విభజన సమస్యలపై నేడు దిల్లీలో సమావేశం

ఉమ్మడి రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారంపై మంగళవారం దిల్లీలోని నార్త్‌బ్లాక్‌లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ఉన్నతాధికారులతో కేంద్ర హోంశాఖ సమావేశం నిర్వహించనుంది. 

Published : 27 Sep 2022 04:44 IST

సీఎస్‌ ఆధ్వర్యంలోని అధికారుల బృందం

ఈనాడు, హైదరాబాద్‌: ఉమ్మడి రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారంపై మంగళవారం దిల్లీలోని నార్త్‌బ్లాక్‌లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ఉన్నతాధికారులతో కేంద్ర హోంశాఖ సమావేశం నిర్వహించనుంది.  దీనికి తెలంగాణ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ నేతృత్వంలోని అధికారుల బృందం హాజరు కానుంది. ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, విద్యుత్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌ శర్మ, పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌, సింగరేణి ఎండీ శ్రీధర్‌, ఆర్‌ అండ్‌ బీ శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ సీఎస్‌ వెంట ఉంటారు.  విద్యుత్‌ బకాయిలు, సింగరేణి సంస్థ అనుబంధ ఆప్మెల్‌ విభజన, పారిశ్రామిక రాయితీలు, పౌరసరఫరాల సంస్థకు కావాల్సిన నిధులు,  విభజన చట్టం తొమ్మిది, పది షెడ్యూళ్లలోని సంస్థల విభజన, పన్నులు, నిధులు, తదితర అంశాలు సమావేశ ఎజెండాలో ఉన్నాయి. ఇందులో విద్యుత్‌ బకాయిల అంశాన్ని తెలంగాణ అధికారులు  ప్రధానంగా ప్రస్తావించనున్నారు. ఏపీకి ఇవ్వాల్సిన రూ. 6,700 కోట్లను మినహాయించినప్పటికీ తెలంగాణకు ఇంకా రూ.12వేల కోట్లు ఆ రాష్ట్రం నుంచి వస్తాయని తెలంగాణ ప్రభుత్వం వాదించనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని