టీఆర్‌టీ.. ఆ ఊసేది?

నెలలు గడుస్తున్నా సుమారు మూడు లక్షల మంది నిరుద్యోగుల ఎదురుచూపులు తప్ప టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్టు (టీఆర్‌టీ) నోటిఫికేషన్‌ మాత్రం వెలువడటంలేదు. పాఠశాల

Published : 29 Sep 2022 04:34 IST

టెట్‌ ఫలితాలు వెల్లడై మూడు నెలలు..

ఉపాధ్యాయ ఖాళీలెన్నో తేల్చని సర్కారు

నోటిఫికేషన్‌ కోసం మూడు లక్షల మంది నిరుద్యోగుల ఎదురుచూపులు

ఈనాడు, హైదరాబాద్‌: నెలలు గడుస్తున్నా సుమారు మూడు లక్షల మంది నిరుద్యోగుల ఎదురుచూపులు తప్ప టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్టు (టీఆర్‌టీ) నోటిఫికేషన్‌ మాత్రం వెలువడటంలేదు. పాఠశాల విద్యాశాఖలో బోధన, బోధనేతర కలిపి 13,086 ఉద్యోగాలను భర్తీ చేస్తామని శాసనసభలో సీఎం కేసీఆర్‌ ప్రకటించి ఏడు నెలలు గడిచాయి. టెట్‌ పూర్తికాగానే టీఆర్‌టీ నోటిఫికేషన్‌ ఇస్తామని ప్రభుత్వం చెబుతూ వచ్చింది. జూన్‌ 12న టెట్‌ నిర్వహించి ఫలితాలను జులై 1న వెల్లడించారు. మూడు నెలలు గడిచినా తదుపరి ప్రక్రియ మొదలుకాలేదు. ఖాళీల సంఖ్య తేలితే.. వాటి భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం తెలపాలి. ఈ ప్రక్రియ ప్రారంభమే కాలేదు. మోడల్‌ పాఠశాలలు, రెసిడెన్షియల్‌ విద్యాసంస్థల్లోని ఖాళీలతో కలుపుకొని సుమారు 11 వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. వీటిలో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జీటీ) పోస్టులు 6,400, స్కూల్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ఏ) ఖాళీలు 3,600 వరకు ఉంటాయని అంచనా. వీటిని టీఆర్‌టీ ద్వారానే భర్తీ చేయాలి. ఉపాధ్యాయులకు పదోన్నతులిస్తే మరో 10 వేల ఖాళీలు ఏర్పడతాయని అంచనా. కానీ, పదోన్నతుల ప్రక్రియ ఇప్పట్లో పూర్తి చేసే పరిస్థితి కనిపించడం లేదు.

వచ్చే విద్యా సంవత్సరానికైనా పూర్తయ్యేనా?
ఇప్పటికిప్పుడు టీఆర్‌టీ నోటిఫికేషన్‌ జారీ చేసినా పరీక్ష నిర్వహణ నుంచి.. పోస్టింగ్‌ ఇచ్చేవరకు కనీసం 6-9 నెలల సమయం పడుతుంది. ప్రస్తుత విద్యా సంవత్సరం ఏప్రిల్‌ 23తో ముగుస్తుంది. ఇక మిగిలింది దాదాపు ఏడు నెలలు. వేసవి సెలవులు 50 రోజులనుకున్నా వచ్చే విద్యా సంవత్సరం (2023-24) జూన్‌లో పాఠశాలల పునః ప్రారంభం నాటికైనా ఉపాధ్యాయ ఖాళీల భర్తీ పూర్తవుతుందా అనేది అనుమానమే.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని