సింగరేణి కార్మికులకు రూ.368 కోట్ల బోనస్‌

సింగరేణి కార్మికులకు దసరా పండగ కానుకగా సంస్థ నికర లాభాల్లో 30 శాతం సొమ్ము బోనస్‌ అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం ఆదేశించారు. ఈ మేరకు సీఎం ముఖ్య

Updated : 29 Sep 2022 05:08 IST

లాభాల్లో 30 శాతం అందించాలి

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: సింగరేణి కార్మికులకు దసరా పండగ కానుకగా సంస్థ నికర లాభాల్లో 30 శాతం సొమ్ము బోనస్‌ అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం ఆదేశించారు. ఈ మేరకు సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు సింగరేణికి ఉత్తర్వులు జారీచేశారు. గత ఏడాది కంటే ఈసారి బోనస్‌ను ఒక శాతం పెంచుతూ దసరా కానుకను సీఎం ప్రకటించడం విశేషం. సంస్థ గత ఏడాది(2021-22) బొగ్గు, విద్యుత్‌ అమ్మకాల ద్వారా రికార్డుస్థాయిలో రూ.26,607 కోట్ల టర్నోవర్‌పై రూ.1,227 కోట్ల లాభాలు ఆర్జించింది. వీటిలో 30 శాతం వాటా కింద కార్మికులకు రూ.368 కోట్లను అక్టోబరు 1న చెల్లించనున్నట్లు సంస్థ ప్రకటనలో తెలిపింది. దాదాపు 44 వేల మంది ఉద్యోగులు బోనస్‌ అందుకోనున్నారు. 2021-22 సంవత్సరంలో సంస్థ రికార్డుస్థాయిలో 650 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసింది. గత నిల్వలతో కలిపి 655 లక్షల టన్నులను సరఫరా చేసింది. సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం నుంచి 8,808 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను గ్రిడ్‌కు సరఫరా చేసింది. ఈ ఏడాది 700 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ తెలిపింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు 2013-14లో 504 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయగా.. 2021-22 నాటికి 29% వృద్ధితో 650 లక్షల టన్నులకు పెరిగింది. ఇదే కాలంలో సంస్థ అమ్మకాలు రూ.11,928 కోట్ల నుంచి 123 శాతం వృద్ధితో రూ.26,607 కోట్లకు, లాభాలు రూ.419 కోట్ల నుంచి 192% వృద్ధితో రూ.1,227 కోట్లకు పెరిగాయి. గత ఏడాది పన్నుల రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.3,596 కోట్లను సంస్థ చెల్లించింది. బోనస్‌ ప్రకటన నేపథ్యంలో కార్మికులకు సీఎండీ శ్రీధర్‌ అభినందనలు తెలిపారు.

ఎమ్మెల్సీ కవిత హర్షం
సింగరేణి సంస్థ లాభాల్లో 30 శాతం వాటాను కార్మికులకు దసరా కానుకగా ఇవ్వాలన్న సీఎం కేసీఆర్‌ నిర్ణయంపై తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హర్షం వ్యక్తంచేశారు. దేశంలోనే కార్మికులకు అత్యధిక మొత్తం దసరా బోనస్‌ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు.

దీపావళి బోనస్‌గా రూ.76,500
కొత్తగూడెం సింగరేణి, న్యూస్‌టుడే: దీపావళి బోనస్‌గా కార్మికులకు రూ.76,500 చొప్పున చెల్లించేందుకు బొగ్గు పరిశ్రమల యాజమాన్యాలు నిర్ణయించాయి. రాంచీలో జేబీసీసీఐ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారని సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని