భూముల విక్రయంతోనే రూ.10 వేల కోట్లు!

సేకరణ.. అభివృద్ధి.. ఆదాయం అనే విధానంలో భాగంగా భూముల విక్రయాల ద్వారా రూ.10 వేల కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకునే దిశగా ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం జిల్లాల్లో పడావుగా ఉన్న ఎసైన్డ్‌ తదితర

Published : 27 Sep 2022 04:44 IST

ఆదాయం సమకూర్చుకొనేందుకు సర్కార్‌ అడుగులు

హైదరాబాద్‌ పరిసర జిల్లాల్లో అభివృద్ధికి సిద్ధంగా 2వేల ఎకరాలు

జాబితాలో వెయ్యి ఎకరాల ఎసైన్డ్‌ భూములు

ఈనాడు, హైదరాబాద్‌: సేకరణ.. అభివృద్ధి.. ఆదాయం అనే విధానంలో భాగంగా భూముల విక్రయాల ద్వారా రూ.10 వేల కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకునే దిశగా ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం జిల్లాల్లో పడావుగా ఉన్న ఎసైన్డ్‌ తదితర ప్రభుత్వ భూములు, వాటి పక్కనున్న ప్రైవేటు భూములు, రెవెన్యూశాఖ వద్ద ఉన్న భూములను అధికారులు సేకరిస్తున్నారు. ఇప్పటివరకు భూ నిధి కింద రాష్ట్రవ్యాప్తంగా 12 వేల ఎకరాల వరకు గుర్తించారు. ఖరీదైన భూములున్న హైదరాబాద్‌ పరిసర జిల్లాలైన రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి, యాదాద్రిల్లోనే 5వేల ఎకరాల వరకు ఉన్నాయి. మొదట 2వేల ఎకరాలను అభివృద్ధికి సిద్ధం చేస్తున్నారు. వీటి విక్రయాల ద్వారానే రూ.10 వేల కోట్లు సమకూరుతాయని భావిస్తున్నారు.

ప్రభుత్వానికి చేరిన దస్త్రం!

రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్ల ద్వారా భూముల సమాచారాన్ని రెవెన్యూశాఖ తెప్పించుకుంది. కనిష్ఠంగా 50 ఎకరాల కన్నా ఎక్కువ విస్తీర్ణం ఒకేచోట ఉన్న భూములను గుర్తించి సర్వే నంబర్లు, రైతుల వివరాలను కలెక్టర్లు అందజేశారు. భూముల యజమానులతో తహసీల్దార్లు ప్రాథమికంగా చర్చించారు. వారు సుముఖత వ్యక్తపరిస్తేనే సేకరించే జాబితాలో చేర్చుతున్నారు. కాగా, భూముల సేకరణకు వ్యతిరేకంగా కొన్నిచోట్ల స్థానిక సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అలాంటి చోట ఆచితూచి వ్యవహరించాలని అధికారులు భావిస్తున్నారు. గుట్టలు, లోయలు ఉన్నచోట భూముల అభివృద్ధి ఖర్చుతో కూడుకున్నది కావడంతో సేకరణలో కొంత జాప్యం జరుగుతోందని సమాచారం. హైదరాబాద్‌-వరంగల్‌, కరీంనగర్‌ ప్రధాన రహదారి వెంబడి పలుచోట్ల భూముల యజమానులతో చర్చలు కొలిక్కిరాగా.. మరికొంత విస్తీర్ణానికి సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. మొదట హైదరాబాద్‌ శివారు జిల్లాల్లో సేకరణ, అభివృద్ధి ప్రక్రియలను పూర్తి చేయాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన దస్త్రం ప్రభుత్వానికి చేరినట్లు తెలిసింది.

ఎకరాకు 600 చదరపు గజాలు కోరుతున్న యజమానులు

హెచ్‌ఎండీఏ పరిధిలోకి వచ్చే నాలుగు జిల్లాల్లో దాదాపు వెయ్యి ఎకరాల వరకు ఎసైన్డ్‌ తదితర భూములు ఉన్నాయి. సేకరించిన భూములను అభివృద్ధి చేసి లేఅవుట్లుగా మార్చాక వాటిలో ఎకరాకు 600 చదరపు గజాల చొప్పున ఇవ్వాలని యజమానులు కోరుతున్నారని అధికారులు చెబుతున్నారు. మరికొన్ని చోట్ల సగం భూమి కావాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలందిన వెంటనే భూములను అభివృద్ధి చేసి.. లేఅవుట్లు వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఉన్నతాధికారి ఒకరు ‘ఈనాడు’కు తెలిపారు. ఎసైన్డ్‌ భూముల అభివృద్ధికి సంబంధించి ఎక్కువగా సాగు చేయని భూములను గుర్తిస్తున్నామని, యజమానులు అంగీకరిస్తేనే సేకరించే అవకాశాలను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts