నేడు యాదగిరిగుట్టకు సీఎం కేసీఆర్‌

ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకోనున్నారు. సతీసమేతంగా వెళ్తున్న ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి.. ఆలయ విమాన గోపురానికి స్వర్ణ తాపడం కోసం బంగారాన్ని విరాళంగా సమర్పిస్తారు. దసరాకు జాతీయ పార్టీ ఏర్పాటు ప్రకటనపై

Published : 30 Sep 2022 03:53 IST

 ఆలయంలో ప్రత్యేక పూజలు

కిలో 16 తులాల బంగారం సమర్పణ

జాతీయ పార్టీ ప్రకటనపై సమాలోచనల నేపథ్యంలో పర్యటనకు ప్రాధాన్యం

ఈనాడు, హైదరాబాద్‌ - యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకోనున్నారు. సతీసమేతంగా వెళ్తున్న ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి.. ఆలయ విమాన గోపురానికి స్వర్ణ తాపడం కోసం బంగారాన్ని విరాళంగా సమర్పిస్తారు. దసరాకు జాతీయ పార్టీ ఏర్పాటు ప్రకటనపై సమాలోచనల నేపథ్యంలో సీఎం యాదగిరిగుట్ట పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన పర్యటనకు అధికారులు పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ప్రగతిభవన్‌ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 11.30 గంటలకు గుట్టకు చేరుకుని స్వామివారిని దర్శించుకుంటారు. ఈ సందర్భంగా క్షేత్రంలో వివిధ పనుల పురోగతిని పరిశీలించే అవకాశం ఉంది. ప్రధానాలయ దివ్య విమాన గోపురానికి బంగారు తాపడం కోసం విరాళాలు ఇవ్వాలని గతంలోనే కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు, భక్తులు.. స్వామివారికి పసిడి సమర్పించారు. తానూ కిలో 16 తులాల బంగారాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు అప్పుడు ప్రకటించిన సీఎం.. ఆ స్వర్ణాన్ని స్వామికి సమర్పించనున్నారు. జాతీయ పార్టీ ప్రకటనపై సమాలోచనల నేపథ్యంలో గుట్టలో ప్రత్యేక పూజలు చేస్తున్న సీఎం... దసరా కంటే ముందే సిద్దిపేట సమీపంలోని కోనాయపల్లి వేంకటేశ్వరస్వామిని సైతం దర్శించుకునే అవకాశం ఉంది.

రేపు హనుమకొండ పర్యటన

దామెర, న్యూస్‌టుడే: అక్టోబరు 1న ముఖ్యమంత్రి కేసీఆర్‌ హనుమకొండ జిల్లా పర్యటన ఖరారైనట్లు సీఎం కార్యాలయం గురువారం ప్రకటించింది. శనివారం ఉదయం 9 గంటలకు సీఎం రోడ్డు మార్గంలో హైదరాబాద్‌ నుంచి బయలుదేరతారు. 11.15 నిమిషాలకు హనుమకొండకు చేరుకుంటారు. అక్కడ ములుగు రోడ్డులోని ప్రతిమ రిలీఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ను ప్రారంభిస్తారు. తర్వాత స్థానికంగా ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్న భోజనం తర్వాత 2 గంటలకు హైదరాబాద్‌కు పయనమవుతారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని