చేపా..చేపా.. చూడీ అవినీతి మాయ..!

ప్రభుత్వం నీటివనరుల్లో ఉచితంగా వదులుతున్న చేపపిల్లల పరంగా అక్రమాలకు పాల్పడుతూ గుత్తేదారులు మాయ చేస్తున్నారు. నిర్ణయించిన సైజులకు భిన్నంగా నాణ్యత లేనివాటిని విడిచిపెడుతున్నారు. తాజాగా ఆరు జిల్లాల్లో ఏడు

Published : 28 Sep 2022 04:02 IST

నాణ్యత లేనివి వదులుతున్న గుత్తేదారులు

6 జిల్లాల్లో 7 కంపెనీలపై మత్స్యశాఖ చర్యలు

36.31 లక్షల చేపపిల్లల తిరస్కరణ

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వం నీటివనరుల్లో ఉచితంగా వదులుతున్న చేపపిల్లల పరంగా అక్రమాలకు పాల్పడుతూ గుత్తేదారులు మాయ చేస్తున్నారు. నిర్ణయించిన సైజులకు భిన్నంగా నాణ్యత లేనివాటిని విడిచిపెడుతున్నారు. తాజాగా ఆరు జిల్లాల్లో ఏడు గుత్తేదారు సంస్థల అక్రమాలను మత్స్యశాఖ గుర్తించింది. 36.31 లక్షల చేపపిల్లలను పట్టుకుని తిరస్కరించింది. అరకొర తనిఖీల్లోనే ఇలాంటివి లక్షల కొద్దీ దొరికాయంటే మొత్తం జల్లెడ పడితే అక్రమాలు ఏ స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ఈ వానాకాలంలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 26,778 నీటివనరుల్లో 68కోట్ల చేపపిల్లలను వదలాలని ప్రభుత్వం నిర్దేశించింది. గత 25 రోజుల్లో ఇప్పటివరకూ 5143 నీటివనరుల్లో 10.35 కోట్ల చేపపిల్లలను గుత్తేదారులు వదిలారు. ఆ సమయంలో మత్స్యకార సంఘాల సమక్షంలో అధికారులు వాటి పరిమాణాన్ని, ఎన్ని వదులుతున్నారనే లెక్కలను సరిచూడాలి. అంతా బాగుందనే కిందిస్థాయి అధికారులు చెబుతున్నారు. కానీ, మత్స్యశాఖ కమిషనర్‌ లచ్చిరాం భుక్యా మేడ్చల్‌ జిల్లాలో నిల్వచేసిన చేపపిల్లలను తనిఖీ చేయగా అవి నిర్ణీత పరిమాణంలో లేవని తేలింది. వెంటనే వాటిని తిరస్కరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా కైకలూరు మండలం పల్లెవాడకు చెందిన మట్టి బద్రీనారాయణ అనే గుత్తేదారుకు చెందిన 6.13లక్షల చేపపిల్లలు, అదే గ్రామానికి చెందిన దుత్తా నాగేంద్రకుమార్‌ అనే గుత్తేదారు మేడ్చల్‌ జిల్లా పరిధి చెరువుల్లో వదలడానికి సిద్ధంగా ఉంచిన లక్షా 80వేల చేపపిల్లలు నిర్ణీత సైజులో లేవని తేలింది. ఇలాగే నారాయణపేట జిల్లాలో హనుమాన్‌ ఫిష్‌సీడ్‌ ఫాంకు చెందిన 8లక్షల పిల్లలు, నల్గొండ జిల్లాకు రాజా ఫిషరీస్‌ సంస్థ తెచ్చిన 3 లక్షలు, సిద్దిపేట జిల్లాకు చెందిన దుర్గా ఫిష్‌సీడ్‌ ఫాం తెచ్చిన 10.20 లక్షలు, జగిత్యాల జిల్లాకు చెందిన జలపుష్ప ఫిష్‌సీడ్‌ హేచింగ్‌ కంపెనీ తెచ్చిన 3.68 లక్షలు, నిర్మల్‌కు రుద్రరాజు రాజేశ్వరి తెచ్చిన 3.50 లక్షల చేపపిల్లలు నాణ్యతగా లేవని గుర్తించి తిరస్కరించారు.

కుమ్మక్కవుతున్నారా..!

చేపపిల్లలు నిర్ణీత సైజులో ఆరోగ్యంగా పెరిగిన వాటినే జలవనరుల్లో వదలాలని ప్రభుత్వం నిబంధనలు పెట్టింది. కానీ కొన్ని జిల్లాల్లో వీటిని తోసిరాజని కిందిస్థాయి సిబ్బంది గుత్తేదారు కంపెనీలతో కుమ్మక్కవుతున్నారనే ఆరోపణలున్నాయి. ఎక్కడైనా ఉన్నతాధికారులు కఠినంగా తనిఖీ చేసినప్పుడే లొసుగులు బయటపడుతున్నాయి. లేకపోతే అంతా సజావుగా సాగుతోందని, కోట్ల కొద్దీ చేపపిల్లలు వదులుతున్నామని సిబ్బంది నివేదికలిస్తున్నారు. ఈ క్రమంలో గుత్తేదారులు అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని లచ్చిరాం భుక్యా హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు