సంక్షిప్త వార్తలు(25)

తెలంగాణ శాసనసభ, మండలి కార్యాలయాల వద్ద బుధవారం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, సురభి వాణీదేవి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డితోపాటు

Updated : 29 Sep 2022 06:28 IST

శాసనసభ ఆవరణలో బతుకమ్మ వేడుకలు

తెలంగాణ శాసనసభ, మండలి కార్యాలయాల వద్ద బుధవారం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, సురభి వాణీదేవి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డితోపాటు అధికారిణులు, ఉద్యోగినులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. బతుకమ్మలను శాసనసభ ఆవరణలో అందంగా పేర్చి ఆటపాటలతో అలరించారు. స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మంత్రి వి.ప్రశాంత్‌రెడ్డి,  కార్యదర్శి నరసింహాచార్యులు ఉత్సవాలను తిలకించారు.

- ఈనాడు, హైదరాబాద్‌


ఒకేరోజు రెండు పరీక్షలు.. ఆందోళనలో అభ్యర్థులు

ఆదిలాబాద్‌ పాలనాప్రాంగణం, న్యూస్‌టుడే: ఒకేరోజు రెండు పరీక్షలు ఉండటంతో ఏది రాయాలో తెలియని అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు కాకతీయ విశ్వవిద్యాలయ పరిధిలో ఎంబీఏ చదువుతున్న విద్యార్థులు. ఎంబీఏ నాలుగో సెమిస్టర్‌ పరీక్షలు ఈ నెల 19న ప్రారంభమయ్యాయి. ఈ నెల 30న కాంపెన్సేషన్‌ మేనేజ్‌మెంట్‌(సీఎం1), రూరల్‌ మార్కెటింగ్‌(ఆర్‌ఎం1), స్ట్రాటజిక్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్(ఎస్‌ఎఫ్‌1) పరీక్షలు జరగనున్నాయి. అదే రోజు యూనివర్సిటీ గ్రాంట్‌ కమిషన్‌ నెట్‌(నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌) పరీక్ష నిర్వహించనుండటంతో అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారు. ఈ నెల 30న జరిగే పరీక్షను కాకతీయ యూనివర్సిటీ పరీక్షల విభాగం వాయిదా వేయాలని ఎంబీఏ విద్యార్థులు కోరుతున్నారు.


గువాహటి బయోటెక్‌ పార్క్‌ సలహాదారుగా బీపీ ఆచార్య

ఈనాడు, హైదరాబాద్‌: అస్సాంలోని గువాహటిలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న బయోటెక్‌ పార్కుకు సలహాదారుగా తెలంగాణ విశ్రాంత ఐఏఎస్‌ అధికారి బీపీ ఆచార్య నియమితులయ్యారు. ఈ మేరకు అస్సాం ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది.


నేడు ‘పోలవరం’ ప్రభావిత రాష్ట్రాలతో కేంద్రం సమావేశం
ఉమ్మడి సర్వే, రక్షణ చర్యలకు తెలంగాణ పట్టు!

ఈనాడు, హైదరాబాద్‌: పోలవరం ప్రాజెక్టు వెనుక జలాల కారణంగా రాష్ట్ర పరిధిలో ఏర్పడనున్న ముంపు నష్టంపై తీసుకోవాల్సిన చర్యలపై తెలంగాణ ప్రభుత్వం కేంద్రం ముందు వాణిని వినిపించనుంది. పోలవరం ప్రాజెక్టు ప్రభావిత రాష్ట్రాలతో కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ గురువారం ఆన్‌లైన్‌ వేదికగా ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశానికి తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌, ఈఎన్‌సీ మురళీధర్‌ హాజరుకానున్నారు. ప్రాజెక్టు నిర్మాణంతో ముంపునకు గురవుతున్న ప్రాంతంపై ఉమ్మడి సర్వే నిర్వహించేందుకు ప్రభావిత రాష్ట్రాల ఈఎన్‌సీలతో కమిటీ ఏర్పాటు చేయడంతోపాటు ముంపు ప్రాంతాల రక్షణకు చేపట్టాల్సిన నిర్మాణాలు, స్థానిక పరీవాహకంలో వాగులు పోటెత్తి ఏర్పడుతున్న నష్టం అంచనాకు చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని తెలంగాణ గట్టిగా కోరే అవకాశాలు ఉన్నాయి.


మాజీ సీఐ నాగేశ్వరరావుకు షరతులతో కూడిన బెయిల్‌

ఈనాడు, హైదరాబాద్‌- చర్లపల్లి, న్యూస్‌టుడే: తుపాకీతో బెదిరించి ఓ మహిళపై అత్యాచారం చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడంటూ నమోదైన కేసులో నిందితుడు మారేడుపల్లి మాజీ సీఐ నాగేశ్వరరావుకు హైకోర్టు బుధవారం షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది. హైదరాబాద్‌ శివారులో జరిగిన ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదుతో మారేడ్‌పల్లి సీఐగా పనిచేసిన నాగేశ్వరరావుపై వనస్థలిపురం పోలీస్‌స్టేషనులో గత జులైలో కేసు నమోదైన విషయం విదితమే. ఈ కేసులో సస్పెండ్‌ అయిన నాగేశ్వరరావును పోలీసులు అదే నెల 11న న్యాయస్థానంలో హాజరుపరచగా.. చర్లపల్లి జైలుకు తరలించారు. అప్పటి నుంచి రిమాండ్‌లో ఉన్న ఆయన బెయిల్‌ కోసం జిల్లా కోర్టులో రెండు సార్లు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. న్యాయస్థానం


తిరస్కరించడంతో హైకోర్టులో అప్పీలు చేసుకున్నారు.
ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌లో మరో 4 పోస్టులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని వివిధ ఇంజినీరింగ్‌ సర్వీసుల్లో 833 సహాయ ఇంజినీర్‌, మున్సిపల్‌ సహాయ ఇంజినీరింగ్‌, టెక్నికల్‌ అధికారులు, జూనియర్‌ టెక్నికల్‌ అధికారుల పోస్టుల భర్తీకి జారీచేసిన నోటిఫికేషన్‌(16/2022)లో మరో నాలుగు పోస్టులను టీఎస్‌పీఎస్సీ చేర్చింది. భూగర్భజలశాఖ పరిధిలో డ్రిల్లింగ్‌ సూపర్‌వైజర్‌ (మెకానికల్‌) పోస్టులకు అర్హులైన అభ్యర్థులు అక్టోబరు 21లోగా దరఖాస్తు చేసుకోవాలని కమిషన్‌ సూచించింది.


పత్తి అరకోటి... వరి అంతకు మించి..

కోటీ 36 లక్షల ఎకరాల్లో వానాకాలం పంటలు

సాగు విస్తీర్ణం పెరుగుదలలో సరికొత్త రికార్డు

వ్యవసాయశాఖ తాజా నివేదిక

ఈనాడు, హైదరాబాద్‌: ప్రస్తుత వానాకాలం(ఖరీఫ్‌) సీజన్‌లో పంటల సాగు విస్తీర్ణం రికార్డుస్థాయిలో పెరిగింది. గత జూన్‌లో మొదలైన ఈ సీజన్‌ రేపటి(ఈ నెల 30)తో ముగియనుంది. అన్ని రకాల పంటలు కలిపి సాధారణ విస్తీర్ణం 1.23 కోట్ల ఎకరాలైతే అంతకుమించి మరో 13 లక్షల ఎకరాలు పెరిగి ఏకంగా కోటీ 36 లక్షల ఎకరాలు దాటింది. ప్రధాన పంటలు పత్తి అరకోటి, వరి 64.54 లక్షల ఎకరాల్లో వేశారు. ఈ రెండూ సాధారణంకన్నా అధికంగా సాగుచేశారని వ్యవసాయశాఖ బుధవారం ప్రభుత్వానికిచ్చిన తాజా నివేదికలో తెలిపింది. గత జులై నుంచి విరివిగా కుంభవృష్టి వర్షాలు పడటంతో భూగర్భ జల మట్టాలు పెరిగాయి. గత జూన్‌ నుంచి బుధవారం వరకూ మొత్తం 4 నెలల్లో సాధారణ వర్షపాతం 712 మిల్లీమీటర్లకు ఏకంగా 1076 మి.మీ.లు నమోదైంది. సాగునీరు పుష్కలంగా ఉండటం వల్ల వరి నాట్లు సాధారణంకన్నా 54 శాతం అదనంగా వేశారు. జిల్లాల వారీగా చూస్తే మెదక్‌లో అత్యధికంగా 139, జనగామలో 127, అత్యల్పంగా రంగారెడ్డిలో 84 శాతం విస్తీర్ణంలో పంటలు సాగుచేశారు.


ముగిసిన మంచిరెడ్డి విచారణ

ఈనాడు, హైదరాబాద్‌: తెరాస ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఈడీ విచారణ ముగిసింది. ఈడీ అధికారులు అనేక అంశాల్లో విచారించినట్లు తెలిసింది. ఆస్ట్రేలియా, సింగపూర్‌ల పర్యటన సందర్భంగా ఆయన అనధికారికంగా కొంత విదేశీ మారకద్రవ్యం వినియోగించినట్లు అధికారులు గుర్తించారు. దీని గురించి విచారించేందుకే నోటీసులు ఇచ్చి మంగళ, బుధవారాల్లో ఆయనను పిలిపించారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈడీ కార్యాలయానికి చేరుకున్న ఆయన దాదాపు ఎనిమిది గంటలపాటు అక్కడే ఉన్నారు. రాత్రి 8 గంటలకు తిరిగివెళ్లారు. విచారణ సందర్భంగా విదేశీ పర్యటనకు కారణాలు, ఎక్కడెక్కడ బస చేశారు, దీనికి అవసరమైన విదేశీ మారకద్రవ్యం ఎవరు సమకూర్చారు వంటి వివరాలతో పాటు పాస్‌పోర్టులోని అంశాలపైనా అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. విదేశీ పర్యటన పూర్తిగా తన వ్యక్తిగతమని, బంధువులు, స్నేహితుల ఆహ్వానం మేరకే వెళ్లానని, ఎక్కడా నిబంధనల ఉల్లంఘన జరగలేదని మంచిరెడ్డి సమాధానం చెప్పినట్లు సమాచారం.


మరో కొత్త మండలం ఏర్పాటుకు నోటిఫికేషన్‌

ఈనాడు, హైదరాబాద్‌: నిజామాబాద్‌ జిల్లాలో నూతనంగా పోతంగల్‌ మండలాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసింది. బోధన్‌ రెవెన్యూ డివిజన్‌లోని కోటగిరి మండలంలో 14 గ్రామాలతో కొత్త మండలం రూపుదిద్దుకోనుంది. దీనిపై ఏమైనా అభ్యంతరాలుంటే 15 రోజుల్లో జిల్లా కలెక్టర్‌కు తెలియజేయాలని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


ఆర్‌జీయూకేటీ ఇంటర్‌లో సెమిస్టర్‌ విధానం రద్దు!

ఈనాడు, హైదరాబాద్‌: బాసర రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్‌జీయూకేటీ)లో ఇంటర్‌మీడియట్‌ (పీయూసీగా పిలుస్తారు)లో అమలవుతున్న సెమిస్టర్‌ విధానాన్ని రద్దు చేయాలని వర్సిటీ ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చింది. ఈ క్రమంలోనే విశ్వవిద్యాలయంలోని అధ్యాపకులతో పాటు జేఎన్‌టీయూహెచ్‌, ఎన్‌ఐటీ ఆచార్యులు మరో నలుగురుతో ఓ కమిటీని నియమించింది. ఇంటర్‌లో సెమిస్టర్‌ విధానం వల్ల మధ్యలో పరీక్షలు నిర్వహించడంతో సిలబస్‌ పూర్తికావడం లేదని, జవాబుపత్రాల మూల్యాంకనం కోసం అధ్యాపకులకు పెద్ద ఎత్తున్న సొమ్ము చెల్లించాల్సి వస్తోందని వర్సిటీ భావిస్తోంది. అక్టోబరు 2వ తేదీలోపు నివేదిక ఇవ్వాలని వర్సిటీ ఇన్‌ఛార్జి ఉపకులపతి ఆచార్య వెంకటరమణ ఇప్పటికే కమిటీకి సూచించారు. ఈ నివేదిక అనంతరం తుది నిర్ణయం తీసుకోనున్నారు. మరో వైపు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వద్ద గురువారం వర్సిటీపై సమీక్ష సమావేశం జరగనుంది.


పాలిటెక్నిక్‌ కాంట్రాక్టు అధ్యాపకుల రెన్యువల్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 748 మంది కాంట్రాక్టు, మరో 294 మంది పొరుగు సేవల విధానంలో ఈ విద్యా సంవత్సరం కూడా అధ్యాపకులుగా పనిచేసేందుకు అనుమతి ఇస్తూ ఆర్థికశాఖ కార్యదర్శి రోనాల్డ్‌రాస్‌ బుధవారం జీవో జారీ చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు గడిచిన తర్వాత ఉత్తర్వులివ్వడం గమనార్హం.


రిజర్వాయర్లను పరిశీలించిన గోదావరి బోర్డు ఛైర్మన్‌

సిద్దిపేట, చిన్నకోడూరు, న్యూస్‌టుడే: కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట జిల్లాలో నిర్మించిన రిజర్వాయర్లను గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌ డా.ముకేశ్‌కుమార్‌ సిన్హా బుధవారం పరిశీలించారు. రంగనాయకసాగర్‌, మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ సాగర్‌లలో నీటి నిల్వలు, నిర్వహణ విధానంపై ఆరా తీశారు. ఈఎన్‌సీ హరిరాం, ఎస్‌ఈ బస్వరాజ్‌, ఈఈ గోపాలకృష్ణ ఉన్నారు.


కల్వకుర్తి- కొల్లాపూర్‌ రహదారి నిర్మాణానికి 14 టెండర్లు

ఈనాడు, హైదరాబాద్‌: కల్వకుర్తి నుంచి కొల్లాపూర్‌ వరకు చేపట్టనున్న రహదారి నిర్మాణానికి 14 మంది గుత్తేదారులు పోటీపడుతున్నారు. మొత్తం 79.3 కిలోమీటర్లు ఉన్న ఈ రెండు వరుసల మార్గాన్ని నిర్మించేందుకు రూ.630 కోట్లు అవుతుందని అధికారులు అంచనా వేశారు. రహదారులు, భవనాల (ఆర్‌అండ్‌బీ) శాఖ పరిధిలోని జాతీయ రహదారుల విభాగం గత నెలలో టెండర్లను ఆహ్వానించగా.. మంగళవారం వాటిని తెరిచారు. ఈ పనులు పొందేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల గుత్తేదారులు టెండర్లు దాఖలు చేసినట్లు సమాచారం. కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ అధికారులు.. ఆ టెండర్లకు సంబంధించిన సాంకేతిక అర్హత, ఆర్థిక బిడ్లను అక్టోబరు రెండో వారంలోగా పరిశీలించి గుత్తేదారును ఖరారు చేయనున్నారు.


నీటి కొరత ఉన్న బేసిన్‌ నుంచి మళ్లింపు సరికాదు
కృష్ణా ట్రైబ్యునల్‌ విచారణలో తెలంగాణ సాక్షి పండిట్‌

ఈనాడు, హైదరాబాద్‌: నీటి కొరత ఉన్న పరీవాహకం(బేసిన్‌) నుంచి మళ్లింపు సరికాదని, మిగులు జలాలున్న పరీవాహకం నుంచి మాత్రమే మళ్లించడం సమంజసమని కృష్ణా ట్రైబ్యునల్‌ ఎదుట తెలంగాణ తరఫు సాక్షి, కేంద్ర జలసంఘం మాజీ సభ్యుడు చేతన్‌ పండిట్‌ చెప్పారు. బుధవారం దిల్లీలో కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్‌ విచారణ ప్రారంభమెంiది. ఈ సందర్భంగా సాక్షిని ఏపీ తరఫు న్యాయవాది వెంకటరమణి క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేశారు. కేడబ్ల్యూడీటీ-1లో పేర్కొన్న అంశాల్లో ప్రొటెక్షన్‌(రక్షణ), ప్రియారిటీ(ప్రాధాన్యం)లకు తేడా ఉందని చేతన్‌ పండిట్‌ స్పష్టతనిచ్చారు. కృష్ణా బేసిన్‌ బయట వినియోగం చట్టబద్ధం కాదని చెప్పడం లేదని, బేసిన్‌ లోపల అవసరాలు తీరకుండా బయటికి తరలించడం సరికాదన్నదే తన అభిప్రాయమని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని పలు జల విధానాలు(పాలసీలు), అంతర్జాతీయ చట్టాలు చెబుతున్నాయని తెలిపారు. విచారణకు తెలంగాణ తరఫున సీనియర్‌ న్యాయవాది వైద్యనాథన్‌, మాజీ అడ్వొకేట్‌ జనరల్‌ రామకృష్ణారావు, అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం సీఈ మోహన్‌కుమార్‌, ఎస్‌ఈ కోటేశ్వరరావు, ఈఈలు విజయకుమార్‌, విజయ్‌కుమార్‌ తదితరులు హాజరయ్యారు.  


కమతాలను పంట కాలనీలుగా విభజించాలి
రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి

ఈనాడు, దిల్లీ: దేశంలోని భూ కమతాలన్నింటినీ పంట కాలనీలుగా విభజించాలని రాష్ట్ర వ్యవసాయ మంత్రి ఎస్‌.నిరంజన్‌రెడ్డి అన్నారు. ‘క్రాప్‌ లైఫ్‌ ఇండియా’ సంస్థ 42వ వార్షిక సమావేశం సందర్భంగా వ్యవసాయ, అనుబంధ రంగాలపై దిల్లీలో బుధవారం నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు. పంట ఎగుమతులు, సేకరణ కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్నందున వివిధ రాష్ట్రాల్లో పంటల వైవిధ్యీకరణకు అది ప్రత్యేక రాయితీలు అందించాలని కోరారు. వ్యవసాయ రంగాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్య రంగంగా గుర్తించి దాని అభివృద్ధికి అనేక చర్యలు చేపడుతోందని తెలిపారు.  సదస్సులో కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాష్‌ చౌదరి, ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల వ్యవసాయ శాఖ మంత్రులు, పలువురు శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.


దిల్లీ తెలంగాణ భవన్‌లో బతుకమ్మ వేడుకలు

ఈనాడు, దిల్లీ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దిల్లీ తెలంగాణభవన్‌లో బతుకమ్మ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, దిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు మందా జగన్నాథం, కేఎం సాహ్ని, భవన్‌ రెసిడెంట్‌ కమిషన్‌ గౌరవ్‌ ఉప్పల్‌ వేడుకలను ప్రారంభించారు. దిల్లీలోని తెలుగు మహిళలు, భవన్‌ మహిళా సిబ్బంది, పలువురు ఉత్తరాది మహిళలు బతుకమ్మ ఆడారు. మహిళలు, చిన్నారులతో కలిసి మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ కొద్దిసేపు బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ   తెలంగాణ తెచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రి అయినందునే మన పండుగలకు ఈ గౌరవం దక్కుతోందన్నారు. కార్యక్రమానికి హాజరైన మహిళలకు బతుకమ్మ చీరలను అందజేశారు. అనంతరం తెలంగాణ రుచులతో విందు ఏర్పాటు చేశారు.


విద్యుత్‌ వాహనాల పరిశ్రమకు నేడు శంకుస్థాపన

ఈనాడు, హైదరాబాద్‌: ఫ్రాన్స్‌కు చెందిన స్నైడర్‌ సంస్థ తెలంగాణలో విద్యుత్‌ వాహనాల తయారీ పరిశ్రమను శంషాబాద్‌లోని జీఎంఆర్‌ విమానాశ్రయ పారిశ్రామిక పార్కులో ఏర్పాటు చేయనుంది. దీనికి గురువారం పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేయనున్నారు.  దీనిద్వారా వేయి మందికి ఉపాధి కలగనుంది.


సేంద్రియ సేద్యమే మేలు
జాతీయ సదస్సులో శితికంఠానందా

ఈనాడు, హైదరాబాద్‌: రసాయన పురుగు మందులు, ఎరువుల వినియోగం తగ్గించి సేంద్రియ వ్యవసాయం చేయడం ఎంతో మేలని, రైతులు దీన్ని అనుసరించాలని రామకృష్ణ మఠం ప్రతినిధి శితికంఠానందా స్వామి చెప్పారు. సంతోష్‌నగర్‌లోని జాతీయ మెట్ట పంటల పరిశోధనా కేంద్రంలో బుధవారం ‘‘పంచభూతాల సక్రమ వినియోగం ద్వారా వాతావరణ అనుకూల సుస్థిర మెట్ట వ్యవసాయం’’ అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. భారత వ్యవసాయ, ఆర్థిక పరిశోధనా కేంద్రం డైరెక్టర్‌ ప్రమోద్‌ చౌదరి మాట్లాడుతూ.. పూర్వీకుల నుంచి వచ్చిన ప్రాచీన విజ్ఞాన సంపద నుంచి సమస్యలకు పరిష్కారాలను పొందవచ్చని సూచించారు. సహజ వనరుల సద్వినియోగం ద్వారానే పర్యావరణ సమతుల్యత సాధ్యమని భారతీయ కిసాన్‌ సంఘ్‌ ప్రధాన కార్యదర్శి దినేష్‌ కులకర్ణి తెలిపారు.


ధూపదీప నైవేద్య పథకం పరిధిలోకి వెయ్యి ఆలయాలు!

ఈనాడు, హైదరాబాద్‌: మరో వెయ్యి ఆలయాలను ధూపదీప నైవేద్య పథకం పరిధిలోకి తీసుకురావాలని రాష్ట్ర దేవాదాయశాఖ నిర్ణయించింది. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 1,160 ఆలయాలను ఈ పథకం కిందకు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా తొలుత జీహెచ్‌ఎంసీ పరిధిలోని వెయ్యి ఆలయాలను తెస్తున్నారు. ఇందుకోసం ఆయా ఆలయాన్నింటినీ గ్రేటర్‌ పరిధి నుంచి గ్రామీణ ప్రాంతాలకు మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. 1,588 ఆలయాలకుగాను తొలి దశలో వెయ్యి గుళ్లను పథకం పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు దేవాదాయశాఖ కమిషనర్‌ వి.అనిల్‌కుమార్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.


‘దుమ్ముగూడెం-టేల్‌పాండ్‌’ అంశాలపై సమీక్ష

ఈనాడు, హైదరాబాద్‌: ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపాదించిన దుమ్ముగూడెం-సాగర్‌ టేల్‌పాండ్‌ ప్రాజెక్టు రద్దు అనంతరం అపరిష్కృతంగా ఉన్న అంశాలపై నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈపీసీ(ఇంజినీరింగ్‌, ప్రొక్యూర్‌మెంట్‌, కన్‌స్ట్రక్షన్‌) పద్ధతిలో ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు నిర్ణయించగా తెలంగాణ ఆవిర్భావం అనంతరం ప్రభుత్వం రద్దు చేసింది. సమావేశంలో పంచాయతీరాజ్‌ ఈఎన్‌సీ సంజీవ్‌రావు, నీటిపారుదలశాఖ కొత్తగూడెం సీఈ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


ప్లాస్టిక్‌పై నిషేధాన్ని అమలుచేయండి: ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ నిషేధిస్తూ జారీచేసిన ఉత్తర్వులు రాష్ట్రంలో అన్ని శాఖలు అమలు చేసేలా ఆదేశాలివ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి బుధవారం లేఖ రాశారు. జులై 1 నుంచే నిషేధం అమలు కావాల్సి ఉన్నా.. రాష్ట్రంలో ప్లాస్టిక్‌ను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారని తెలిపారు. ఈ వ్యర్థాలు చేరి డ్రైనేజీ లైన్లు, చిన్న కాలువలు మూసుకుపోతున్నాయని, చిన్నపాటి వర్షానికీ పొంగిపొర్లుతున్నాయని లేఖలో పేర్కొన్నారు.


గాంధీభవన్‌లో బతుకమ్మ సంబురాలు

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: మహిళా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో బుధవారం గాంధీభవన్‌లో బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. ఎమ్మెల్యే సీతక్క ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.


బంజారాభవన్‌లో తెరాస కార్యక్రమాలు: మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్‌

ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభించిన బంజారాభవన్‌ను తెరాస పార్టీ కార్యక్రమాలకు వినియోగిస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్‌ ఆరోపించారు. ఆయన బుధవారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జీవో ప్రకారం బంజారాలకు సంబంధించిన కార్యక్రమాలకు బంజారాభవన్‌ను వినియోగించుకోవాలన్నారు. అయితే ఈ కార్యాలయంలో మునుగోడు నుంచి బంజారా మహిళలను తీసుకువచ్చి వాళ్లకు డబ్బులు పంచుతున్నారని ఆరోపిస్తూ అభ్యంతరం వ్యక్తం చేశారు.


ఆర్టీసీ లాభనష్టాల లెక్కలకు పాలకవర్గం ఆమోదం

ఈనాడు, హైదరాబాద్‌: ఆర్టీసీ లాభనష్టాల లెక్కలు గాడినపడ్డాయి. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లాభనష్టాల లెక్కలకు సంస్థ పాలకవర్గం ఆమోదముద్ర వేసింది. రాష్ట్రం విడిపోయిన తరవాత గత ఏప్రిల్‌లో జరిగిన తొలి పాలకమండలి సమావేశంలో మునుపటి ఆరేళ్ల వార్షిక లెక్కలను ఆమోదించింది. తాజాగా 2021-22 ఆర్థిక సంవత్సర లాభనష్టాల ఆమోదంతో ఆర్థిక అంశాల వ్యవహారం కొలిక్కివచ్చినట్లయింది. గడిచిన జూన్‌లో డీజిల్‌ సెస్సు పెంపుదలతోపాటు ఆర్టీసీ బ్రాండ్‌తో మంచినీటి ప్లాంట్ల ఏర్పాటు నిర్ణయానికి పాలకవర్గం పచ్చజెండా ఊపింది. ఆర్టీసీ పాలకవర్గ సమావేశం బుధవారం బస్‌భవన్‌లో జరిగింది. దీనికి ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ అధ్యక్షత వహించారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశంలో పాల్గొన్న కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ డైరెక్టర్‌, ఆర్టీసీ పాలకవర్గ సభ్యుడు పరేశ్‌కుమార్‌ గోయల్‌ మాట్లాడుతూ ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు. సమావేశంలో పాలకవర్గ సభ్యులు వీసీ సజ్జనార్‌, ఐ.రాణీకుముదిని, కేఎస్‌ శ్రీనివాసరాజు, పి.రవీందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.


ఫార్మసిస్టుల సమస్య పరిష్కరిస్తాం మంత్రి కొప్పుల

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఒప్పంద ఫార్మసిస్టులు, ల్యాబ్‌ టెక్నీషియన్ల సర్వీసు క్రమబద్ధీకరణకు కృషిచేస్తామని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. ఒప్పంద ఉద్యోగుల సమస్యను ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. బుధవారం ఉద్యోగుల సంఘం ప్రతినిధులు జి.పురేందర్‌, సుశీల, కిరణ్‌కుమార్‌, శేఖర్‌, కృష్ణకుమార్‌ తదితరులు మంత్రిని కలిశారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.19 అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.


Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని