అనుభవజ్ఞుల ప్రసంగాలను పుస్తకంగా ముద్రించాలి

శాసనసభలో అనుభవజ్ఞులైన సభ్యులు చేసిన ప్రసంగాలను పుస్తకంగా ముద్రించాలని.. అవి కొత్తగా ఎన్నికయ్యే ఎమ్మెల్యేలకు ఉపయోగకరంగా ఉంటాయని, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని

Published : 29 Sep 2022 04:34 IST

‘అసెంబ్లీ సాక్షిగా పోరాటం’ పుస్తకావిష్కరణ సభలో వక్తలు

ఈనాడు, హైదరాబాద్‌: శాసనసభలో అనుభవజ్ఞులైన సభ్యులు చేసిన ప్రసంగాలను పుస్తకంగా ముద్రించాలని.. అవి కొత్తగా ఎన్నికయ్యే ఎమ్మెల్యేలకు ఉపయోగకరంగా ఉంటాయని, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తాయని వక్తలు పేర్కొన్నారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి 2004 నుంచి 2009 వరకు ఎమ్మెల్యేగా కొనసాగిన కాలంలో చేసిన ప్రసంగాలతో ముద్రించిన ‘అసెంబ్లీ సాక్షిగా నా పోరాటం’ పుస్తకాన్ని బుధవారం శాసనసభ కమిటీ హాలులో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ వామపక్షాల నేతలు ప్రజాస్వామ్య వ్యవస్థలో విలువలతో కూడిన అంశాలు మాట్లాడతారని, వారి నుంచి ఎంతో తెలుసుకోవచ్చని అన్నారు. శాసనసమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే నర్రా రాఘవరెడ్డి ప్రసంగాలనూ సంకలనంగా తీసుకురావాలని కోరారు. మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ జీవో 610 గురించి తాను, చాడ ముందే సన్నద్ధమై మాట్లాడేవారమని, అన్ని శాఖల్లో జీవో అమలు చేసి ఉద్యోగాలు వచ్చేలా చేశామన్నారు. ముదిగొండ ఘటనలో ఏడుగురు చనిపోతే.. అన్ని పక్షాలు కలిసి పోరాటం చేసి కోనేరు రంగారావు కమిటీని వేయించగలిగామని గుర్తుచేశారు. చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ భావితరాలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ పుస్తకం ముద్రించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఏపీ కార్యదర్శి రామకృష్ణ, రాజ్యసభ సభ్యుడు కె.ఆర్‌.సురేశ్‌రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రజాపక్షం సంపాదకుడు శ్రీనివాస్‌రెడ్డి తదితరులు మాట్లాడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని