మిషన్‌ భగీరథకు జల్‌జీవన్‌ పురస్కారం

తెలంగాణలో ఇంటింటికీ మంచినీటిని అందిస్తున్న మిషన్‌ భగీరథకు కేంద్ర ప్రభుత్వ జల్‌జీవన్‌ మిషన్‌ పురస్కారం లభించింది. ఈ పథకం.. నాణ్యత, పరిమాణంలో దేశానికే ఆదర్శంగా

Published : 29 Sep 2022 04:34 IST

ఈ పథకం నాణ్యత, పరిమాణంలో దేశానికే ఆదర్శం

రాష్ట్రానికి పంపిన లేఖలో కేంద్రం వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో ఇంటింటికీ మంచినీటిని అందిస్తున్న మిషన్‌ భగీరథకు కేంద్ర ప్రభుత్వ జల్‌జీవన్‌ మిషన్‌ పురస్కారం లభించింది. ఈ పథకం.. నాణ్యత, పరిమాణంలో దేశానికే ఆదర్శంగా నిలిచిందని, అన్ని గ్రామాలలో ఇంటింటికీ నల్లా కనెక్షన్ల ద్వారా రోజూ నాణ్యమైన తాగునీరు అందిస్తున్నట్లు గుర్తించి పురస్కారానికి ఎంపిక చేసినట్లు కేంద్రం తెలిపింది.  ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి లేఖ పంపింది. అక్టోబరు 2న దిల్లీలో పురస్కారం అందుకోవాలని ఆహ్వానించింది. ఇప్పటికే 13 స్వచ్ఛ అవార్డులు సొంతం చేసుకున్న రాష్ట్రానికి ఈ అవార్డుతో కలిపి 14 రానున్నాయి. మిషన్‌ భగీరథ అమలుపై ఇటీవల కేంద్రం అధ్యయనం చేసింది. 320 గ్రామాల్లో జాతీయ స్థాయి స్వతంత్ర సంస్థ ద్వారా తనిఖీలు నిర్వహించి ప్రజాభిప్రాయాలను సేకరించింది. ఈ పథకం ద్వారా రోజూ ఇంటింటికీ నాణ్యమైన తాగునీరు అందుతున్నట్టు గుర్తించి అవార్డుకు ఎంపిక చేసింది. తెలంగాణ ప్రగతిని గుర్తించి, మరోసారి జాతీయ అవార్డుకు ఎంపిక చేయడంపై తెలంగాణ ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వ జల్‌ జీవన్‌ మిషన్‌కు ధన్యవాదాలు తెలిపింది.


కేసీఆర్‌, కేటీఆర్‌ల కృషి వల్లే అవార్డులు: ఎర్రబెల్లి

బాలసముద్రం (హనుమకొండ), న్యూస్‌టుడే: దేశంలో అత్యధికంగా మారుమూల గ్రామాలకు తాగునీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణకు పురస్కారం లభించిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. దేశంలో నూరుశాతం ఇంటింటికీ నల్లాల ద్వారా తాగునీటిని అందిస్తున్న, ఫ్లోరైడ్‌ రహిత రాష్ట్రంగా తెలంగాణకు గుర్తింపు లభించిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ల కృషి వల్లే అవార్డులు వస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. పంచాయతీరాజ్‌శాఖ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని