ఆ ఎస్సైలపై చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేస్తా

నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ నియోజకవర్గంలోని కొల్లాపూర్‌, పెద్దకొత్తపల్లి, చిన్నంబావి ఎస్సైలతోపాటు కోడేరులో గతంలో పనిచేసిన ఎస్సైపైనా చర్యలు తీసుకోకపోతే దసరా తర్వాత ప్రత్యక్ష ఆందోళనకు కార్యాచరణ ప్రకటిస్తానని మాజీ మంత్రి జూపల్లి

Published : 30 Sep 2022 04:09 IST

మాజీ మంత్రి జూపల్లి వెల్లడి

తెలంగాణ ద్రోహి చెప్పినట్లు మంత్రి నిరంజన్‌రెడ్డి ఆడుతున్నారని ఆరోపణ

నాగర్‌కర్నూల్‌, న్యూస్‌టుడే: నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ నియోజకవర్గంలోని కొల్లాపూర్‌, పెద్దకొత్తపల్లి, చిన్నంబావి ఎస్సైలతోపాటు కోడేరులో గతంలో పనిచేసిన ఎస్సైపైనా చర్యలు తీసుకోకపోతే దసరా తర్వాత ప్రత్యక్ష ఆందోళనకు కార్యాచరణ ప్రకటిస్తానని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. గురువారం నాగర్‌కర్నూల్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌లో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసి పోలీసు వ్యవస్థను బలోపేతం చేస్తుంటే కొల్లాపూర్‌ నియోజకవర్గంలో మాత్రం ఈ వ్యవస్థ అరాచకం హద్దులు దాటిందని విమర్శించారు. తెలంగాణ ద్రోహి చెప్పినట్లు మంత్రి నిరంజన్‌రెడ్డి ఆడుతున్నారని ఆరోపించారు. నాలుగు ఠాణాల పరిధిలో జరిగిన అరాచకాలు, పోలీసుల రౌడీయిజాన్ని ఎస్పీ, డీజీపీలతోపాటు హోంమంత్రి మహమూద్‌ అలీ, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ల దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. అయినప్పటికీ చర్యలు లేవన్నారు. ఎస్సైలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, థర్డ్‌ డిగ్రీ ప్రయోగిస్తున్నారని, ఉద్యమకారులపై అణచివేత ధోరణి కొనసాగిస్తున్నారని వెల్లడించారు. చర్యలు తీసుకునే వ్యవస్థ చచ్చిపోయిందా? అని ప్రశ్నించారు. ఎన్నో ఘోరాలు చేసిన ఓ ఎస్సైకి అవార్డు ఇచ్చారని, అనంతరం ఆ ఠాణా పరిధిలో 8 దొంగతనాలు జరిగాయన్నారు. నియోజకవర్గంలో నాలుగు క్రిమినల్‌ కేసులు ఉన్న ఓ నాయకుడిని అరెస్టు చేయని పోలీసులు.. మొలచింతపల్లిలో సంబంధం లేని 26 మందిపై 307 సెక్షన్‌ కేసులు నమోదు చేసి ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. కోడేరులో ప్రభుత్వ భూమి కబ్జాపై సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన వ్యక్తిపై తుపాకీ పెట్టి తప్పుడు కాగితం రాయించారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని