ఆ 1,416 ఎకరాలను విడుదల చేయండి

ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో భాగంగా వాన్‌పిక్‌ కేసులో గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో జప్తుచేసిన 1,416.91 ఎకరాల పట్టా భూములను జప్తు నుంచి విడుదల చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌

Updated : 28 Sep 2022 05:09 IST

వాన్‌పిక్‌ ఆస్తుల జప్తుపై ఈడీకి తెలంగాణ హైకోర్టు ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో భాగంగా వాన్‌పిక్‌ కేసులో గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో జప్తుచేసిన 1,416.91 ఎకరాల పట్టా భూములను జప్తు నుంచి విడుదల చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)కి తెలంగాణ హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీచేసింది. ఆస్తుల జప్తు చట్టవిరుద్ధమని చెబుతూనే.. వాటి విడుదలకు కింది కోర్టును ఆశ్రయించాలని దిల్లీలోని అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌ చెప్పడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ప్రకాశం జిల్లాలో రూ.23.23 కోట్ల విలువైన 561.20 ఎకరాలు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో రూ.27.72 కోట్ల విలువైన 855.71 ఎకరాలను విడుదల చేయాలని ఈడీని ఆదేశించింది. ఆస్తుల జప్తుపై అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌ ఇచ్చిన ఉత్తర్వులను సవాలుచేస్తూ 561 ఎకరాలపై వాన్‌పిక్‌ పోర్ట్సు లిమిటెడ్‌, 855 ఎకరాల జప్తుపై వాన్‌పిక్‌ ప్రాజెక్ట్స్‌, 11వేల ఎకరాలపై రెండు కంపెనీలు కలిపి వేర్వేరుగా దాఖలుచేసిన మూడు పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ ఎస్‌.నందలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి సుదీర్ఘ వాదనల అనంతరం జులై 7న వాయిదా వేసింది. ఈ మూడు పిటిషన్లలో రెండింటిని అనుమతిస్తూ తీర్పు చెప్పింది. 2017 జులైలో 11,804.78 ఎకరాల ఎసైన్డ్‌ భూముల జప్తుపై వాన్‌పిక్‌ ప్రాజెక్ట్స్‌, వాన్‌పిక్‌ పోర్ట్సు లిమిటెడ్‌ దాఖలుచేసిన పిటిషన్‌పై మరింత విచారణ చేపట్టాలని పేర్కొంటూ తదుపరి విచారణను నవంబరు 14కు వాయిదా వేసింది. జగన్‌ అక్రమాస్తుల వ్యవహారానికి సంబంధించి సీబీఐ కేసు ఆధారంగా ఈడీ 2014లో 1,416 ఎకరాలను, 2017లో 11,804 ఎకరాలను తాత్కాలిక జప్తు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. తాత్కాలిక జప్తును ధ్రువీకరిస్తూ దిల్లీలోని ఎడ్జ్యుడికేటింగ్‌ అథారిటీ ఉత్తర్వులు జారీచేయడంతో వీటిని సవాలు చేస్తూ కంపెనీలు అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాయి. వీటిపై 2019లో ట్రైబ్యునల్‌ ఉత్తర్వులు జారీచేస్తూ తాత్కాలిక జప్తు చట్టవిరుద్ధమని పేర్కొంది. ఇందులో ఎలాంటి క్విడ్‌ ప్రోకో లేదని, జప్తు వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, విచారణ పూర్తి చేయడానికి ఏళ్లు పడుతుందని, అంతవరకు ఆస్తుల జప్తు సరికాదంది. అయితే ఆస్తుల విడుదలకు కింది కోర్టుకు వెళ్లాలని, ఇందులో రాష్ట్రప్రభుత్వం తన అభిప్రాయాన్ని చెప్పవచ్చంటూ చెప్పడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఆస్తుల జప్తునకు సంబంధించి మనీలాండరింగ్‌ నిరోధక చట్టంలోని నిబంధనలతోపాటు సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో వెలువరించిన తీర్పులను ప్రస్తావిస్తూ వాన్‌పిక్‌ పిటిషన్లను అనుమతిస్తూ తీర్పు వెలువరించింది. ఈ ఆస్తులను విడుదల చేయాలంటూ ఈడీని ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని