బీబీ పాటిల్‌ ఎన్నికపై దాఖలైన పిటిషన్‌ను పునఃపరిశీలించండి

జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌ ఎన్నికను సవాల్‌ చేస్తూ కాంగ్రెస్‌ నేత కె.మదన్‌మోహన్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌ను పునఃపరిశీలించాలని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సర్వోన్నత

Published : 29 Sep 2022 04:34 IST

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సుప్రీంకోర్టు సూచన

ఈనాడు, దిల్లీ: జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌ ఎన్నికను సవాల్‌ చేస్తూ కాంగ్రెస్‌ నేత కె.మదన్‌మోహన్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌ను పునఃపరిశీలించాలని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. కేసులోని అంశాల దృష్ట్యా .. ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని పేర్కొంది. 2019 ఎన్నికల్లో తెరాస అభ్యర్థిగా బరిలో నిలిచిన బీబీ పాటిల్‌.. కె.మదన్‌మోహన్‌రావుపై గెలుపొందారు. తనపై నమోదైన క్రిమినల్‌ కేసుల వివరాలను బీబీ పాటిల్‌ ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొనలేదని, ఆయన ఎన్నికను రద్దు చేయాలంటూ మదన్‌మోహన్‌రావు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఈ ఏడాది జూన్‌ 15న మౌఖికంగా తీర్పు ఇచ్చింది. ఆ తీర్పునకు సంబంధించిన ఉత్తర్వును బహిర్గతం చేయకపోవడంతో మదన్‌మోహన్‌రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ దినేశ్‌మహేశ్వరి, బేలా ఎం త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టి.. తీర్పు వెలువరించింది. ‘‘హైకోర్టు జూన్‌ 15న మౌఖిక తీర్పు ఇచ్చింది. మూడు నెలలు గడిచినా తీర్పు ప్రతిని బహిర్గతం చేయకపోవడం, తీర్పు ప్రతులను ఇవ్వకపోవడం సరికాదు. తీర్పు ఉత్తర్వులు లేకుండా మేం వాదనలు వినడం వృథాయే. కాలపరిమితితో కూడిన సున్నితమైన ఎన్నికల పిటిషన్ల విషయంలో అప్పీలు చేసుకోవడాన్ని నిరోధించడానికి కారణం లేదు’’ అని ధర్మాసనం పేర్కొంది. పిటిషన్‌లోని పక్షాలన్నీ అక్టోబరు 10వ తేదీన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎదుట విచారణకు హాజరు కావాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts