కౌన్సెలింగ్‌ లోపాలు.. ఇంజినీరింగ్‌ కళాశాలలకు కాసులు!

ఇంజినీరింగ్‌ కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీలో విద్యాశాఖ ఉదాసీనత ప్రైవేటు కళాశాలలకు కాసులు కురిపిస్తోంది. మూడు విడతల ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ తర్వాత విద్యార్థులు ఇతర బ్రాంచిల్లోకి మారే స్లైడింగ్‌ ప్రక్రియను కళాశాలలే నిర్వహిస్తుండటంతో..

Published : 30 Sep 2022 04:09 IST

స్లైడింగ్‌ ప్రక్రియ యాజమాన్యాల చేతుల్లో..

బోధన రుసుములు నష్టపోతున్న విద్యార్థులు

ఈ ప్రక్రియలో సీట్లు బ్లాక్‌ చేసి స్పాట్‌లో విక్రయాలు!

చోద్యం చూస్తున్న ఎంసెట్‌ ప్రవేశాల కమిటీ

ఈనాడు, హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌ కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీలో విద్యాశాఖ ఉదాసీనత ప్రైవేటు కళాశాలలకు కాసులు కురిపిస్తోంది. మూడు విడతల ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ తర్వాత విద్యార్థులు ఇతర బ్రాంచిల్లోకి మారే స్లైడింగ్‌ ప్రక్రియను కళాశాలలే నిర్వహిస్తుండటంతో.. కోర్సు మారిన విద్యార్థులు బోధన రుసుములకు అర్హత కోల్పోతున్నారు. ఈ క్రమంలో డిమాండ్‌ ఉన్న సీట్లలో కొన్నింటిని కళాశాలలు బ్లాక్‌ చేస్తున్నట్లు ఎప్పటినుంచో ఆరోపణలు ఉన్నా ఎంసెట్‌ ప్రవేశాల కమిటీ పట్టించుకోవడం లేదు. 

రాష్ట్రంలోని 175 ప్రభుత్వ, ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో 70 శాతం కన్వీనర్‌ కోటా కింద 73 వేల సీట్లున్నాయి. అందులో కన్వీనర్‌ ఆధ్వర్యంలో జరిగే మూడు విడతల కౌన్సెలింగ్‌లో 45 వేల సీట్లే భర్తీ అవుతున్నాయి. ఆ తర్వాత ఆయా కళాశాలలు ఏ బ్రాంచిలో ఎన్ని సీట్లు ఖాళీలున్నాయో ప్రకటిస్తాయి. విద్యార్థి తాను చేరిన కళాశాలలో ఖాళీ సీట్ల ఆధారంగా బ్రాంచి మారేందుకు (స్లైడింగ్‌) అవకాశం ఇస్తారు. స్లైడింగ్‌ సమయంలో డిమాండ్‌ ఉన్న బ్రాంచిల్లో ఖాళీ సీట్లన్నిటినీ యాజమాన్యాలు చూపించడం లేదన్న ఆరోపణలు గత కొన్నేళ్లుగా వస్తున్నాయి. ఉదాహరణకు ఒక కళాశాలలో సీఎస్‌ఈలో 5 సీట్లు ఖాళీ ఉంటే.. నాలుగింటినే చూపి వాటిని స్లైడింగ్‌ ద్వారా భర్తీ చేస్తున్నారు. మరో సీటును తర్వాత జరిగే స్పాట్‌ కౌన్సెలింగ్‌లో విక్రయిస్తున్నారు. మరోవైపు స్లైడింగ్‌లో బ్రాంచి మారిన విద్యార్థులకు ఫీజు రీయంబర్స్‌మెంట్‌కు అర్హత ఉండదు. అలా ఏటా దాదాపు 5 వేల మంది నష్టపోతున్నారని అంచనా. ‘‘స్లైడింగ్‌ ప్రక్రియను కన్వీనర్‌ ద్వారా చేపడితే విద్యార్థులకు బోధన రుసుములు వస్తాయి. యాజమాన్యాలు సీట్లను బ్లాక్‌ చేయకుండా నిరోధించవచ్చు’’ అని నిపుణులు సూచిస్తున్నా.. ప్రవేశాల కమిటీ పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


‘స్పాట్‌’ సైతం వారికెందుకు?

కన్వీనర్‌ కోటాలో మిగిలిపోయిన సీట్లకు స్పాట్‌ ప్రవేశాల నిర్వహణ యాజమాన్యాల చేతుల్లోనే ఉంది. ఈ నేపథ్యంలో డిమాండ్‌ ఉన్న సీట్లను వేలం పాట మాదిరిగా విక్రయిస్తున్నారు. యాజమాన్య కోటా కింద సీట్లు లభించకపోతే కొన్ని కళాశాలలు స్పాట్‌లో చేరొచ్చని హామీ ఇస్తున్నాయి. ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశానికి జోసా కౌన్సెలింగ్‌ ముగిశాక.. ఎన్‌ఐటీలు, ఇతర సంస్థల్లో మిగిలిపోయిన సీట్లకు సెంట్రల్‌ సీట్‌ అలకేషన్‌ బోర్డు (సీశాబ్‌) ద్వారా రెండు విడతల కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారు. చివరి నిమిషంలో ఇక్కడ సీటు వచ్చిన విద్యార్థులు రాష్ట్ర కళాశాలల్లో సీటు వదులుకుంటారు. వాటిని సైతం కళాశాలల యాజమాన్యాలు విక్రయించుకుంటున్నాయి. అంటే యాజమాన్య కోటా సీట్లనే కాకుండా కన్వీనర్‌ కోటాలో వేల సీట్లు కళాశాలల చేతుల్లో ఉంటున్నట్లు స్పష్టమవుతోంది. ఎంసెట్‌ ప్రవేశాల జీఓను సవరించి.. స్పాట్‌ ప్రవేశాలను సైతం కన్వీనరే భర్తీ చేసేలా చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. లోపాలకు తావియ్యకుండా.. కన్వీనర్‌ కోటాతో పాటు.. ఇతర సీట్లనూ ప్రవేశాల కమిటీనే భర్తీ చేయాలని తెలంగాణ పాఠశాలలు, సాంకేతిక కళాశాలల ఉద్యోగుల సంఘం (టీఎస్‌టీసీఈఏ) రాష్ట్ర అధ్యక్షుడు అయినేని సంతోష్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని