సక్రమానికి సర్వం సిద్ధం

రాష్ట్రంలోని అక్రమ లేఅవుట్లలో ప్రభుత్వ నిబంధనల మేరకు ఉన్న వాటిలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇలాంటి లేేఅవుట్లను గుర్తించే ప్రక్రియను పురపాలక, డీటీసీపీ, పంచాయతీరాజ్‌

Published : 27 Sep 2022 04:44 IST

నిబంధనల మేరకు ఉన్నవి గుర్తింపు

పంచాయతీలు, పురపాలికల్లో అత్యధికం

హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ పరిధిలోనూ భారీగానే

అక్రమ లేఅవుట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు మార్గం సుగమం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని అక్రమ లేఅవుట్లలో ప్రభుత్వ నిబంధనల మేరకు ఉన్న వాటిలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇలాంటి లేేఅవుట్లను గుర్తించే ప్రక్రియను పురపాలక, డీటీసీపీ, పంచాయతీరాజ్‌ విభాగాలు దాదాపు పూర్తిచేశాయి. ఆ వివరాలను రిజిస్ట్రేషన్‌ శాఖకు, లేఅవుట్‌ డెవలపర్లకు అందించనున్నారు. వీటిలోని స్థలాలకు మాత్రమే రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఉత్తర్వులివ్వాల్సిన అవసరంలేదని ప్రభుత్వ వర్గాలు నిర్ణయించాయి. న్యాయపరమైన చిక్కులకు అవకాశం లేకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.

వందల లేఅవుట్లు.. వేల ప్లాట్లు..

హెచ్‌ఎండీఏ పరిధిలో 1300కు పైగా అక్రమ లేఅవుట్లు, ప్రతి లేఅవుట్‌లో 200 నుంచి 300 దాకా ప్లాట్లు ఉన్నాయి. అత్యధికంగా రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉండగా తర్వాత స్థానంలో మేడ్చల్‌, యాదాద్రి-భువనగిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో కూడా 300కు పైగా అక్రమ లేఅవుట్లు, వాటిలో 15 వేలకు పైగా ప్లాట్లు ఉండడం గమనార్హం. ఇతర పురపాలికల్లో అక్రమ లేఅవుట్లు వెయ్యికి పైగా ఉన్నట్లు వెల్లడైంది. గ్రామపంచాయతీల్లో ఇవి 14 వేలకు పైగా ఉండగా వీటిలో 10 లక్షల వరకు స్థలాలు ఉన్నట్లు పంచాయతీరాజ్‌శాఖ గుర్తించింది. సుమారు 2300 గ్రామపంచాయతీల పరిధిలో అక్రమ లేఅవుట్లు ఉన్నాయి.

జీవో 131 ప్రకారమే...

తాజా రిజిస్ట్రేషన్లకు 2020 ఆగస్టు 8న పురపాలకశాఖ జారీ చేసిన జీవో 131లోని అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోనున్నట్లు పురపాలకశాఖ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. ప్రభుత్వ స్థలాలు, పట్టణ భూగరిష్ఠ పరిమితి చట్టం మిగులు భూములు, దేవాదాయ భూములు, చెరువుల శిఖం భూముల్లో ఉన్న ప్లాట్లు, లేఅవుట్లకు ఎల్‌ఆర్‌ఎస్‌ వర్తించదనే నిబంధన విధించారు. లేఅవుట్‌లో పది శాతం ప్లాట్లు విధిగా రిజిస్ట్రేషన్‌ చేసి ఉండాలనే నిబంధన అమలు చేయనున్నారు.

అనధికారం.. ఇష్టారాజ్యం

పురపాలక, పంచాయతీరాజ్‌ విభాగాల ఉదాసీనత కారణంగా.. డెవలపర్లు అనుమతులు లేకుండానే వేల సంఖ్యలో లేఅవుట్లు వేసి ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేస్తూ వచ్చారు. నిర్దేశించిన మేరకు ఖాళీ స్థలాలు వదలకుండా, రోడ్లు, మురుగునీటి వ్యవస్థ, విద్యుత్తు వంటి మౌలిక సదుపాయాలు కల్పించకుండానే లేఅవుట్లు వేసేశారు. రిజిస్ట్రేషన్లకు అవరోధం లేకపోవడంతో ఏళ్ల తరబడి వీటి విక్రయాలు యథేచ్ఛగా సాగాయి. వీటిలో ప్లాట్లు కొన్న యజమానులతో పాటు స్థానిక సంస్థలకూ ఇబ్బందులు తప్పడంలేదు. ఈ నేపథ్యంలోనే అక్రమ లేఅవుట్లలో రిజిస్ట్రేషన్లను ప్రభుత్వం రెండేళ్ల కిందట ఆపేసింది. అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్‌)కు అవకాశం కల్పించగా 25 లక్షలకు పైగా దరఖాస్తులొచ్చాయి. అక్రమ లేఅవుట్‌లో గతంలో కొన్ని ప్లాట్లు రిజిస్ట్రేషన్‌ అయి ఉంటే వాటి ఆధారంగా హైకోర్టును ఆశ్రయించి పలువురు అభివృద్ధిదారులు తదుపరి ప్లాట్లకూ రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారు. వీటికి అడ్డుకట్ట వేసేలా ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించి అనుకూలంగా ఉత్తర్వులు తెచ్చింది. తాజాగా నిబంధనల మేరకు ఉన్న అనధికారిక లేఅవుట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు మార్గం సుగమం చేయడంతో రిజిస్ట్రేషన్‌, ఎల్‌ఆర్‌ఎస్‌ ఛార్జీల రూపంలో భారీగా ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని