు చేసుకోవడానికి తుది గడువు సోమవారమే. అప్పటికి ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ(జోసా) మొదటి విడత సీట్ల కేటాయింపు మాత్రమే పూర్తవుతుంది. దానివల్ల రెండు, ఆ తర్వాత రౌండ్లలో సీట్లు వస్తే ఎంసెట్‌లో చెల్లించిన 50 శాతం రుసుమును కోల్పోవాల్సి వస్తుంది. వీటన్నిటిని పరిగణనలోకి తీసుకొన్న అధికారులు రెండో విడతను అక్టోబరు 11వ తేదీ నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. అంటే తొలి విడతలో సీట్లు పొందిన వారు వాటిని రద్దు చేసుకోవడానికి ఈ నెల 26 వరకు ఉన్న గడువును అక్టోబరు 9 వరకు పొడిగించే అవకాశం ఉంది. అప్పటికి జోసా నాలుగు రౌండ్ల కౌన్సెలింగ్‌ ముగుస్తుందని అధికారులు చెబుతున్నారు.

ఇదీ కౌన్సెలింగ్‌ కాలపట్టిక...

* అక్టోబరు 11-12 వరకు: ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించి స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవడం

* 12న: ధ్రువపత్రాల పరిశీలన

* 12, 13 తేదీల్లో: వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవడం

* 16న: సీట్ల కేటాయింపు

* 16-18వ తేదీ: ట్యూషన్‌ ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయడం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని