హైదరాబాద్‌లో చాపకింద నీరులా స్వైన్‌ఫ్లూ

రాజధానిలో మూడేళ్ల తర్వాత స్వైన్‌ఫ్లూ (హెచ్‌1ఎన్‌1) చాప కింద నీరులా వ్యాప్తిచెందుతోంది. ఇప్పటికే సీజనల్‌ జ్వరాలు, డెంగీతో పిల్లలు, పెద్దలు అల్లాడుతుండగా.. స్వైన్‌ఫ్లూ సైతం

Published : 29 Sep 2022 04:34 IST

జూన్‌ నుంచి రాష్ట్రంలో 245 కేసులు

ఇందులో 240 రాజధానిలోనే..

మాస్కుధారణ తప్పనిసరి అంటున్న నిపుణులు

ఈనాడు, హైదరాబాద్‌: రాజధానిలో మూడేళ్ల తర్వాత స్వైన్‌ఫ్లూ (హెచ్‌1ఎన్‌1) చాప కింద నీరులా వ్యాప్తిచెందుతోంది. ఇప్పటికే సీజనల్‌ జ్వరాలు, డెంగీతో పిల్లలు, పెద్దలు అల్లాడుతుండగా.. స్వైన్‌ఫ్లూ సైతం బెంబేలెత్తిస్తోంది. ఈ ఏడాదిలో ఈ నెల 26 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 245 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదు కాగా.. ఇందులో 240 హైదరాబాద్‌, పరిసర ప్రాంతాల్లోనే కావడం గమనార్హం. సాధారణంగా నవంబరు నుంచి ఫిబ్రవరి వరకూ స్వైన్‌ఫ్లూ కారక వైరస్‌ ప్రబలుతున్న దాఖలాలు గతంలో ఉన్నాయి. ప్రస్తుతం నమోదవుతున్న కేసులను పరిగణనలోకి తీసుకొని.. వచ్చే 3-4 నెలల్లో స్వైన్‌ఫ్లూ ప్రభావం మరింత అధికంగా ఉండే అవకాశాలున్నాయని నిపుణులు అంచనావేస్తున్నారు. చలి వాతావరణంలో వైరస్‌ ఎక్కువ కాలం జీవించే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో కొవిడ్‌ నిరోధానికి పాటిస్తున్న జాగ్రత్తలనే స్వైన్‌ఫ్లూకు కూడా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

కేసులు ఇలా..
జనవరి నుంచి మే వరకూ రాష్ట్రంలో ఒక్క హెచ్‌1ఎన్‌1 కేసు కూడా నమోదు కాలేదు. హైదరాబాద్‌లో జులైలో 32, ఆగస్టులో 150, సెప్టెంబరులో 58 కేసులు నిర్ధారణ అయ్యాయి. వర్షాలు, వాతావరణంలో మార్పులు వైరస్‌ విజృంభణకు కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. రోజుకు సుమారు 40 వరకు నమూనాలను పరీక్షిస్తుండగా సగటున 9 శాతం కేసులు నమోదవుతున్నాయి. స్వీయ జాగ్రత్తలే చాలా వరకూ స్వైన్‌ఫ్లూ కారక హెచ్‌1ఎన్‌1 వైరస్‌ను వ్యాప్తి చెందకుండా అడ్డుకుంటాయని, దీనిపై ప్రజల్లో అవగాహన పెరిగేలా ప్రభుత్వం అత్యవసరంగా చర్యలు చేపట్టాల్సిన అవసరముందని నిపుణులు సూచిస్తున్నారు.రాష్ట్రంలో ప్రస్తుతం డెంగీ, సాధారణ జ్వరాలు తీవ్రంగా ఉన్నాయి.నిలోఫర్‌ సహా ప్రభుత్వ, ప్రైవేటు పిల్లల ఆసుపత్రులన్నీ నిండిపోయాయి. ఇదే సమయంలో రోజుకు 3-4 చొప్పున స్వైన్‌ఫ్లూ కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది.  

స్వైన్‌ఫ్లూ లక్షణాలు
దగ్గు, జలుబు, గొంతునొప్పి జ్వరం  ఒళ్లు నొప్పులు బాగా నీరసం, నిస్సత్తువ తలనొప్పి

ఎవరిలో ప్రమాదం?
మధుమేహులు, గర్భిణులు

అయిదేళ్ల లోపు పిల్లలు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులు
సీఓపీడీ, క్యాన్సర్‌, ఆస్తమా రోగులు

కిడ్నీ, గుండె మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నవారు
దీర్ఘకాలంగా స్టిరాయిడ్లు తీసుకుంటున్నవారు

వ్యాధి నిరోధానికి..
బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించడం తప్పనిసరి.

దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ముఖానికి అడ్డుగా వస్త్రం పెట్టుకోవాలి. కనీసం చేతులనైనా అడ్డుగా ఉంచుకోవాలి. ఆ వెంటనే చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ఇది కచ్చితంగా పాటించాల్సిన నియమం.

 జలుబు, దగ్గుతో బాధపడుతున్నవారితో కరచాలనలు, ఆలింగనాలు వద్దు.
జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి.

ఈ లక్షణాలున్న వారు జనసమూహంలోకి వెళ్లకుండా.. ఇంటిపట్టునే ఉండాలి.
వీరు వాడిన రుమాలు, టవల్‌ వంటివి ఇతరులు ఉపయోగించరాదు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని