గురుకులాల్లో జీవో 317 గుబులు

రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల ఉద్యోగుల్లో జీవో నంబర్‌ 317పై ఆందోళన మొదలైంది. రాష్ట్రపతి ఉత్తర్వుల స్ఫూర్తి అమలులో భాగంగా బోధన, బోధనేతర సిబ్బందిని సర్దుబాటు చేస్తూ

Published : 29 Sep 2022 04:34 IST

ఉద్యోగుల సర్దుబాటు ఉత్తర్వుల జారీ

పలువురికి ఇతర జిల్లాలు, జోన్ల కేటాయింపు

స్థానికత ఆధారంగా అవకాశం కల్పించాలని సిబ్బంది డిమాండ్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల ఉద్యోగుల్లో జీవో నంబర్‌ 317పై ఆందోళన మొదలైంది. రాష్ట్రపతి ఉత్తర్వుల స్ఫూర్తి అమలులో భాగంగా బోధన, బోధనేతర సిబ్బందిని సర్దుబాటు చేస్తూ గురుకుల సొసైటీలు ఆదేశాలు జారీ చేశాయి. దీంతో జోనల్‌ కేటగిరీ పరిధిలోకి వచ్చే సిబ్బందిలో 20 శాతానికి పైగా మంది సొంత స్థానికత కలిగిన జోన్లను వీడి ఇతర జోన్లకు వెళ్లాల్సి వస్తోంది. జీవో 317పై ఉద్యోగుల నుంచి ఆప్షన్లు తీసుకుని.. సర్దుబాటు ప్రక్రియ పూర్తి చేసి దాదాపు రెండు నెలలవుతోంది. తాజాగా రెండు రోజుల క్రితం సొసైటీలు ఆదేశాలు జారీ చేశాయి. ఉద్యోగులకు సంక్షిప్త సందేశాల రూపంలో సమాచారమిచ్చాయి. సర్దుబాటుతో నష్టపోయామని భావిస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది రెండు రోజులుగా సొసైటీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇతర జోన్లలో సర్దుబాటు చేయడంతో దూర ప్రాంతాల్లో పనిచేయాల్సి వస్తోందని, తమ పిల్లలకు స్థానికత కష్టాలు ఏర్పడతాయని పేర్కొంటున్నారు. స్థానికత ఆధారంగా పనిచేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. కాగా, జీవో 317 నేపథ్యంలో బోధన, బోధనేతర సిబ్బంది సొసైటీ కార్యాలయాలకు రాకుండా కట్టడి చేసేందుకు సంక్షేమ భవన్‌లో భద్రత ఆంక్షలు పెంచారు.

సొసైటీల్లో 4వేల మందికిపైగా...
సంక్షేమ గురుకులాల్లో పనిచేసే దాదాపు 4వేల మంది సిబ్బంది జీవో నంబర్‌ 317తో ప్రభావితమైనట్లు ఉద్యోగవర్గాల సమాచారం. వీరిలో జోనల్‌ కేటగిరీలోకి వచ్చే టీజీటీలు, పీడీలు, లైబ్రేరియన్‌లు(పాఠశాల), స్టాఫ్‌నర్సులు, వార్డెన్‌లు, పీఈటీలు ఎక్కువ మంది ఉన్నారు. గిరిజన సొసైటీ పరిధిలో దాదాపు 700 మంది, ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలో 900 మంది, బీసీ గురుకుల సొసైటీ పరిధిలో వెయ్యి మందికిపైగా సిబ్బంది ఇతర జోన్లకు వెళ్లాల్సి వస్తోంది. గిరిజన గురుకుల సొసైటీ పరిధిలో భద్రాద్రి జోన్‌ స్థానికత కలిగిన కొందరిని ఆసిఫాబాద్‌ జోన్‌కు మార్చారు. సర్దుబాటు ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. ప్రస్తుతం పనిచేస్తున్న చోటే కొనసాగాలని సొసైటీలు సూచించాయి. కొత్త నియామకాలు పూర్తయిన తరువాతే బదిలీ అయిన జోన్లు, మల్టీజోన్లు, జిల్లాలకు వెళ్లాలని పేర్కొన్నాయి.

రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధం...
జీవో 317.. రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధమని తెలంగాణ ఎస్సీ గురుకుల సొసైటీ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం అధ్యక్షుడు బాలరాజు విమర్శించారు. ఉద్యోగుల కుటుంబ బాధ్యతలు, ఇతర అవసరాలను దృష్టిలో పెట్టుకుని న్యాయం చేయాలని కోరుతూ సొసైటీ కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు.


అప్పీళ్లకు అవకాశం కల్పించిన ఎస్సీ గురుకుల సొసైటీ

జీవో నంబర్‌ 317కు అనుగుణంగా చేసిన సర్దుబాటుపై అభ్యంతరాలను తెలియజేసేందుకు ఎస్సీ గురుకుల సొసైటీ అవకాశమిచ్చింది. స్పౌజ్‌ కేటగిరీ ఉద్యోగులు, ఇతరులు అక్టోబరు 1 సాయంత్రం 5 గంటల్లోగా ఆయా ప్రాంతీయ సమన్వయకర్తలకు(ఆర్‌సీవో) అభ్యంతరాలు అందజేయాలని సొసైటీ కార్యదర్శి రొనాల్డ్‌ రాస్‌ ఆదేశాలు జారీ చేశారు. ఆర్‌సీవోలు అప్పీళ్లన్నింటినీ క్రోడీకరించి అక్టోబరు 3న సొసైటీ కార్యాలయానికి సమర్పించాలని సూచించారు. స్పౌజ్‌ కేటగిరీలో రాష్ట్ర ప్రభుత్వ, స్థానిక సంస్థలు, ఇతర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నవారే అర్హులని స్పష్టంచేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని