బతుకుల నిండా బాధలే..!

ఒకప్పుడు ప్రశాంతంగా జీవించిన ఆ గ్రామాల ప్రజలను నేడు పుట్టెడు సమస్యలు వేధిస్తున్నాయి. ఈమేరకు బొగ్గు గనులతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితమైన ప్రాంతాల్లో ప్రజలు దుర్భర పరిస్థితులు

Published : 29 Sep 2022 04:34 IST

నిధులు దక్కక.. అభివృద్ధి కానరాక..

బొగ్గు గనుల ప్రభావిత ప్రాంత ప్రజల దుస్థితి

ఈనాడు డిజిటల్‌, ఆసిఫాబాద్‌ / ఈటీవీ ఖమ్మం

ఒకప్పుడు ప్రశాంతంగా జీవించిన ఆ గ్రామాల ప్రజలను నేడు పుట్టెడు సమస్యలు వేధిస్తున్నాయి. ఈమేరకు బొగ్గు గనులతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితమైన ప్రాంతాల్లో ప్రజలు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అభివృద్ధి పనులకు గాను ఏటా సింగరేణి.. ఆయా జిల్లాలకు డీఎంఎఫ్‌టీ, సీఎస్‌ఆర్‌ నిధులు రూ.కోట్లలో విడుదల చేస్తున్నప్పటికీ వాటిని ప్రభావిత గ్రామాల్లో కాకుండా ఇతరచోట్ల ఖర్చు చేస్తూ అధికారులు, నేతలు నిబంధనలకు నీళ్లొదులుతున్నారు. రాష్ట్రంలోని కుమురం భీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భూగర్భ (29), ఉపరితల (19) గనులు ఉన్నాయి. వీటి ఏర్పాటు నేపథ్యంలో 52 గ్రామాల ప్రజలు నిర్వాసితులయ్యారు. మరెన్నో పల్లెలు గనుల పక్కనే ఉండగా.. వీరి భూములు తీసుకోలేదనే కారణంతో సింగరేణి పునరావాసం కల్పించలేదు. పునరావాస కాలనీల్లో సైతం మౌలిక సదుపాయాలు లేకపోగా, గనుల ప్రభావిత ప్రాంతాల్లో పేలుళ్లు, బొగ్గు రవాణా, కోల్‌డంప్‌ వ్యర్థాలతో ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. నిబంధనల మేరకు డీఎంఎఫ్‌టీ, సీఎస్‌ఆర్‌ నిధులను ప్రత్యక్ష, పరోక్ష ప్రభావిత ప్రాంతాల్లో 75%, 25% వంతున ఖర్చు చేయాలి. మౌలిక సదుపాయాలు; విద్య, వైద్య సౌకర్యాలకు.. మహిళలు, చిన్నారులు, వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమానికి.. యువతకు నైపుణ్యాల శిక్షణ, పారిశుద్ధ్య పనుల కోసం 60% నిధులు వెచ్చించాలి. భవనాల నిర్మాణం, నీటి పారుదల, పర్యావరణ పనుల కోసం 40% ఖర్చు చేయాలి. ఈ నిధులతో ప్రభావిత ప్రాంతాల్లో కాకుండా ఇతరచోట్ల సీసీ రోడ్లు, మురుగు కాలువలు, కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి మొగ్గు చూపుతున్నారన్న విమర్శలున్నాయి. డీఎంఎఫ్‌టీ కమిటీల్లో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఛైర్మన్‌గా, కలెక్టర్‌ కార్యదర్శిగా, డీఆర్‌డీఏ పీడీ ట్రెజరర్‌గా, సీపీఓ సభ్య కార్యదర్శిగా ఉంటారు.

సమస్యలెన్నో..
* కుమురం భీం జిల్లా తోయగూడ, చందుగూడ, మందగూడ, కొలాంగూడ, గోవర్‌గూడ, గోండ్‌గూడ తదితర గ్రామాలకు వెళ్లాలంటే కనీస రహదారి సౌకర్యం లేదు. ఈ మార్గంలో రెండు వాగులుంటాయి. అందులోకి కోల్‌డంప్‌ వ్యర్థాలు కొట్టుకువచ్చి విపరీతంగా బురద పేరుకుపోతోంది. చందుగూడకు చెందిన ఓ బాలిక (17) గతేడాది జ్వరం బారినపడింది. ఈ గ్రామం నుంచి బయటకు వెళ్లే రోడ్డంతా బురదమయం కావడంతో పాటు మధ్యలో ఉన్న వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో సకాలంలో చికిత్స అందక ఆమె చనిపోయింది. మంచి రోడ్డు, వాగుపై వంతెన ఉంటే ఆమె ప్రాణాలు దక్కేవి.

* మంచిర్యాల జిల్లా అబ్బాపుర్‌, దుబ్బగూడెం, రామకృష్ణాపుర్‌.. ఖమ్మం జిల్లా కిష్టారం, ఎన్టీఆర్‌ నగర్‌, వెంగళ్‌నగర్‌లకు ఆనుకుని ఉపరితల గనుల్లో తవ్వకాలు జరుపుతున్నారు. బాంబు పేలుళ్లతో, ఎగిసిపడే రాళ్లతో గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు.

* పెద్దపల్లి జిల్లా మేడిపల్లి ఓసీపీ-4 ఉపరితల గని సమీపంలోని లింగాపుర్‌, మేడిపల్లి, ఎస్సీ కాలనీ ప్రజలు కోల్‌డంప్‌ వ్యర్థాలతో, పేలుళ్లతో నానా పాట్లు పడుతున్నారు.


కమిటీ నిర్ణయం మేరకే పనులు..

డీఎంఎఫ్‌టీ నిధులతో చేపట్టే పనుల గురించి కమిటీ సమావేశంలో నిర్ణయించి చర్యలు తీసుకుంటాం. ఇన్‌ఛార్జి మంత్రి, కలెక్టర్‌తో పాటు జిల్లాలో ఉన్న అన్ని శాఖల అధికారులను సంప్రదించి పనులు చేపడతాం. కమిటీలో ప్రతిపాదించిన వాటిలో సైతం ఎంపిక చేసినవి మాత్రమే చేస్తున్నాం. రెండేళ్ల నుంచి కమిటీ సమావేశం జరగడం లేదు.

- రవీందర్‌, ముఖ్య ప్రణాళిక అధికారి (సీపీఓ) కుమురం భీం జిల్లా


Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts