3 జిల్లాల్లో సేవలు, సర్జరీల్లో వెనుకబాటు

కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో మినహా అన్ని జిల్లాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అధికంగా ఆరోగ్యశ్రీ సేవలు అందుతున్నాయని, ఈ జిల్లాల్లో ఎందుకు సేవలు, సర్జరీలు తగ్గాయనే అంశంపై సమీక్ష నిర్వహించాలని అధికారులకు

Published : 28 Sep 2022 04:02 IST

 దిద్దుబాటు చర్యలు చేపట్టండి

‘ఆరోగ్యశ్రీ’పై సమీక్షలో మంత్రి హరీశ్‌రావు ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో మినహా అన్ని జిల్లాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అధికంగా ఆరోగ్యశ్రీ సేవలు అందుతున్నాయని, ఈ జిల్లాల్లో ఎందుకు సేవలు, సర్జరీలు తగ్గాయనే అంశంపై సమీక్ష నిర్వహించాలని అధికారులకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ఈ మూడు జిల్లాల్లో వెనకబడటానికి కారణాలు అన్వేషించి, సత్వరమే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలపై మంగళవారం మంత్రి దృశ్యమాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ కింద సర్జరీలు పొందిన రోగుల పరిస్థితిని ఆరోగ్య మిత్రలతో పాటు ఆరోగ్యశ్రీ సిబ్బంది ఎప్పటికప్పుడు తెలుసుకొని సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. మూడేళ్లలోనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు 34 శాతం నుంచి 53 శాతానికి పెరిగాయని, ఇది ఆహ్వానించతగిన పరిణామమన్నారు. రాష్ట్రంలో కొత్తగా వైద్య కళాశాలలను ఏర్పాటు చేయడం, ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్‌, క్యాథ్‌ ల్యాబ్‌ వంటి ఆధునిక సదుపాయాలు కల్పించడం వల్ల ఈ పురోగతి సాధ్యమైందని తెలిపారు.

ఎంఎల్‌హెచ్‌పీ పోస్టులకు వీరికీ అవకాశమివ్వండి

ఆయుష్మాన్‌ భారత్‌- హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్లలో సేవలందించే ‘మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌(ఎంఎల్‌హెచ్‌పీ)’ పోస్టులకు యునాని, నేచురోపతి, హోమియోపతి అభ్యర్థులకు కూడా అర్హత అవకాశం కల్పించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయకు లేఖ రాశారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం బీఎస్సీ కమ్యూనిటీ హెల్త్‌ లేదా బీఎస్సీ నర్సింగ్‌, జీఎన్‌ఎంతోపాటు ఇగ్నో/మెడికల్‌ వర్సిటీ నుంచి ప్రత్యేక కోర్సు చేసిన ఆయుర్వేద వైద్యులు మాత్రమే ఎంఎల్‌హెచ్‌పీ పోస్టులకు అర్హులు. ఈ నిర్ణయం మిగతా అభ్యర్థులకు నష్టం కలిగిస్తుందని హరీశ్‌రావు లేఖలో పేర్కొన్నారు. నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ఇండియన్‌ సిస్టమ్స్‌ ఆఫ్‌ మెడిసిన్‌, నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ హోమియోపతి ప్రకారం బీఏఎంఎస్‌, బీయూఎంఎస్‌, బీఎన్‌వైఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌ కోర్సులు కూడా వైద్య డిగ్రీ కోర్సులేనని, వాటి కాలవ్యవధి, అర్హత కూడా సమానమేనని స్పష్టంగా ఉందని మంత్రి గుర్తు చేశారు. కేంద్రం ఆయుర్వేద అభ్యర్థులకు మాత్రమే అవకాశం కల్పించి, సమాన అర్హత ఉన్న ఇతర కోర్సుల వారిని విస్మరించడం సరికాదన్నారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts