దిల్లీలో ప్రశంసలు.. గల్లీలో విమర్శలు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందుచూపుతో ప్రారంభించిన మిషన్‌ భగీరథ పథకం గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ తాగునీరందిస్తూ, దేశానికి ఆదర్శంగా మారిందని ఆర్థిక, పంచాయతీరాజ్‌శాఖల మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు

Published : 30 Sep 2022 03:53 IST

 మిషన్‌ భగీరథ సహా 4 రాష్ట్ర పథకాలను కాపీ కొట్టిన కేంద్రం

మిగిలినవీ దేశమంతటా అమలు చేయాలి

మంత్రులు హరీశ్‌రావు, దయాకర్‌రావు వ్యాఖ్యలు

ఈనాడు, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందుచూపుతో ప్రారంభించిన మిషన్‌ భగీరథ పథకం గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ తాగునీరందిస్తూ, దేశానికి ఆదర్శంగా మారిందని ఆర్థిక, పంచాయతీరాజ్‌శాఖల మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, క్రాంతికిరణ్‌లతో కలిసి వారు గురువారం విలేకరులతో మాట్లాడారు. ‘దేశానికే ఆదర్శంగా మారిన మిషన్‌ భగీరథ పథకానికి జల్‌జీవన్‌ పురస్కారం ఇవ్వడానికి అక్టోబరు 2న దిల్లీ రావాలని కేంద్రప్రభుత్వం ఆహ్వానించింది. ఈ పురస్కారం తెలంగాణ ప్రజలకు అంకితం. ఈ పథకానికి ఇంతకు ముందే 30-40 అవార్డులొచ్చాయి’ అని వివరించారు. ఈ పథకాన్నే కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టి.. ‘హర్‌ ఘర్‌ జల్‌’ పేరిట ప్రారంభించిందన్నారు. ఇంకా రైతుబంధు సహా నాలుగు తెలంగాణ పథకాలను ఇలాగే కాపీ కొట్టిందని, రైతుబీమా, పల్లెప్రగతి, ఉచిత విద్యుత్తు తదితరాలనూ దేశమంతటా అమలు చేయాలని సూచించారు. కేంద్రనాయకులు ఇప్పటికైనా కళ్లు తెరవాలని, తెలంగాణ ప్రభుత్వంపై అబద్ధాల ప్రచారం మానుకోవాలని అన్నారు.

నూరు శాతం తాగునీటి కనెక్షన్లు

‘మిషన్‌ భగీరథ కింద గ్రామీణ ప్రాంతాల్లో రోజూ ప్రతి ఒక్కరికీ 100 లీటర్ల చొప్పున నాణ్యమైన తాగునీరందిస్తున్నాం. ఎత్తయిన ప్రాంతాల్లో ట్యాంకులు నిర్మించి నీటిని సరఫరా చేయడం ద్వారా విద్యుత్తు, ఇతర సమస్యలు లేకుండా చేశాం. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లోని 20 కోట్ల కుటుంబాల్లో నేటికీ 50 శాతం మందికి తాగునీటి కనెక్షన్లు లేవు. కానీ తెలంగాణలో 23,890 ఆవాసాల్లోని 54 లక్షల కుటుంబాలకు తాగునీరిస్తున్నాం. 2014 నాటికి తెలంగాణలో 30 శాతం ఆవాసాలకు తాగునీటి కనెక్షన్లు ఉంటే, ప్రస్తుతం అవి నూరుశాతానికి పెరిగాయి.’

ఏది అబద్ధమో చెప్పాలి

‘తెలంగాణ పథకాలు ఆదర్శప్రాయంగా ఉన్నాయంటూ పార్లమెంటులో మెచ్చుకుంటున్న కేంద్ర మంత్రులు.. రాష్ట్రానికి వచ్చినప్పుడు వాటిపై విమర్శలు చేస్తున్నారు. దిల్లీలో చెప్పింది అబద్ధమా... గల్లీలో చెప్పింది అబద్ధమా? వారే జవాబివ్వాలి. మిషన్‌ భగీరథకు రూ.19 వేల కోట్లు ఖర్చు చేశాం. దీని నిర్వహణకు నిధులివ్వాలని 15వ ఆర్థిక సంఘం చెప్పినా కేంద్రం పైసా ఇవ్వలేదు. తెలంగాణకు సెక్టారు ఆధారిత గ్రాంట్లు రూ.5300 కోట్లు ఇవ్వాలని సూచించినా పట్టించుకోలేదు. గుజరాత్‌లో 15 ఏళ్ల కిందట రూ.2500 కోట్లతో ఇంటింటికీ తాగునీటి పథకం చేపట్టినా, ఇప్పటికీ పూర్తికాలేదు. కానీ మిషన్‌ భగీరథ పథకాన్ని కేంద్ర జల్‌శక్తి శాఖ తమ పథకం పేరిట గొప్పలు చెప్పుకుంటోంది’ అని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో మిషన్‌ భగీరథ ఈఎన్‌సీ కృపాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని