లంచాలు అడిగితే ఉపేక్షించం

ప్రైవేటు ఆసుపత్రుల్లో తనిఖీల సందర్భంగా కొన్ని జిల్లాల్లో కొందరు వైద్యాధికారులు, సిబ్బంది లంచాలు అడుగుతున్నట్లు తమకు ఫిర్యాదులు వచ్చాయని, ఇలాంటి వాటిని ఎట్టి

Published : 29 Sep 2022 04:34 IST

డీఎంహెచ్‌ఓలకు ప్రజారోగ్య సంచాలకుని హెచ్చరిక

ప్రైవేటు ఆసుపత్రుల్లో లోపాలపై ప్రజలు ఫిర్యాదు చేయాలని సూచన

‘ఈనాడు’ కథనానికి స్పందన

ఈనాడు- హైదరాబాద్‌: ప్రైవేటు ఆసుపత్రుల్లో తనిఖీల సందర్భంగా కొన్ని జిల్లాల్లో కొందరు వైద్యాధికారులు, సిబ్బంది లంచాలు అడుగుతున్నట్లు తమకు ఫిర్యాదులు వచ్చాయని, ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు హెచ్చరించారు. ‘లంచాల జబ్బు’ శీర్షికన ‘ఈనాడు’లో బుధవారం ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. అన్ని జిల్లాల వైద్య ఆరోగ్య అధికారుల (డీఎంహెచ్‌ఓ)తో దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ‘ఈనాడు’లో కథనాన్ని ప్రస్తావించారు. తనిఖీలు, అనుమతుల మంజూరు, బదిలీలు.. ఇలా ఏ సందర్భంలోనైనా, ఏ రూపంలోనైనా లంచాలు స్వీకరిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టంచేశారు. సమీక్ష అనంతరం డీహెచ్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆసుపత్రులకు అనుమతులు ఇచ్చేందుకు ఏ అధికారి అయినా లంచం అడిగితే.. తమ దృష్టికి తీసుకురావాలని ప్రైవేటు ఆసుపత్రులకు సూచించారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సలో నిర్లక్ష్యం కనిపిస్తే.. ప్రజలు సైతం ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని కోరారు.

103 ఆసుపత్రుల మూసివేత
‘‘గ్రామీణ ప్రాంతాల్లో ఆర్‌ఎంపీలు, పీఎంపీలు.. అర్హత లేకున్నా చికిత్సలు అందించడం, శస్త్రచికిత్సలు, అబార్షన్లు చేయడం వంటివి మా దృష్టికి వచ్చాయి. వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చాం. కొందరు ఆర్‌ఎంపీలు.. ఎంబీబీఎస్‌ అని బోర్డులపై రాసుకుంటున్నారు.  గత వారం రోజుల్లో 2,058 ఆసుపత్రులను తనిఖీ చేశాం. ఇందులో అనుమతి లేనివి, అర్హత లేని వైద్యులతో చికిత్సలు అందిస్తున్న 103 ఆసుపత్రులను మూసివేశాం. మరో 633 ఆసుపత్రులకు తాఖీదులు ఇచ్చాం. 75 దవాఖానాలకు జరిమానా విధించాం. రాష్ట్రవ్యాప్తంగా అర్హత కలిగిన వైద్యులతో నిర్వహిస్తున్న ఆసుపత్రుల్లో లోపాలుంటే చక్కదిద్దుకోవడానికి రెండు వారాల సమయం ఇస్తున్నాం. ఆలోగా లోపాలను సవరించుకోకపోతే వాటిపైనా చర్యలు తీసుకుంటాం. తనిఖీల సమయంలో ఒత్తిళ్లు వచ్చినా డీఎంహెచ్‌ఓలు లొంగొద్దు. చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి’’ అని డీహెచ్‌ ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లోని ప్రైవేటు ఆసుపత్రుల్లో తనిఖీలు కొనసాగుతుండగా.. మెదక్‌, నల్గొండ జిల్లాల్లో ఇంకా ప్రారంభంకాలేదు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని