తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక కొండా లక్ష్మణ్‌ బాపూజీ

తెలంగాణ సాధనతో పాటు బడుగు బలహీనవర్గాల కోసం బాపూజీ జీవితాంతం పోరాడారు. జలదృశ్యంలోని ఆయన నివాసం నుంచి సామాన్లను నాటి ప్రభుత్వం బయట పడేసింది. అదే స్థలంలో నేడు 20 అడుగుల కొండా లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

Published : 28 Sep 2022 03:13 IST

మంత్రి కేటీఆర్‌

జలదృశ్యం, సిరిసిల్లల్లో విగ్రహాల ఆవిష్కరణ

తెలంగాణ సాధనతో పాటు బడుగు బలహీనవర్గాల కోసం బాపూజీ జీవితాంతం పోరాడారు. జలదృశ్యంలోని ఆయన నివాసం నుంచి సామాన్లను నాటి ప్రభుత్వం బయట పడేసింది. అదే స్థలంలో నేడు 20 అడుగుల కొండా లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

- కేటీఆర్‌

ఈనాడు-హైదరాబాద్‌, సిరిసిల్ల గ్రామీణం-న్యూస్‌టుడే: ఉద్యమనాయకుడు కేసీఆర్‌ నాయకత్వంలో తెరాస ఆవిర్భవించిన జలదృశ్యాన్ని అప్పటి సమైక్య రాష్ట్రంలోని ప్రభుత్వం అవమానకరంగా కూల్చి వేసిందని, ఈ రోజు అక్కడే సమరయోధుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించి... ఆత్మగౌరవ పతాకాన్ని సమున్నతంగా ఎగురవేశామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ మంత్రి కొండా లక్ష్మణ్‌బాపూజీ జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌ వద్ద గల జలదృశ్యంలో, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆయన విగ్రహాలను మంగళవారం కేటీఆర్‌ ఆవిష్కరించి మాట్లాడారు. ‘‘కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి, వర్ధంతులను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయానికి ఆయన పేరుపెట్టి గౌరవించుకున్నాం. చేనేత రంగంలో ప్రతిభావంతులైన కళాకారులకు బాపూజీ పేరుతో పురస్కారాలిస్తున్నాం. అలాంటి తెలంగాణ వైతాళికుల గొప్పదనాన్ని భవిష్యత్తు తరాలకు తెలియజేసేందుకే విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నాం.

మనం అభివృద్ధిలో పోటీ పడాలి తప్ప కుల, మత రాజకీయాలు వద్దు. నేను ఒక పని చేస్తే, మీరు రెండు పనులు చేసి చూపించాలి.అప్పుడే అన్ని వర్గాల ప్రజల ఆశీర్వాదం లభిస్తుంది. నేత కార్మికుల కోసం వరంగల్‌లో 1,250 ఎకరాల్లో మెగా టెక్స్‌టైల్‌ పార్కు నిర్మిస్తున్నాం. దీని ద్వారా 20- 30 వేల మందికి ఉపాధి లభిస్తుంది. సిరిసిల్లలో వర్కర్‌ టు ఓనర్‌ పథకంలో భాగంగా మొదటి విడతగా 1,100 మందికి అవకాశం కలుగుతుంది’’ అని తెలిపారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ..స్వరాష్ట్ర సాధన కోసం తెరాస ఉద్యమ పార్టీ ఆవిర్భావం 2001 ఏప్రిల్‌ 27న జలదృశ్యంలో జరిగిందని గుర్తుచేశారు. కార్యక్రమంలో మంత్రులు గంగుల, తలసాని,  ఎర్రబెల్లి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, ముఠా గోపాల్‌, ఎమ్మెల్సీ ఎల్‌.రమణ, వరంగల్‌ మహానగర మేయర్‌ గుండు సుధారాణి, చేనేత అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ చింతా ప్రభాకర్‌లతో పాటు కొండా లక్ష్మణ్‌ బాపూజీ కుటుంబసభ్యులు పాల్గొన్నారు. సిరిసిల్లలో  తెలంగాణ పవర్‌లూం అండ్‌ టైక్స్‌టైల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ గూడూరి ప్రవీణ్‌కుమార్‌, నాఫ్‌స్కాబ్‌ ఛైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు తదితరులు పాల్గొన్నారు. మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, జగదీశ్‌రెడ్డి, సత్యవతిరాథోడ్‌లు తమ నివాసాల్లో బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని