Telangana News: లంచాల జబ్బు

జోగులాంబ గద్వాల జిల్లా వైద్య ఆరోగ్య అధికారి (డీఎంహెచ్‌ఓ)పై ఇటీవల పెద్దఎత్తున ఆరోపణలొచ్చాయి. స్థానికంగా ఓ వైద్యుని పోస్టు నియామకానికి రూ.లక్ష లంచం స్వీకరించారని రాష్ట్ర సహకార వినియోగదారుల ఫోరం ఛైర్మన్‌ ఆరోపించారు. స్పందించిన ప్రభుత్వం సంయుక్త సంచాలకుని నేతృత్వంలో విచారణకు ఆదేశించింది.

Updated : 28 Sep 2022 05:17 IST

అక్రమాలకు కేంద్రంగా జిల్లా వైద్యఆరోగ్యశాఖ కార్యాలయాలు

 సర్కారుకు పెద్దఎత్తున ఫిర్యాదులు

 ప్రభుత్వం ఆదేశించే వరకూ ప్రైవేటు ఆసుపత్రులు, వైద్య కేంద్రాల తనిఖీల జోలికి వెళ్లని అధికారులు

 ఇప్పటికీ 15 జిల్లాల్లో ప్రారంభంకాని సోదాలు

జోగులాంబ గద్వాల జిల్లా వైద్య ఆరోగ్య అధికారి (డీఎంహెచ్‌ఓ)పై ఇటీవల పెద్దఎత్తున ఆరోపణలొచ్చాయి. స్థానికంగా ఓ వైద్యుని పోస్టు నియామకానికి రూ.లక్ష లంచం స్వీకరించారని రాష్ట్ర సహకార వినియోగదారుల ఫోరం ఛైర్మన్‌ ఆరోపించారు. స్పందించిన ప్రభుత్వం సంయుక్త సంచాలకుని నేతృత్వంలో విచారణకు ఆదేశించింది.


ఒక ప్రైవేటు ఆసుపత్రికి అనుమతులు ఇచ్చేందుకు మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా వైద్య ఆరోగ్య అధికారి రూ.5 లక్షలు లంచం తీసుకున్నారన్న ఆరోపణలొచ్చాయి. ఈ అంశం వైద్య మంత్రి దృష్టికి రాగా.. ఆ అధికారిని అక్కడి నుంచి బదిలీ చేశారు. అయితే ఆయనను మరో జిల్లాకు డీఎంహెచ్‌ఓగా నియమించడం కొసమెరుపు.


ఈనాడు- హైదరాబాద్‌: జిల్లాస్థాయిలో ప్రైవేటు ఆసుపత్రులకు అనుమతులు.. ప్రభుత్వ వైద్య సిబ్బంది నియామకాలు, బదిలీలు, ఒప్పంద వైద్యులకు వేతనాల చెల్లింపులు.. ఇలా ఏ పని జరగాలన్నా పలు జిల్లాల్లో వైద్య ఆరోగ్య అధికారి (డీఎంహెచ్‌ఓ) కార్యాలయానికి ముడుపులు ముట్టాల్సిందేనన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్వయంగా కొందరు డీఎంహెచ్‌ఓలు, ఉప వైద్యాధికారులపై విమర్శలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. ఇటీవల నాగర్‌కర్నూల్‌ జిల్లాలో చేపట్టిన స్టాఫ్‌నర్సుల నియామకాల్లో అర్హులకు కాదని, డబ్బులు తీసుకొని తమకు నచ్చిన వారికి పోస్టింగులు ఇచ్చారని ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. ఇలాంటి అక్రమాల్లో ఆయా అధికారుల చేతికి మట్టి అంటకుండా వారి వ్యక్తిగత సహాయకులు కీలక పాత్ర పోషిస్తున్నారు.మరోవైపు ప్రైవేటు ఆసుపత్రులు ముడుపులిస్తే ఎలాంటి తనిఖీలు జరపకుండానే అనుమతులిస్తున్నారని, ఎలాంటి తప్పులున్నా కప్పిపుచ్చుతున్నారనే ఆరోపణలున్నాయి. ఇటీవల కొన్ని ఆసుపత్రుల్లో అగ్నిప్రమాదాలు చోటుచేసుకోవడం, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించడం, అర్హత లేకపోయినా చికిత్సలు అందించడం వంటివి వెలుగులోకి వచ్చిన సందర్భాల్లో తాత్కాలికంగా చర్యలు తీసుకొని.. మళ్లీ వారికి అనుమతులిచ్చారు. దీని వెనుక ముడుపులు చేతులు మారాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలో రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రులు, పరీక్ష కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించాలని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు ఇచ్చిన ఆదేశాల మేరకు.. ఈ నెల 23 నుంచి జిల్లా వైద్య ఆరోగ్య అధికారుల నేతృత్వంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా అర్హత లేని వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది.. అవసరమైన వైద్య సిబ్బంది లేకపోవడం.. అనుమతులు తీసుకోకపోవడం.. నిబంధనల మేరకు మౌలిక వసతులు కల్పించకపోవడం.. పారిశుద్ధ్యం తదితర అన్ని కోణాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. 10 రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రజారోగ్య సంచాలకులు ఆదేశాలిచ్చినా ఇప్పటివరకూ 15 జిల్లాల్లో అధికారులు తనిఖీలు ప్రారంభించకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

21 ఆసుపత్రుల మూసివేత

మిగతా 18 జిల్లాల్లో గత 5 రోజుల్లో వైద్య బృందాలు 311 ఆసుపత్రులను తనిఖీ చేశాయి. ఇందులో 21 ఆసుపత్రులను మూసివేయగా.. 83 దవాఖానాలకు తాఖీదులు అందించారు. మరో ఏడింటికి జరిమానాతో సరిపెట్టారు.

* రంగారెడ్డి జిల్లాల్లో అత్యధికంగా 67 ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహించారు. ఇక్కడ ఏడింటిని మూసివేయగా.. 20 దవాఖానాలకు తాఖీదులు, ఒక దానికి జరిమానా విధించారు.

* హైదరాబాద్‌లో ఇప్పటివరకూ 17 ఆసుపత్రులనే తనిఖీ చేశారు. ఇక్కడ 9 దవాఖానాలకు తాఖీదులు, ఒక ఆసుపత్రికి జరిమానా విధించారు.

* వికారాబాద్‌లో 44 ప్రైవేటు ఆసుపత్రుల్లో తనిఖీలు చేసి, అయిదింటిని మూసివేశారు. మరో 2 ఆసుపత్రులకు తాఖీదులు, అయిదింటికి జరిమానా విధించారు.

* కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 4, మంచిర్యాలలో 14, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 17, నిజామాబాద్‌లో 7, వరంగల్‌లో 3 ఆసుపత్రులను తనిఖీ చేశారు. ఈ జిల్లాల్లో ఒక్క దానిపైనా చర్య తీసుకోలేదు.

ఇప్పటికీ లోపాయికారి ఒప్పందాలు!

ప్రైవేటు వైద్య కేంద్రాల్లో లోపాలపై స్వయంగా ప్రభుత్వం జోక్యం చేసుకునే వరకూ జిల్లా వైద్యాధికారులు తనిఖీలు చేసిన దాఖలాలులేవు. దీనినిబట్టి అవినీతి ఏస్థాయిలో ఉందో అర్థమవుతుందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తనిఖీలు నిర్వహిస్తున్నా.. ఇప్పటికీ లోపాయికారిగా కొన్ని ఆసుపత్రులతో ఒప్పందాలు కుదుర్చుకొని చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.


* కొందరు డీఎంహెచ్‌ఓలు పెద్దఎత్తున పైరవీలు చేసుకొని.. ప్రైవేటు ఆసుపత్రులు ఎక్కువగా ఉన్న జిల్లాల్లోనే పోస్టింగ్‌లు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం తదితర జిల్లాల్లో పోస్టింగులకు డిమాండ్‌ ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో డీఎంహెచ్‌ఓల వ్యవహారాలపై నిశితంగా దృష్టిసారించాల్సిన అవసరముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని