ఎడతెగని జాప్యం.. రూ.వేలకోట్ల భారం!

ఉమ్మడి రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ప్రత్యేకంగా నిర్మిస్తామన్న థర్మల్‌ విద్యుత్కేంద్రం(టీపీపీ) ఎప్పటికి వెలుగులీనుతుందనేది ప్రశ్నార్థకమవుతోంది. ఈ చట్టం ప్రకారం తెలంగాణలో విద్యుత్‌ కొరత తీర్చడానికి 4వేల మెగావాట్ల

Published : 27 Sep 2022 04:44 IST

విభజన చట్టం ప్రకారం తెలంగాణకు 1600 మెగావాట్ల విద్యుత్కేంద్రం

ఉత్పత్తి ప్రారంభించాల్సింది 2019 నవంబరులో..

నేటి వరకూ సగమైనా పూర్తికాని పరిస్థితి

తొలుత నిర్మాణ అంచనా వ్యయం రూ.10,598 కోట్లు

జాప్యంతో నేడు రూ.13వేల కోట్లు దాటిన వైనం

పాతికేళ్ల పాటు ప్రజలపై తప్పని బాదుడు!

ఉమ్మడి రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ప్రత్యేకంగా నిర్మిస్తామన్న థర్మల్‌ విద్యుత్కేంద్రం(టీపీపీ) ఎప్పటికి వెలుగులీనుతుందనేది ప్రశ్నార్థకమవుతోంది. ఈ చట్టం ప్రకారం తెలంగాణలో విద్యుత్‌ కొరత తీర్చడానికి 4వేల మెగావాట్ల విద్యుత్కేంద్రాన్ని నిర్మిస్తామని కేంద్రం తెలిపింది. ఎనిమిదేళ్లయినా నేటికీ సగమైనా నిర్మాణం పూర్తికాలేదు. 4000 మెగావాట్లలో తొలిదశ కింద 1600 మెగావాట్ల టీపీపీ పనులని 2015లో రామగుండంలో ఎన్టీపీసీ చేపట్టింది. దీని నిర్మాణానికి బహిరంగ విచారణ 2015 మే 23న పూర్తిచేసింది. ఒక్కోటీ 800 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంతో రెండు ప్లాంట్లను రామగుండంలో ఎన్టీపీసీ స్థలంలో నిర్మించడానికి 2016 ఆరంభంలోనే కేంద్రం పర్యావరణ అనుమతినిచ్చింది. భూసేకరణ సమస్య లేనందున 2019 నవంబరు 5కల్లా మొదటి ప్లాంటు, 2020 ఏప్రిల్‌ 5కల్లా రెండోది నిర్మాణం పూర్తిచేస్తామని ప్రణాళికలో తెలిపారు. కానీ, ఇప్పటికీ ఒక్క ప్లాంటూ పూర్తికాలేదు. ఇపుడేమో వచ్చే డిసెంబరు నాటికి మొదటి ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభిస్తామంటోంది ఎన్టీపీసీ. పనుల తీరును బట్టి ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికైనా అది సాధ్యమేనా అన్నది విద్యుత్‌శాఖ వర్గాల సందేహం.


ఖర్చులు తడిసిమోపెడు...

కేంద్ర విద్యుత్‌ మండలి(సీఈఏ) మార్గదర్శకాల మేరకు దేశంలో ఏదైనా కొత్త టీపీపీ నిర్మాణం మొదలుపెడితే 48నెలల్లో పూర్తిచేసి విద్యుదుత్పత్తి ప్రారంభించాలి. కొత్తగా భూమిని సేకరించాల్సి వస్తేనే ఇంత సమయం పడుతుంది. కానీ, రామగుండంలో సొంతస్థలంలోనే టీపీపీ నిర్మాణం జరుగుతున్నా.. అంతులేని జాప్యం వల్ల పాతికేళ్లపాటు ప్రజలపై భారీగా ఆర్థికభారం పడే అవకాశాలున్నాయి. మొత్తం 1600 మెగావాట్ల ప్లాంట్‌ నిర్మాణానికి రూ.10,598.98 కోట్లు వ్యయమవుతుందని తొలుత తెలిపారు. ఏదైనా టీపీపీ నిర్మాణం ప్రారంభించే తేదీని ‘జీరో డేట్‌’గా వ్యవహరిస్తారు. ఈ ప్లాంటుకు దాన్ని 2016 జనవరి 29గా నిర్ణయించారు. అంటే రేపటికి(2022 సెప్టెంబరు 28)కి 80 నెలలు పూర్తవుతున్నాయి. విద్యుదుత్పత్తి ప్రారంభమే కానందున నిర్మాణ వ్యయ అంచనా రూ.13వేల కోట్లను దాటిపోయిందనేది తాజా సమాచారం. ఇప్పటి వ్యయ అంచనాలను బట్టి ఈ ప్లాంటులో ఉత్పత్తయ్యే కరెంటు వ్యయం యూనిట్‌కు రూ.5 దాటనుంది. ఈ లెక్కన పాతికేళ్లపాటు అధిక ధరలకు ఈ ప్లాంటు నుంచి తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లు కరెంటు కొని ప్రజలకు సరఫరా చేస్తే నెలవారీ బిల్లు భారం అదనంగా పడనుంది. కరోనా వల్ల ప్లాంటు నిర్మాణంలో జాప్యం జరిగినట్లు ఎన్టీపీసీ చెబుతోంది.


తెలంగాణపై ఇలా భారం పడుతోంది...

న్టీపీసీ ప్లాంటు నిర్మాణంలో తీవ్ర జాప్యంతో ప్రజలపై రూ.వందల కోట్ల భారం పడనుంది. ఎలాగంటే...ఈ ప్లాంటు నిర్మాణం నిర్ణీత గడువు 2020 జనవరికల్లా పూర్తయితే రోజుకు 30-35లక్షల యూనిట్ల కరెంటు రాష్ట్రానికి కనిష్ఠంగా యూనిట్‌కి రూ.5లోపే లభించేది. అది రానందున బయట యూనిట్‌ రూ.12 నుంచి 20 వరకూ వెచ్చించి కొనాల్సి వస్తోంది. రోజుకు కనిష్ఠంగా 30లక్షల యూనిట్లను రూ.12కు కొంటే.. అదనంగా రూ.2.10కోట్ల చొప్పున ఆర్థికభారం  డిస్కంలపై పడుతోంది. ఈ లెక్కన 2020 ఫిబ్రవరి నుంచి 2022 సెప్టెంబరు ఆఖరునాటికి రూ.2016 కోట్లు అదనంగా ఆర్థికభారం పడినట్లు అంచనా. ఇలా ఈ ప్లాంటు ఆలస్యమయ్యేకొద్దీ కరెంటు కొనుగోలు భారం పెరుగుతూనే ఉంటుంది. జాప్యం కారణంగా మరోవైపు నిర్మాణవ్యయం రూ.వేలకోట్లు పెరిగి భవిష్యత్తులో అక్కడ విద్యుదుత్పత్తి వ్యయం ఆకాశన్నంటుతుందని డిస్కంల పరిశీలనలో తేలింది. ఈ సొమ్మునంతా ప్రజల నుంచి కరెంటు బిల్లుల రూపంలో భవిష్యత్తులో రాబట్టక తప్పదని సీనియర్‌ విద్యుత్‌ అధికారి ఒకరు ‘ఈనాడు’కు వివరించారు.

- ఈనాడు, హైదరాబాద్‌

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని