Abhijit Reddy: పెద్ద ఉద్యోగంతో ఆనందం.. చేరకముందే హఠాన్మరణం

కెమికల్‌ ఇంజినీరింగ్‌లో బీటెక్‌ చేసి.. 22 ఏళ్లకే రూ. 58 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం పొందిన ఆ యువకుడు.. అందులో చేరేలోపే గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. అతడి పేరు కట్టా అభిజిత్‌రెడ్డి (22). రాష్ట్ర వైద్య

Updated : 27 Sep 2022 07:20 IST

22 ఏళ్లకే గుండెపోటుతో మృతి

టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీకి పుత్రశోకం

ఈనాడు- హైదరాబాద్‌: కెమికల్‌ ఇంజినీరింగ్‌లో బీటెక్‌ చేసి.. 22 ఏళ్లకే రూ. 58 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం పొందిన ఆ యువకుడు.. అందులో చేరేలోపే గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. అతడి పేరు కట్టా అభిజిత్‌రెడ్డి (22). రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) ఎండీ కె.చంద్రశేఖర్‌రెడ్డి పెద్ద కుమారుడు. వరంగల్‌ నిట్‌లో చదివిన అభిజిత్‌.. సౌదీ అరేబియాకు చెందిన ప్రభుత్వ రంగ చమురు కంపెనీ ‘సౌదీ అరామ్‌కో’లో ఉన్నత ఉద్యోగం సాధించాడు. ఏడాదికి 70 వేల అమెరికన్‌ డాలర్ల (సుమారు రూ.58 లక్షలు) వేతనం. వచ్చే నెలలో ఉద్యోగంలో చేరాల్సి ఉంది. ఆదివారం సాయంత్రం నడకకు వెళ్లొచ్చాడు. రాత్రి టీవీలో భారత్‌-ఆస్ట్రేలియా క్రికెట్‌ మ్యాచ్‌ చూశాడు. అర్ధరాత్రి దాటాక 2 గంటలకు ఛాతీలో నొప్పితో మెలకువ వచ్చింది. ఏం జరుగుతోందో తెలిసేలోపే కుప్పకూలిపోయాడు. అలికిడికి లేచిన తమ్ముడు.. ఆందోళనతో తల్లితండ్రులనూ లేపాడు. మొదట రెండు చేతులతో అభిజిత్‌ గుండెపై గట్టిగా నొక్కడం (కార్డియో పల్మనరీ రెససిటేషన్‌-సీపీఆర్‌) మొదలుపెట్టారు. తర్వాత ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, అతడు తెల్లవారుజామున మృతిచెందాడు. చెట్టంత కుమారుడు కళ్లముందే కుప్పకూలిపోవడంతో చంద్రశేఖర్‌రెడ్డి, ఆయన సతీమణి కన్నీరుమున్నీరయ్యారు. వీరి స్వగ్రామం నాగర్‌కర్నూల్‌ జిల్లా ఉప్పునూతల. అభిజిత్‌ అకాల మరణంపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు, మాజీ వైద్యమంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డి, ఈటల రాజేందర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఛైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, అధికారులు, సిబ్బంది చంద్రశేఖర్‌రెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించారు.


గుండె కండరం మందమైతే..

- డాక్టర్‌ రమేశ్‌ గూడపాటి, సీనియర్‌ కార్డియాలజిస్ట్‌

పాశ్చాత్య దేశాల్లో సగటున 40-45 ఏళ్ల వయసులో గుండెపోటు ఎక్కువగా వస్తుంటే.. మన దేశంలో 25-30 ఏళ్ల వయసులోనే ఈ సమస్య కనిపిస్తోంది. మనవాళ్ల జన్యువుల్లో గుండెపోటు తీవ్రతను పెంచే లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. యుక్తవయస్కుల్లో గుండెపోటుకు ప్రధాన కారణం.. గుండె కండరం మందమవడం. కొందరిలో పుట్టుకతోనే గుండె కొట్టుకోవడంలో తేడా వల్ల సమస్య రావచ్చు. కొవిడ్‌ వచ్చి తగ్గిన వారికి గుండె రక్తనాళాలు, కాలి సిరల్లో రక్తం గడ్డ కట్టినా గుండె ఆగిపోవచ్చు. శారీరక దారుఢ్యం కోసం స్టెరాయిడ్లు వినియోగించే వారికీ ముప్పు ఉంటుంది. వాహనాల్లోనే తిరగడం, అధిక సమయం ఫోన్‌, టీవీ, ల్యాప్‌ట్యాప్‌లతోనే గడుపుతూ.. శారీరక వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేయడం గుండెకు చేటు. పిజ్జాలు, బర్గర్లు, సమోసాలు, చిప్స్‌, కేకులు.. ఇవన్నీ గుండెపోటు ప్రమాదాన్ని పెంచేవే. ఛాతీ మధ్య, పై భాగంలో నొప్పి, దవడ లాగినట్లుగా ఉండడం, ఛాతీ నుంచి ఎడమ, కుడి చేతుల వైపు, గొంతు వైపు నొప్పి వ్యాపించడం, చెమటలు పట్టడం, శ్వాస కష్టమవడం, ఛాతీ బరువుగా ఉండడం.. ఇవన్నీ గుండెపోటుకు సూచనలు. మధుమేహం, అధిక రక్తపోటు బాధితులు, వ్యాయామం చేయనివారు, ధూమపానం చేసేవారు, నిల్వ ఆహారాలు, వేపుళ్లు ఎక్కువగా తినేవారు, స్థూలకాయులు, నిద్రలేమి, గురక సమస్యతో బాధపడుతున్నవారు.. వీరిలో గుండెపోటుకు అవకాశం ఎక్కువ. లక్షణాలు స్వల్పంగా ఉన్నా సరే.. అత్యవసరంగా వైద్యుణ్ని సంప్రదించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని